"ద్రావిడ" దాటవేయబడింది... గవర్నర్ కు ఆ అలర్జీ ఉందా?

కావాలనే ఆ పదాన్ని తొలగించి ఆలపించారంటూ తమిళనాడు రాష్ట్ర రాజకీయ పక్షాలు గవర్నర్ పై ఒక్కసారిగా భగ్గుమన్నాయి.

Update: 2024-10-19 03:59 GMT

తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవి మరోమారు వివాదంలో చిక్కుకున్నారు. ఆయన సమక్షంలో ఆలపించిన తమిళ తల్లి ప్రార్థనా గీతంలో "ద్రావిడ" అనే పదం వచ్చే పంక్తిని విస్మరించారనే విషయం తీవ్ర వివాదాస్పదమైంది. కావాలనే ఆ పదాన్ని తొలగించి ఆలపించారంటూ తమిళనాడు రాష్ట్ర రాజకీయ పక్షాలు గవర్నర్ పై ఒక్కసారిగా భగ్గుమన్నాయి. గవర్నర్ "ద్రావిడ" అలర్జీతో బాధపడుతున్నారని మండిపడుతున్నాయి.

అవును... చెన్నైలోని దురదర్శన్ కేంద్రం తమిళ ఛానెల్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన "హిందీ మాసోత్సవం" ముగింపు కార్యక్రమంలో గవర్నర్ ఆర్.ఎన్. రవి సమక్షంలో రాష్ట్రగీతమైన "తమిళ్ థాయ్ వాళ్ తూ" పాడినప్పుడు.. ద్రావిడ భూమి గొప్పతనాన్ని సూచించే "తెక్కాణముమ్ అధిరసిరంద ద్రావిడనల్ తిరునాడుం" అనే పంక్తిని విస్మరించారు. ఇప్పుడు ఈ విషయం తమిళనాట తీవ్ర వివాదమైంది.

విరుచుకుపడిన సీఎం స్టాలిన్!:

ఈ వ్యవహారంపై తమిళనాడు సీఎం స్టాలిన్ ఫైర్ అయ్యారు. తన "ఎక్స్" పేజీలో... "గవర్నార్? ఆర్యుడా?" అంటూ ప్రశ్నించారు. "ద్రావిడ" అనే పదాన్ని తొలగించి తమిళ తల్లి ప్రార్థనా గీతాన్ని ఆలపించడం అంటే రాష్ట్ర చట్టాన్ని అతిక్రమించడమేనని తెలిపారు. జాతీయ గీతం నుంచి ఓ పదాన్ని వదిలేసే సాహసం గవర్నర్ చేస్తారా అని ప్రశ్నించారు.

చట్టప్రకారం కాకుండా ఇష్టానుసారంగా వ్య్వహరిస్తే గవర్నర్ పదవిని అనర్హులని పేర్కొన్నారు. రాష్ట్ర గీతం నుంచి "ద్రావిడ" అనే పదాన్ని దాటవేయడం అంటే.. తమిళనాడు, తమిళ భాషను అవమానించడమేనని అన్నారు. "ద్రావిడియన్ అలర్జీ" తో బాధపడుతున్న గవర్నర్ ను వెంటనే తొలగించాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

"ద్రావిడ" అనే పదాన్ని తొలగించి రాష్ట్ర గీతాన్ని ఆలపించడం అంటే అది తమిళనాడు చట్టానికి విరుద్ధం అని పునరుద్ఘాటించారు. హిందీ వేడుకలు చేసుకునే ముసుగులో దేశ సమైక్యతను, ఈ నేలపై నివసించే పలు వర్గాల ప్రజలను గవర్నర్ కించపరుస్తున్నారని విమర్శించారు. గవర్నర్ ను కేంద్రం వెంటనే రీకాల్ చేయాలని డిమాండ్ చేశారు.

ఉద్దేశ్యపూర్వకంగానే తమిళనాడును, రాష్ట్ర ప్రజల మనోభావాలను గవర్నర్ రవి కించపరుస్తున్నారని.. అతనిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.

