ఇప్పుడు సునీత కింకర్తవ్యం ఏమిటి?
2019 ఎన్నికల ముందు దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన సంగతి తెలిసిందే.
2019 ఎన్నికల ముందు దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన సంగతి తెలిసిందే. ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేసింది. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల్లోనూ రాజకీయ పార్టీల ప్రచారంలో వివేకా హత్య హాట్ టాపిక్ గా మారుతోంది.
ఈ నేపథ్యంలో వైసీపీ కడప జిల్లా కోర్టును ఆశ్రయించింది. సీబీఐ కోర్టు విచారణలో పెండింగులో ఉన్న ఈ కేసుకు సంబంధించి ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఆయా పార్టీల అధినేతలను, వారి క్యాడర్ ను ఆదేశించాలంటూ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో కోర్టు ముందు విచారణలో ఉన్న కేసు గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దంటూ టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్, జనసేనాని పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీత తదితరులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డిపై దుష్ప్రచారాన్ని ఆపాలని కడప జిల్లా కోర్టు ప్రతిపక్ష నేతలకు ఆదేశాలు జారీ చేసింది. నేరం నిరూపితమయ్యేంతవరకు నిందితులు అమాయకులేనని కోర్టు వెల్లడించింది.
ఈ నేపథ్యంలో కడప జిల్లా కోర్టు ఆదేశాలపై వివేకా కుమార్తె సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఆదేశాలను తాను హైకోర్టులో సవాల్ చేస్తానని తెలిపారు. న్యాయం కోసం ప్రజల తీర్పు కోరుతుంటే వైసీపీ అడ్డుపడుతోందని మండిపడ్డారు. పులివెందులలో తాను ప్రచారం చేయకుండా కేసులు వేసి అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. తన తండ్రిపై వైసీపీ నేతలు చాలాసార్లు మాట్లాడారని.. తాను మాట్లాడితే అభ్యంతరాలెందుకని నిలదీశారు.
కడప జిల్లా కోర్టు ఆదేశాలతో మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే ప్రజలు తనను క్షమించాలన్నారు. ఈ ఎన్నికల్లో షర్మిలను గెలిపించాలని కోరారు. తనను చూసి వైసీపీ నేతలకు వణుకు పుట్టి కోర్టు కెళ్లి అడ్డుకున్నారని సునీత ఎద్దేవా చేశారు. న్యాయం కోసం ప్రజల ముందుకొస్తే రానీయకుండా అడ్డకుంటున్నారని మండిపడ్డారు. ప్రజల ముందుకు న్యాయం కోసం వెళ్తే రానీయకుండా భయభ్రాంతులకు గురిచేస్తున్నారని వాపోయారు.
తన తండ్రి గురించి ఇన్నేళ్లలో తాను మీడియాతో మాట్లాడింది కేవలం ఐదుసార్లేనని సునీత గుర్తు చేశారు. అయితే ఈ ఐదేళ్లలో తన తండ్రి గురించి ఎవరెన్ని మాటలు మాట్లాడారో.. ఎంతగా అవమానించారో అందరికీ తెలిసిందేనన్నారు. పులివెందులలో తమకు సాయం చేసేవారిని కూడా బెదిరిస్తున్నారని సునీత మండిపడ్డారు.
ఇప్పుడు ఏతావాతా తేలిదేమిటంటే సునీత హైకోర్టుకు వెళ్లి కడప జిల్లా కోర్టు ఆదేశాలను సవాల్ చేయనున్నారు. అక్కడ ఆమెకు అనుకూలంగా తీర్పు ఇస్తే ఈ ఎన్నికల్లో వైఎస్ అవినాశ్ రెడ్డికి వ్యతిరేకంగా ఆమె మాట్లాడే అవకాశం ఉంటుంది. హైకోర్టులో తీర్పు అనుకూలంగా రాకపోతే తన తండ్రి హత్య కేసులో విమర్శలు చేసే అవకాశం ఉండదు.