టీడీపీ వర్సెస్ జనసేన- ఎవరిలైన్‌లో ఎవరున్నారు..!
దీంతో ఎవరు ఎవరి లైన్‌లో వెళ్తున్నారు? అనేది ఆసక్తిగా మారింది. వాస్తవానికి వైసీపీ హయాంలో కొన్ని పథకాల పేర్లను మార్చారు.
కూటమి ప్రభుత్వానికి స్వేచ్ఛ లేకుండా పోయిందా? మంత్రుల నుంచి నాయకుల వరకు అందరూ.. ఆచి తూచి అడుగులు వేస్తున్నారా? ఇదీ.. ఇప్పుడు కూటమి సర్కారు గురించి. ఆయా పార్టీల నాయకులు చేసుకుంటున్న చర్చ. దీనికి కారణం.. ఏ నిర్ణయాన్నీ దూకుడుగా తీసుకోలేక పోతున్నారు. తాము ఏ నిర్ణయం తీసుకుంటే.. టీడీపీకి నచ్చుతుందో లేదో .. అని జనసేన, తాము దూకుడుగా వెళ్తే.. జనసేనకు నచ్చుతుందో లేదో అని టీడీపీ, ఈ రెండు పార్టీ ల నిర్ణయాలు కేంద్రంలోని బీజేపీ స్వాగతిస్తుందో లేదో అన్న బెంగ వెంటాడుతోంది.
దీంతో ఎవరు ఎవరి లైన్‌లో వెళ్తున్నారు? అనేది ఆసక్తిగా మారింది. వాస్తవానికి వైసీపీ హయాంలో కొన్ని పథకాల పేర్లను మార్చారు. సహజంగా ప్రభుత్వం మారినప్పుడల్లా ఈ పేర్లు మారుతుంటాయి. ఈ క్రమం లో కూటమి సర్కారు కూడా.. మార్పు చేసింది. అయితే.. ఆయా పథకాల పేర్లకు కొన్నింటికి.. ఎన్టీఆర్, చంద్రబాబు పేర్లు పెడితే బాగుంటుందని.. మహిళా మంత్రి, ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న నాయకురాలు ఒకరు సూచించారు.
కానీ, ఆమె సూచనలు పక్కన పెట్టారు. ఇలా చేస్తే.. జనసేనను తక్కువ చేసినట్టు అవుతుందని సీనియర్లు అంతర్గత చర్చల్లో చెప్పడంతో చంద్రబాబు కూడా.. ప్రస్తుతానికి ఆ ఆలోచనల నుంచి బయటకు రండి అని చెప్పారు. దీంతో కేవలం ఒకటి రెండు పథకాలకు మాత్రమే వారి పేర్లు పెట్టుకునేలా నిర్ణయించారు. ఇక, జనసేన నుంచి మరో కీలక మంత్రి.. కూడా కొన్ని పేర్లు సూచించారు. డొక్కా సీతమ్మ, టంగుటూరి ప్రకాశం, పొట్టి శ్రీరాములు.. వంటి వారి పేర్లతో ఏదైనా ఉంటే బాగుటుందని ఆయన చెప్పుకొచ్చారు.
ఇవన్నీ.. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మనసుకు నచ్చిన పేర్లు. పైగా ఆయన పదే పదే వీరి గురించి ప్రస్తావిస్తూ ఉంటారు. జాతి నేతలు, రాష్ట్ర నేతల పేర్లు పెట్టడంలో ఎలాంటి తప్పులేదు. అయితే.. ఇది కూడా ప్రతిపాదన దశలోనే ఉంది. టీడీపీనేతలు ఏమనుకుంటారో.. అనే ఉద్దేశంతో వాటి జోలికి పోలేదు. పీఎం కిసాన్ పేరులో గతంలో వైఎస్సార్ రైతు భరోసా! అనే పేరును వైసీపీ జోడించింది. ఇప్పుడు దీనిని కేవలం పీఎం కిసాన్‌గానే ఉంచాలని.. వేరే పేర్లు వద్దని బీజేపీ సూచించింది. దీంతో దీనిపైనా చర్చ అలానే ఉంది. ఎలా చూసుకున్నా.. ఒకరి నిర్ణయాలు ఒకరు గౌరవించాలని అనుకున్నా.. ఎక్కడో చిన్న బెరుకు వంటిది మాత్రం వెంటాడుతుండడం గమనార్హం.