టీడీపీ-బీజేపీ పొత్తులో ఆ ఎంపీదేనా కీలక పాత్ర!

టీ డీపీకి సీఎం రమేశ్‌ సేవలను గుర్తించే చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఆయనను రాజ్యసభకు నామినేట్‌ చేశారని అంటారు

Update: 2023-08-29 05:46 GMT

సీఎం రమేశ్‌... పరిచయం అక్కర్లేని పేరు. టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత నమ్మకస్తుల్లో ఆయన ఒకరని చెబుతున్నారు. రిత్విక్‌ కనస్ట్రక్షన్స్‌ అధినేతగా సీఎం రమేశ్‌ ఎన్నో ప్రాజెక్టులకు బడా కాంట్రాక్టరుగా ఉన్నారు. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ సొంత జిల్లా కడపకు చెందిన రమేశ్‌ గతంలో టీడీపీకి ఆర్థిక వనరులు సమకూర్చడంలో కీలక పాత్ర పోషించారని అంటారు. మరో మాజీ ఎంపీ సుజనా చౌదరితో కలిసి సీఎం రమేశ్‌ టీడీపీకి ఆర్థిక వనరులు సమకూర్చడంలో ప్రధాన పాత్ర వహించారని చెబుతుంటారు.

టీ డీపీకి సీఎం రమేశ్‌ సేవలను గుర్తించే చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఆయనను రాజ్యసభకు నామినేట్‌ చేశారని అంటారు. అయితే 2019లో టీడీపీ ఎన్నికల్లో ఓడిపోయింది. దీంతో సీఎం రమేశ్, సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, గరికిపాటి మోహన్‌రావు వంటి టీడీపీ రాజ్యసభ ఎంపీలంతా బీజేపీలో చేరిపోయారు. వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతిగా అంటే రాజ్యసభ చైర్మన్‌ గా ఉన్నప్పుడే వారి చేరికలు జరిగాయి.

సహజంగానే ఈ చేరికలపై అప్పట్లోనే వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు తన కోవర్టులను బీజేపీలోకి పంపారని మండిపడ్డారు. సీఎం రమేశ్, సుజనా చౌదరి టీడీపీ కోవర్టులని.. వీరి ద్వారా కేంద్రంలో తన పనులను చక్కదిద్దుకోవడానికి ప్రయత్నిస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపించారు.

కాగా 2019లో టీడీపీ నుంచి బీజేపీలో చేరిన నలుగురు టీడీపీ ఎంపీల్లో సుజనా చౌదరి, గరికపాటి మోహన్‌ రావు, టీజీ వెంకటేశ్‌ ల సభ్యత్వం ముగిసింది. ప్రస్తుతం ఒక్క సీఎం రమేశ్‌ పదవీ కాలం మాత్రమే ఉంది. దీంతో రాజ్యసభలో బీజేపీ సభ్యుడిగానే కొనసాగుతున్నారు.

కాగా తాజాగా టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు శత జయంతి సందర్భంగా కేంద్రం ప్రత్యేకంగా రూ.100 నాణెం ఆవిష్కరించింది. దీన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్‌ లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నందమూరి, నారా కుటుంబాలు సందడి చేశాయి. అంతేకాకుండా ఎన్టీఆర్‌ కు సన్నిహితులైన మరికొందరిని కూడా ఆహ్వానించారు.

అయితే విచిత్రంగా ఈ కార్యక్రమంలో బీజేపీ ఎంపీ సీఎం రమేశ్‌ కూడా పాల్గొన్నారు. మీడియాకు విడుదలయిన చిత్రాల్లో ఒక సోఫాలో కూర్చుని టీడీపీ అధినేత చంద్రబాబు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుకుంటుండగా వారికి ఎదురుగా ఉన్న ఒక సోఫాలో సీఎం రమేశ్‌ కూర్చుని ఉండటం విశేషం. ఈ ఫొటో సోషల్‌ మీడియాతోపాటు తెలుగు ప్రసార మాధ్యమాల్లో వైరల్‌ గా మారింది.

వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలసి పోటీ చేయాలని చంద్రబాబు భావిస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. జనసేన సైతం ఇదే ఆలోచనతో ఉంది. ఇప్పటికే జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ వ్యతిరేక ఓటును చీల్చబోనని ప్రకటించారు. మరోవైపు బీజేపీ ఏపీ నేతలు తమకు జనసేనతోనే పొత్తు అని.. టీడీపీతో ఉండబోదని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురందేశ్వరి రావడం, ఎన్టీఆర్‌ శత జయంతి సందర్భంగా నాణెం ఆవిష్కరణ కార్యక్రమం జరగడం, ఇందులో బీజేపీ ఎంపీ రమేశ్‌ కీలకపాత్ర పోషించడం, ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రావడం వంటి పరిణామాలు సర్వత్రా చర్చకు దారితీశాయి.

ఈ పరిణామాల నేపథ్యంలో సహజంగానే వైసీపీ విమర్శలు చేస్తోంది. ఎన్టీఆర్‌ కు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు ఆయన కార్యక్రమంలో పాల్గొన్నారని స్వయంగా సీఎం వైఎస్‌ జగన్‌ తీవ్ర విమర్శలు చేశారు. మరోవైపు వైసీపీ నేతలు పురందేశ్వరి, సీఎం రమేశ్‌ లపైన మండిపడుతున్నారు. సీఎం రమేశ్‌ టీడీపీ కోవర్టు అని, బీజేపీలో స్లీపర్‌ సెల్‌ గా టీడీపీకి పనిచేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అయితే టీడీపీ-బీజేపీ పొత్తు కుదిరినప్పుడే వైసీపీ విమర్శలకు కొంత అర్థం ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Tags:    

Similar News