జూనియర్ జహీర్ ఖాన్... సచిన్ ట్యాగ్డ్ వీడియో వైరల్!
ఈ ప్రయాణంలో ప్రతీ అడుగులో రకరకాల అడ్డగీతలు దర్శనమిస్తుంటాయని చెబుతుంటారు.
భారతదేశంలోని కోట్ల జనాభాలో మట్టిలో మాణిక్యాలు ఎన్నో ఉన్నాయని.. కాకపోతే వారి ప్రతిభ ప్రపంచానికి తెలియజేసే అవకాశాలు అతి తక్కువని.. దీంతో, అవి అలా మట్టిలోనే మిగిలిపోతున్నాయనే చర్చ నిత్యం జరుగుతూ ఉంటుంది. ఈ ప్రయాణంలో ప్రతీ అడుగులో రకరకాల అడ్డగీతలు దర్శనమిస్తుంటాయని చెబుతుంటారు.
కానీ... నిజంగా వారి లోని ప్రతిభను గుర్తించి కాస్త ప్రోత్సాహం ఇవ్వగలిగితే ఆకాశమే హద్దుగా చెలరేగిపోతారాని.. ఫలితంగా.. కన్నవారికి, ఉన్న ఊరికి, దేశానికీ గొప్ప పేరుప్రతిష్టలు తెస్తారని చెబుతుంటారు. ఈ క్రమంలో... టీమిండియా మాజీ దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ ఓ వీడియోను షేర్ చేశారు. ఇది ఇప్పుడు వైరల్ గా మారింది.
అవును... ఓ చిన్నారి బౌలింగ్ విత్ యాక్షన్ కు సచిన్ టెండుల్కర్ ఫిదా అయ్యారు. ఈ సందర్భంగా... సుశీలా మీనా అనే బాలిక బౌలింగ్ చేస్తున్న వీడియోను ఆయన "ఎక్స్"లో షేర్ చేస్తూ... ఆమె బౌలింగ్ లో జహీర్ ఖాన్ స్టైల్ కనబడుతోందని పేర్కొంటూ అతడిని ట్యాగ్ చేశారు. దీంతో.. ఒక్కసారిగా ఈ విషయం వైరల్ గా మారింది.
ఈ సందర్భంగా... ఆమె మృదువుగా, చూసేందుకు మనోహరంగా బౌలింగ్ చేస్తుందని.. ఆమె బౌలింగ్ యాక్షన్ లో జహీర్ షేడ్స్ కనిపిస్తున్నాయని అన్నారు. దీనికి వెంటనే స్పందించిన జహీర్... సచిన్ వ్యాఖ్యలతో ఏకీభవించడం లేదని.. ఆమె తనకంటే మరింత మృదువుగా, మరింత మనోహరంగా బౌలింగ్ చేస్తుందన్నట్లుగా స్పందించారు.
ఇదే సమయంలో... ఆదిత్యా బిర్లా గ్రూపు కూడా వెంటనే ఈ వీడియోపై స్పందించింది. ఆమె అద్భుతమైన టాలెంట్ ను కలిగి ఉందని.. ఆమె ప్రయాణంలో సహకరిస్తూ, క్రికెట్ ట్రైనింగ్ ఇప్పించడానికి "ఫొర్స్ ఫర్స్ ఫుడ్" నుంచి తాము ముందుకురావడం తమకెంతో సంతోషంగా ఉందని వెల్లడించింది.
ఈ నేపథ్యంలో... ఆమె బౌలింగ్ స్టైల్ చూసిన నెటిజన్లు "జూనియర్ జహీర్ ఖాన్" అంటూ ఆమెను ప్రశంసిస్తున్నారు. భవిష్యత్తులో టీమిండియా మహిళా క్రికెట్ లో తనదైన ముద్ర వేయడం కన్ ఫా అని అంటున్నారు.