ఐరాస వేదికగా కెనడా, పాకిస్థాన్ లను కడిగేసిన జైశంకర్!
ఐక్యరాజ్యసమితి వేదికగా పాకిస్థాన్ ను ఇప్పటికే కడిగిపారేసిన భారత్... తాజాగా ఆ దేశానికి తోడు కెనడానూ చేర్చింది
ఐక్యరాజ్యసమితి వేదికగా పాకిస్థాన్ ను ఇప్పటికే కడిగిపారేసిన భారత్... తాజాగా ఆ దేశానికి తోడు కెనడానూ చేర్చింది. ఇందులో భాగంగా భారత్ పట్ల ఆ దేశం అనుసరిస్తోన్న వైఖరిని ప్రపంచ వేదిక సాక్షిగా దులిపేసింది. ఇప్పటికే జమ్మూకశ్మీర్ లో పాకిస్థాన్ ఆక్రమిత ప్రాంతాలను ఖాళీ చేయాలని, సీమాంతర ఉగ్రవాదాన్ని అరికట్టాలని సూచిస్తూ.. 2011 ముంబై ఉగ్రవాద దాడికి పాల్పడిన వారిపై చర్య తీసుకోవాలని భారత దౌత్యవేత్త పెటల్ గెహ్లాట్ పాకిస్థాన్ ను గట్టిగా వాయించి వదిలిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో తాజాగా ఐక్యరాజ్య సమితి వేదికగా పాకిస్థాన్ తో పాటు కెనడానూ వాయించి వదిలారు భారత విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు జైశంకర్.. భారత్ సాధించిన విజయాలైన చంద్రయాన్ 3, అమృత్ కాల్, చట్టసభల్లో మహిళా రిజర్వేషన్, అంతర్జాతీయ ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి అనుసరించాల్సిన వ్యూహాలు, భారత్ లో విజయవంతంగా ముగిసిన జీ20 శిఖరాగ్ర సదస్సు గురించి వివరించారు.
అనంతరం జమ్మూకశ్మీర్ అంశంపై ఇటీవల పాకిస్థాన్ ఆపద్ధర్మ ప్రధాని అన్వర్ ఉల్ హక్ కాకర్ చేసిన వ్యాఖ్యలు, మరోవైపు భారత్ - కెనడాల మధ్య నెలకొన్న దౌత్యపర ఉద్రిక్తతల నేపథ్యంలో... ఐక్యరాజ్య సమితి 78వ సర్వసభ్య సమావేశంలో విదేశాంగ మంత్రి జై శంకర్ గట్టిగా మాట్లాడారు. ప్రాదేశిక సమగ్రతను గౌరవించడం, అంతర్గత వ్యవహారాల్లో జోక్యం ఉండకూడదన్న విషయం కొన్ని దేశాలకే పరిమితం కాకూడదని పిలుపునిచ్చారు.
ఉగ్రవాదం, హింసాత్మక వాతావరణానికి అన్ని దేశాలు ఉమ్మడిగా స్వస్తి పలకాల్సిన అవసరం ఏర్పడిందని.. ఇదే సమయంలో ఒక దేశ ప్రాదేశికతను, సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను గౌరవించడంతోపాటు అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం వంటి అంశాలను అన్ని దేశాలవారు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని కెనడాను ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానించారు.
కాగా... ఖలిస్థానీ ఉగ్రవాది హర్ దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ఏజెంట్ల హస్తం ఉండొచ్చంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణల సంగతి తెలిసిందే. అనంతరం భారత్ - కెనడా మధ్య దౌత్యపరమైన వాతావరణం తీవ్ర స్థాయిలో వేడెక్కింది. ఈ క్రమంలోనే ఐరాసా వేదికపై కెనడా ప్రస్థావన తీసుకొచ్చింది భారత్!
మరోపక్క హర్ దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించిన 90 సెకన్ల వీడియోను తాము పరిశీలించినట్లు వాషింగ్టన్ పోస్ట్ పత్రిక కథనం ప్రచురించింది. ఇందులో భాగంగా... జూన్ 18న నిజ్జర్ ప్రయాణిస్తున్న ట్రక్కుకు కారును అడ్డుపెట్టిన ఇద్దరు వ్యక్తులు.. అతడిపై విచక్షణారహితంగా అన్నట్లుగా కాల్పులు జరిపి పారిపోయినట్లు పేర్కొంది. ఆ సమయంలో నిజ్జర్ పై 50 రౌండ్ల కాల్పులు జరపగా, అతడి శరీరంలోకి 34 బుల్లెట్లు దిగాయని వివరించింది.