రాయదుర్గంలో టీడీపీ వర్సెస్ బీజేపీ !

1999లో టీడీపీ తరపున అనంతపురం ఎంపీగా గెలిచిన కాల్వ శ్రీనివాసులు 2004, 2009లో ఓటమి చవిచూశాడు.

Update: 2024-09-09 03:15 GMT

ఒకే ఒరలో రెండు కత్తులు అన్నట్లు ఒకే కూటమిలో ఉన్న ఇద్దరు రాజకీయ చిరకాల ప్రత్యర్ధుల ఆరోపణలు, ప్రత్యారోపణలు రాయదుర్గం రాజకీయాలను హీటెక్కిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కాల్వ శ్రీనివాసులు, బీజేపీ నేత కాపు రామచంద్రారెడ్డిల మధ్య ఐరన్ ఓర్ ఆరోపణలు చిచ్చు రేపుతున్నాయి.

1999లో టీడీపీ తరపున అనంతపురం ఎంపీగా గెలిచిన కాల్వ శ్రీనివాసులు 2004, 2009లో ఓటమి చవిచూశాడు. 2014లో రాయదుర్గం ఎమ్మెల్యేగా 1827 ఓట్ల స్వల్ప మెజారిటీతో కాపు రామచంద్రారెడ్డి మీద విజయం సాధించాడు. 2009లో కాంగ్రెస్ పార్టీ నుండి రాయదుర్గం శాసనసభకు పోటీ చేసి అరంగేట్రం చేసి మెట్టు గోవిందరెడ్డి మీద గెలిచిన కాపు రామచంద్రారెడ్డి వైఎస్ మరణానంతరం 2012లో వైసీపీలో చేరి రాజీనామా చేసి మరోసారి విజయం సాధించాడు.

2019 ఎన్నికల్లో కాల్వ శ్రీనివాసులు మీద భారీ విజయం సాధించిన కాపు రామచంద్రారెడ్డికి 2024 ఎన్నికల్లో వైసీపీ టికెట్ ఇవ్వక పోవడంతో బీజేపీ పార్టీలో చేరాడు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన మెట్టు గోవిందరెడ్డికి ఈ ఎన్నికల్లో వైసీపీ టికెట్ ఇచ్చింది. కూటమి పొత్తులో భాగంగా టీడీపీ ఇక్కడ కాల్వ శ్రీనివాసులును మరోసారి బరిలోకి దింపింది. రాజకీయ ప్రత్యర్ధులు అయినా పొత్తు నేపథ్యంలో రామచంద్రారెడ్డి సైలెంట్ గానే ఉండడంతో కాల్వ శ్రీనివాసులు 41659 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచాడు.

గత ఐదేళ్లు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న కాపు రామచంద్రారెడ్డి మీద సీబీఐ సీజ్ చేసిన ఐరన్ ఓర్ అమ్ముకున్నారన్న తీవ్ర ఆరోపణలు వచ్చాయి. వైసీపీలో ఉన్నప్పుడు క్రషర్ యజమానుల నుండి రూ.200 కోట్లు వసూలు చేశారన్న అభియోగాలు ఉన్నాయి. అయితే అసలు ఐరన్ ఓర్ చోరీ అవుతుందని సీబీఐకి లేఖ రాసిందే నేను అని రామచంద్రారెడ్డి అంటున్నాడు.

ఇక అప్పటికన్నా ఇప్పుడే ఐరన్ ఓర్ ఎక్కువగా చోరీకి గురవుతుందని, దీని వెనక టీడీపీ నేతల హస్తం ఉందని రామచంద్రారెడ్డి ఆరోపిస్తున్నాడు. క్రషర్ యజమానులతో చేయిస్తున్న ఆరోపణల వెనక కాల్వ శ్రీనివాసులు హస్తం ఉందని ఆరోపిస్తున్నాడు. అయితే రెండు మిత్రపక్ష పార్టీల నేతల మధ్య నడుస్తున్న ఈ ఆరోపణలకు రెండు పార్టీల అధి నాయకత్వాలు జోక్యం చేసుకుని పుల్ స్టాప్ పెట్టాలని రెండు పార్టీల శ్రేణులు కోరుకుంటున్నాయి.

Tags:    

Similar News