గవర్నర్ వివరణ!:

సీఎం స్టాలిన్ ప్రకటనపై గవర్నర్ ఆర్.ఎన్.రవి ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. తమిళతల్లి ప్రార్థనా గీతాన్ని అవమానించినట్లు తనపై తప్పుడు ఆరోపణలు చేశారని.. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో తమిళ భాష ప్రచారానికి తాను పలు ప్రయత్నాలూ చేశానని.. అస్సోం ప్రభుత్వ సహకారంతో గువాహటి యూనివర్సిటీలో తమిళ డిగ్రీ కోర్సును ప్రవేశపెట్టినట్లు తెలిపారు.

అయితే... గవర్నర్ కు వ్యతిరేకంగా జాత్యహంకార అభిప్రాయాన్ని సీఎం వినిపించడం దురదృష్టకరమని.. ముఖ్యమంత్రి పదవి గౌరవాన్ని తగ్గించేలా ఉందని ఆయన పేర్కొన్నారు.

ఇదే సమయంలో.. గవర్నర్ మీడియా సలహాదారు తిరుజ్ఞాన సంబందం కూడా ఎక్స్ లో స్పందించారు. కార్యక్రమం ప్రారంభంలో తమిళ్ వాజ్ఞానం చెప్పే బృందం అనుకోకుండా "ద్రావిడ" అనే పదాన్ని కలిగి ఉన్న లైన్ ను మిస్ చేసిందని.. దీనిపై వెంటనే నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లి సంబంధిత అధికారులు పరిశీలించాలని కోరినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో గవర్నర్ లేదా అతని కార్యాలయం పాల్గొనడం మినహా ఇందులో ఎటువంటి పాత్ర లేదని.. గవర్నర్ కు తమిళం, రాష్ట్ర మనోభావాల పట్ల అధికమైన గౌరవం ఉందని పేర్కొన్నారు!

టీ.ఎన్.సీ.సీ. అధ్యక్షుడు మండిపాటు!:

ఈ వ్యవహారంపై తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సెల్వ పెరుంతగై స్పందించారు. ఇందులో భాగంగా.. రాష్ట్ర గవర్నర్ గా ఆర్.ఎన్. రవి బాద్యతలు చేపట్టినప్పటి నుంచి తమిళనాడు, తమిళ సంస్కృతి, తమిళ ఆచార వ్యవహారాలకు విరుధంగా వ్య్వహరిస్తూ.. తమిళ భాష ఔన్నత్యాన్ని తగ్గించేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

తమిళతల్లి ప్రార్థనా గీతంలో ఉద్దేశ్యపూర్వకంగానే "ద్రావిడ" అనే పదం ఉన్న పంక్తిని విడిచిపెట్టారని ఆరోపించారు.

స్పందించిన దూరదర్శన్:

ఈ వ్యవహారంపై దూరదర్శన్ స్పందించింది. అనుకోకుండ జరిగిన పొరపాటుకు క్షమాపణలు కోరుతున్నట్లు తెలిపింది. తమిళ్ లేదా తమిళ్ థాయ్ వళ్ తు ని అగౌరవపరిచే ఉద్దేశ్యం గాయకులకు లేదని పేర్కొంది. గౌరవనీయులైన తమిళనాడు గవర్నర్ కు కలిగిన అసౌకర్యనికి క్షమాపణలు కోరుతున్నట్లు పేర్కొంది.

కమల్ హాసన్ ఖండన:

ఈ వ్యవహారంపై కమల్ హాసన్ స్పందించారు. తమిళ థాయ్ పలకరింపులోనే కాదు.. జాతీయ గీతంలోనూ ద్రావిడియన్ కు స్థానం ఉందని.. ఆ పదాలను వదిలేసి రాజకీయంగా భావించి పాడటం తమిళనాడు, తమిళనాడు ప్రజలను అవమానించడమేనని అన్నారు. ప్రపంచంలోనే పురాతన భాష అయిన తమిళం భారతదేశానికి గర్వకారణమని అన్నారు.

ఈ నేపథ్యంలోనే... "మీరు ద్వేషాన్ని చిమ్మితే.. తమిళం నిప్పులు చిమ్ముతుంది!.. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను" అని పోస్ట్ చేశారు కమల్ హాసన్!

Tags:    

Similar News