ఎట్టకేలకు క్షమాపణలు చెప్పిన తలసాని.. అసలేమైందంటే?
ఇటీవల ముషీరాబాద్ లో స్టీల్ బ్రిడ్జి ప్రారంభించటం తెలిసిందే. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్.. తలసాని.. తదితర నేతలు హాజరయ్యారు
రాజకీయ ప్రత్యర్థులపై వెనుకా ముందు చూడకుండా సంచలన వ్యాఖ్యలు చేయటంలో దూకుడు ప్రదర్శించే తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని.. తాను చేసే వ్యాఖ్యల్ని సమర్థించుకుంటారే తప్పించి వెనక్కి తీసుకోవటం దాదాపుగా కనిపించదు. తన తీరును ఆయన బలంగా సమర్థించుకుంటారు. అలాంటి తలసాని రోటీన్ కు భిన్నంగా క్షమాపణలు చెప్పారు. తాను చేసిన పనికి చింతిస్తున్నట్లు చెప్పిన ఆయన.. తానెందుకు అలా వ్యవహరించాల్సి వచ్చిందన్న విషయాన్ని వివరించే ప్రయత్నం చేశారు.
ఇటీవల ముషీరాబాద్ లో స్టీల్ బ్రిడ్జి ప్రారంభించటం తెలిసిందే. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్.. తలసాని.. తదితర నేతలు హాజరయ్యారు. అయితే.. ఈ కార్యక్రమానికి హాజరైన భైంసా ఏఎంసీ ఛైర్మన్ రాజేశ్ కుమార్ ను మంత్రి తలసాని పక్కకు నెట్టేయటం వివాదంగా మారిన సంగతి తెలిసిందే. దీనిపై గిరిజన సంఘాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయటంతో పాటు.. తలసానిపై పోరు షురూ చేశారు.
ఇంతకూ ఆ రోజు జరిగిన ఘటనపై మంత్రి తలసాని వివరణ ఇచ్చారు. జనం రద్దీగా ఉండటం.. ఆ సమయంలో అనుకోకుండా రాజేశ్ కుమార్ తన కాలును తన బూటుకాలితో తొక్కేశారని.. దీంతో తన కాలికి రక్తస్రావమైందన్నారు. ఆ బాధలో తాను ఆయన్ను పక్కకు నెట్టేసినట్లుగా చెప్పారు. అతను గిరిజనుడు భైంసా ఏఎంసీ ఛైర్మన్ రాజేశ్ కుమార్ అని తెలిసిందని.. ఆ వెంటనే ఆయనకు ఫోన్ చేసి పొరపాటు జరిగిందని.. సారీ చెప్పినట్లుగా పేర్కొన్నారు.
ఆ తర్వాత కూడా ఈ అంశంపై గిరిజన సంఘాలు.. పెద్ద ఎత్తున గిరిజనులు తలసాని తీరును తీవ్రంగా తప్పుపడుతూ నిరసనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి స్పందించిన తలసాని.. తాను గిరిజన సమాజానికి కూడా సారీ చెబుతున్నట్లుగా పేర్కొన్నారు. కొందరు కావాలనే సోషల్ మీడియాలో విషయాన్ని పెద్దది చేసి చూపిస్తున్నారని.. తాను బడుగు.. బలహీన వర్గాలకు.. దళిత బిడ్డలకు.. మైనార్టీలకు గొంతులా వ్యవహరిస్తారన్న ఆయన మాటల్ని గిరిజన సంఘాలు.. గిరిజన సమాజం ఏ రీతిలో రియాక్టు అవుతుందో చూడాలి.