బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు... రిపీటైతే కూటమికి చేటే!
ఏపీలో టీడీపీ-బీజేపీ-జనసేన కూటమిగా అవతరించి.. చిన్న చిన్న లోపాలను సరిదిద్దుకుని.. ఎన్నికల్లో పోటీ చేశాయి.
ఏపీలో టీడీపీ-బీజేపీ-జనసేన కూటమిగా అవతరించి.. చిన్న చిన్న లోపాలను సరిదిద్దుకుని.. ఎన్నికల్లో పోటీ చేశాయి. దీంతో ఎవరూ ఊహించని విధంగా బీజేపీకి 1 శాతం ఓటు బ్యాంకు లేకపోయినా.. 8 మంది ఎమ్మల్యేలు దక్కారు. అదేసమయంలో ఆరు స్థానాల్లో పోటీ చేసి 3 ఎంపీ స్థానాల్లో విజయం దక్కించు కుంది. ఇదేమీ చిన్న విషయం కాదు. కూటమి కట్టకపోతే.. టీడీపీ, జనసేనల దన్ను లేకపోతే.. బీజేపీకి ఈ భారీ విజయం దక్కి ఉండేది కాదు. 2014లో కూటమి కట్టి.. ఇద్దరు ఎంపీలను, గెలుచుకున్న పార్టీ.. నలుగురు ఎమ్మెల్యేలను కూడా దక్కించుకుంది.
ఇక, 2019లో కూటమితో విభేదించి.. అభాసుపాలైంది. ఒక్కరంటే ఒక్కరు కూడా విజయం దక్కించుకోలేక పోయారు. ఇక, ఇప్పుడు కూటమి కట్టి భారీవిజయం దక్కించుకున్నారు. ఈ హిస్టరీని మరిచిపోయారో.. లేక నోటి దూల అనుకున్నారో.. ఏమో .. నరసాపురం ఎంపీ, కేంద్ర మంత్రి, బీజేపీనాయకులు.. భూపతిరాజు శ్రీనివాసవర్మ నోరు జారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజా తన పార్టీ నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన నోరు పారేసుకున్నారు.
``నాకు ఎంపీ సీటు వచ్చిన తర్వాత.. కూడా కొందరు ఎల్లో బ్యాచ్.. నాకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. నేను పోటీకి అనర్హుడినని.. టికెట్ ఇచ్చి వృధా చేశారని.. దీనిని రేపో మాపో వేరేవారికి(రఘురామరాజు పేరు చెప్పలేదు) ఇచ్చేస్తారని.. పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కానీ.. నేనేంటో నేను నిరూపించుకున్నా. నరసాపురంలో విజయం దక్కించుకున్నా. ఇప్పటికైనా ఎల్లో మీడియా.. ఎల్లో బ్యాచ్ పద్దతిగా ఉండాలి`` అని వ్యాఖ్యానించారు.
వాస్తవానికి ఆయన ఉద్దేశం ఏమైనా.. వ్యక్తిగతంగా మాత్రం వర్మకు కానీ.. బీజేపీకి కానీ.. నరసాపురంలోనే కాదు.. రాష్ట్రంలోనే విజయం దక్కించుకునేంత ఓటు బ్యాంకు లేదు. పైగా.. 2009లో ఇక్కడ నుంచే పోటీ చేసిన వర్మకు 11 వేల ఓట్లు వచ్చాయి. మరి అప్పడు ఆయన సత్తా ఏమైంది? ఆయన ఎందుకు గెలవలేక పోయారు? అనేది ప్రశ్న. ఇక, ఇప్పుడు కూటమి బలంతో ఏకంగా 7 లక్షల ఓట్లు తెచ్చుకున్నారు. కానీ, ఆయన ఈ విషయాన్ని అంగీకరించలేక పోతున్నారు. కూటమిది , టీడీపీది ఏమీ లేదన్నట్టుగా భావిస్తున్నారు.
వాస్తవం ఏంటంటే.. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల.. పార్టీకే ప్రమాదం. ఇదేసమయంలో కూటమిలో నూ చిచ్చు పెట్టే అవకాశం ఉంటుంది. ఇప్పుడే మొదలైన కూటమి ప్రయాణంలో తొలి అడుగులు ఇలా ఉంటే.. ఐదేళ్లు గడిచేసరికి ఎలాంటి పరిస్థితి వస్తుందో ఊహించలేం. సో.. ఇప్పటికైనా ఇలాంటి వారికి చెక్ పెట్టాల్సిన అవసరం రాష్ట్ర, కేంద్ర బీజేపీ నాయకత్వాలకు ఉంది. మంచికో.. చెడుకో.. ఇప్పుడు ఆయన అనేశారు. ఇక, మీదటైనా జాగ్రత్తలు తీసుకోకపోతే.. బీజేపీకి , కూటమికి కూడా ఇబ్బందులు తప్పవు.