స్కిల్ స్కాం కేసులో తీర్పు రిజర్వ్... బెయిల్ కు నో చెప్పిన సుప్రీం!!

ఆ సంగతి అలా ఉంటే... స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం కేసును కొట్టేయాలని కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ (ఎస్.ఎల్.పి) పై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్‌ చేసింది.

Update: 2023-10-17 12:17 GMT

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబుకు ఏ కోర్టులోనూ ఈరోజు ఉపశమనం లభించలేదనే చెప్పాలి! ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ లపై విచారణను హైకోర్టు ధర్మాసనం ఈ నెల 19కి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ విచారణ నేపథ్యంలో హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని అంటున్నారు. మరోవైపు విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు లాయర్లు ఆయన హెల్త్ అప్ డేట్స్ ఇవ్వాలని కోరుతూ మరో పిటిషన్ లో సీఐడీ కౌంటర్ దాఖలు చేయాలని సూచిస్తూ విచారణను వాయిదా వేసింది.

ఆ సంగతి అలా ఉంటే... స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం కేసును కొట్టేయాలని కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ (ఎస్.ఎల్.పి) పై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్‌ చేసింది. జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌, జస్టిస్‌ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ధర్మాసనం ఎదుట తాజాగా వాదనలు ముగిశాయి. దీంతో... ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్‌ చేసింది. ఇందులో భాగంగా చంద్రబాబు తరఫున సీనియర్‌ న్యాయవాది హరీష్ సాల్వే వాదనలు వినిపించగా... ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించారు.

ఈ కేసులో వాదనలు సందర్భంగా... ఈ కేసులో 17ఏ సెక్షన్‌ వర్తించదని రోహత్గీ వాదించారు. మరోపక్క చంద్రబాబుకు 17ఏ వర్తిస్తుందని ఆయన తరుపు న్యాయవాది హరీష్ సాల్వే వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా ఈ కేసులో 17ఏ వర్తించినా.. మిగిలిన ఐపీసీ సెక్షన్‌ లపై విచారించే అధికారం ప్రత్యేక కోర్టుకు ఉందని తెలిపిన సీఐడీ తరుపు లాయర్‌ రోహత్గీ... ఎఫ్‌ఐఆర్‌ లో కాగ్నిజబుల్‌ అఫెన్సెస్‌ కు సంబంధించిన సెక్షన్లు ఉన్నాయా.. లేదా.. అనేది ముఖ్యమని, ఈ విషయాన్ని మాత్రమే కోర్టులు పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.

ఇదే సమయంలో తన వాదనలకు మరింత పదును పెంచిన రోహీత్గీ... స్కిల్‌ స్కాం కేసులో వందల కోట్ల అవినీతి జరిగిందని, ఇందులో చంద్రబాబు పక్కా ఆధారాలతో దొరికారని తెలిపారు. ఇదే సమయంలో ఇప్పటికే ఈ కేసులో ఈడీ, ఇన్‌ కమ్‌ ట్యాక్స్‌ సంస్థలు విచారణ చేస్తున్నాయని గుర్తుచేశారు! ఈ విధంగా జాతియస్థాయిలో సైతం ఇన్ని విచారణ సంస్థలు దర్యాప్తు జరుపుతున్నప్పుడు ఇది రాజకీయ కక్ష ఎలా అవుతుందని ప్రశ్నించిన ఆయన... ఈ కేసులో ఫొరెన్సిక్ నివేదిక చూస్తే షాక్‌ అవుతారని తెలిపారు.

అదేవిధంగా వాదనలు కొనసాగించిన రోహత్గీ... 17ఏ అనేది ఈ కేసులో వర్తించదని, ఆ చట్టం రావడానికి ముందే ఈ నేరం జరిగిందని పునరుద్ఘాటించారు. ఇందులో భాగంగా... 2018 జులైలో 17ఏ చట్టం అమలులోకి వచ్చిందని, 2018 జులై కంటే ముందు నేరం జరిగింది కాబట్టి 17ఏ అనేది ఈ కేసులో వర్తించదని అన్నారు. 2015-16లో లేని చట్టం అనేది అప్పుడు జరిగిన నేరానికి ఎలా వర్తిస్తుందని ఈ సందర్భంగా సీఐడీ తరుపు లాయర్ వాదించారు.

మరోపక్క ఈ కేసులో చంద్రబాబు తరుపు న్యాయవాది హరీష్ సాల్వే వర్చువల్‌ గా వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా 2019 నాటి "శాంతి కండక్టర్స్‌" కేసు, 1964 నాటి "రతన్‌ లాల్‌" కేసును ప్రస్తావించారు. సెక్షన్‌ 17ఏ లేకపోతే రాజకీయంగా వేధించే అవకాశం ఉంటుందని, ఆధారాల సేకరణ కూడా సరైన పద్ధతిలో జరుగుతుందన్న నమ్మకం లేదని అన్నారు. అదేవిధంగా... 73 ఏళ్ల వయస్సు ఉన్న చంద్రబాబు 40 రోజులుగా జైలులో ఉన్నారని తెలిపారు.

అనంతరం... కోర్టు సెలవుల దృష్ట్యా దయ చేసి చంద్రబాబుకు మధ్యంతర బెయిల్‌ ఇచ్చే అంశాన్ని పరిశీలించండి అని తెలిపిన ఆయన... కోర్టుకు అవసరమైతే లిఖితపూర్వక వాదనలు సమర్పిస్తామని తెలిపారు. ఈ సమయంలో ఇరుపక్షాల వాదనలు విన్న ద్విసభ్య ధర్మాసనం తీర్పు రిజర్వ్‌ చేసింది. ఇదే సమయంలో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలనే అభ్యర్థనపైనా ధర్మాసనం సానుకూలంగా స్పందించలేదని తెలుస్తుంది!

ఈ నేపథ్యంలో... స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై తీర్పును వచ్చే శుక్రవారానికి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. అదే రోజు మధ్యంతర బెయిల్ పైనా వాదనలు వినేందుకు అంగీకరించింది. అదేవిధంగా ఏపీ ఫైబర్ నెట్ కేసులోనూ ముందస్తు బెయిల్ పై అదే రోజు వాదనలు వినడంతో పాటు ఉత్తర్వులు జారీ చేస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది.

Tags:    

Similar News