ఫోన్ ట్యాపింగ్ పై హైకోర్టుకు రాష్ట్ర సర్కారు కీలక సమాచారం

ఈ నేపథ్యంలో స్పందించిన హైకోర్టు ఈ వ్యవహరాన్ని సుమోటోగా విచారణకు చేపట్టింది. రాష్ట్రానికి.. కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.

Update: 2024-08-21 04:25 GMT

పెను సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ ఇష్యూకు సంబంధించి తెలంగాణ హైకోర్టులో జరుగుతున్న కేసు విచారణలో తాజాగా కేంద్రప్రభుత్వం.. రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్లు దాఖలు చేసింది. ఈ సందర్భంగా కీలక సమాచారాన్ని అందించింది. రేవంత్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత.. కేసీఆర్ పదేళ్ల పాలనలో వివిధ రంగాలకు చెందిన వారికి సంబంధించిన పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లుగా మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు రావటం తెలిసిందే. అందులోనూ వివిధ రంగాల వారితో పాటు.. న్యాయమూర్తుల ఫోన్లను సైతం ట్యాప్ చేశారని.. నిఘా విభాగపు అదనపు ఎస్పీ నాయిని భుజంగరావు తన నేరాంగీకార వాంగ్మూలంలో పేర్కొనటం సంచలనంగా మారింది.

ఈ నేపథ్యంలో స్పందించిన హైకోర్టు ఈ వ్యవహరాన్ని సుమోటోగా విచారణకు చేపట్టింది. రాష్ట్రానికి.. కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కేంద్రం తన కౌంటర్ లో స్పష్టమైన అంశాల్ని పేర్కొంది. ట్యాపింగ్ కు తాము ఎలాంటి అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ తో తమకు ఎలాంటి సంబంధం లేదని.. తమ అనుమతి కోరలేదని.. ఫోన్ ట్యాపింప్ కు రాష్ట్ర హోం శాఖ అనుమతి ఇవ్వొచ్చని.. రాష్ట్రానికి ఆ అధికారం ఉందని.. గరిష్ఠంగా అరవై రోజుల వరకు అనుమతించొచ్చని తమ కౌంటర్ లో కేంద్రం తరఫున డిప్యూటీ సొలిసిటర్ జనరల్ గాడి ప్రవీణ్ కుమార్ కౌంటర్ దాఖలు చేశారు. అనంతరం తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేస్తూ కోర్టు పేర్కొంది.

ఇక.. తెలంగాణ ప్రభుత్వం తరఫున రాష్ట్ర హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా తరఫున అడిషనల్ అడ్వొకేట్ జనరల్ ఇమ్రాన్ ఖాన్ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా వారు అనుమతి లేకుండానే రాజ్యాంగ పదవుల్లో ఉన్న అత్యున్నత స్థాయి అధికారులు.. నేతల ఫోన్లు ట్యాప్ చేశారని పేర్కొన్నారు. దీనికి సంబంధించి విదేశాల్లో నిందితులు ఉన్నారని.. వారిని తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లుగా వెల్లడించారు. ప్రణీత్ కుమార్ర తనకున్న అధికారాన్ని అడ్డు పెట్టుకొని పలువురితో కుమ్మక్కై పదేళ్లుగా సేకరించిన అనధికార సమాచారాన్ని తన వ్యక్తిగత పెన్ డ్రైవ్ లలో.. హార్డ్ డిస్కుల్లో నిక్షిప్తం చేశాడని.. ఆ తర్వాత పలు కంప్యూటర్లు.. హార్డ్ డిస్కులను ధ్వంసం చేసినట్లుగా పేర్కొన్నారు.

ఈ కేసులో అరుగురు నిందితుల్ని గుర్తించినట్లుగా పేర్కొంటూ..

ఏ1 ప్రభాకర్ రావు

ఏ2 ప్రణీత్ కుమార్

ఏ3 భుజంగరావు

ఏ4 తిరుపతన్న

ఏ5 రాధాకిషన్ రావు

ఏ6 శ్రవణ్ కుమార్ లు ఉన్నట్లు పేర్కొన్నారు. వీరిలో ఏ1, ఏ6లు పరారీలో ఉన్నారని పేర్కొన్నారు. విదేశాల్లో ఉన్న ప్రభాకర్ రావు ను రెడ్ కార్నర్ నోటీసులపై రప్పించే ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా పేర్కొన్నారు. వీరంతా అప్పటి అధికార పార్టీకి అనుకూలంగా పని చేసేందుకు ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టాన్ని ఉల్లంఘించటమే కాదు.. నేరాలకు పాల్పడినట్లుగా పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం అత్యవసర పరిస్థితుల్లో ఏడీజీపీ.. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఐజీపీ.. కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ ఐజీపీలు ఫోన్ ట్యాపింగ్ కు అనుమతించొచ్చని.. అయితే, ఈ సమాచారాన్ని కాంపిటెంట్ అథారిటీకి మూడు రోజుల్లో వివరాలు తెలియజేయాలని పేర్కొన్నారు. ఆయన ఏడు రోజుల్లో దాన్ని ధ్రువీకరించారని.. కానీ అలాంటిదేమీ ఈ ఉదంతంలో చోటుచేసుకోలేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

ప్రభాకర్ రావు పదవీ విరమణ పొందిన తర్వాత నిఘా విభాగంలో కీలక పోస్టును కట్టబెట్టారని.. మూడేళ్ల వరకు ఆయన్ను ఆ పదవిలో కొనసాగించినట్లుగా కోర్టుకు తెలిపారు. టెలికం సంస్థలకు లేఖ రాసిన అప్పటి రాష్ట్ర ప్రభుత్వం.. ప్రభాకర్ రావు అడిగిన ఏ సమాచారాన్ని అయినా ఇవ్వాలని చెప్పిందని పేర్కొన్నారు. అంతేకాదు.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కౌంటర్ దాఖలు చేసిన రవిగుప్తా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అవేమంటే..

- అప్పటి హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా నాకు అధికారం ఉంది.

- కానీ, నాకు తెలీకుండా నిందితులు రికార్డులు ఎలా తయారు చేశారు?

- కొందరిని ఎలా తప్పుదోవ పట్టించారు?

- 2019 అక్టోబరు నుంచి 2022 డిసెంబరు వరకు నేను హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పని చేశా.

- హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనుమతి లేకుండా ఫోన్ ట్యాపింగ్ చేయటం చట్టవిరుద్ధం.

- హోం శాఖ చట్టాలు.. నిబంధనలు.. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్లపై నాకు పూర్తి అవగాహన ఉంది.

- ఇండియన్ టెలిగ్రాఫ్ రూల్స్ 419ఏ, ఐటీ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)లోని నిబంధనల్ని ఉల్లంఘిస్తూ అక్రమాలకు పాల్పడ్డారు.

- ప్రజాస్వామ్య వ్యవస్థనే ప్రభావితం చేసే తీవ్రమైన నేరాలకు పాల్పడ్డారు. దీని వెనుక ఎవరున్నా వదిలిపెట్టం.

Tags:    

Similar News