మ్యాజిక్ ఫిగర్ కి టీడీపీ బహు దూరం...!?

అలాంటిది టీడీపీ ఇపుడు పొత్తు పేరుటో ఆ పార్టీ పొలిటికల్ లైఫ్ లో ఎన్నడూ లేని విధంగా నలభై దాకా సీట్లను త్యాగం చేయబోతోంది.

Update: 2024-02-11 17:30 GMT

ఏపీలో విపక్ష కూటమి రాజకీయం కొత్త మలుపులు తీసుకుంటోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా తెలుగుదేశం మహా త్యాగాలకు సిద్ధపడే పరిస్థితి ఏర్పడుతోంది. ఏపీలో ఏ విధంగా చూసినా నలభై శాతం ఓటు బ్యాంక్ కలిగిన తెలుగుదేశం అర సున్నా శాతం ఓటు బ్యాంక్ కలిగిన బీజేపీతో అలాగే గత ఎన్నికల్లో ఆరు శాతం వచ్చిన జనసేనతోనూ పొత్తులతో వెళ్తోంది.

నిజం చెప్పాలంటే ఈ రెండు పార్టీలు టీడీపీ కంటే బలహీనంగానే ఉన్నాయి. టీడీపీ ఎపుడూ పొత్తు పార్టీలను జూనియర్ పార్టనర్లకు తక్కువ సీట్లు ఇస్తుంది. మొత్తంగా డబుల్ డిజిట్ లోపే ఉంటుంది. అలాంటిది టీడీపీ ఇపుడు పొత్తు పేరుటో ఆ పార్టీ పొలిటికల్ లైఫ్ లో ఎన్నడూ లేని విధంగా నలభై దాకా సీట్లను త్యాగం చేయబోతోంది.

ఇప్పటికే జనసేనకు పాతిక సీట్లు దాకా ఇవ్వాలని టీడీపీ డిసైడ్ అయింది. ఇది ఆ పార్టీకి చాలడంలేదు, ఇంకా ఎక్కువ కావాలని కోరుతున్నారు అని అంటున్నారు. ఇపుడు కొత్తగా బీజేపీ వచ్చి చేరుతోంది. ఆ పార్టీ కూడా పాతిక అసెంబ్లీ సీట్లకు తక్కువ ఇవ్వాలని బేరం పెడుతోంది అని అంటున్నారు.

అయితే ఆ నంబర్ ని 15 కి కుదించి ఇవ్వాలని చూస్తోంది. అంటే 2014లో బీజేపీకి ఇచ్చిన 12 సీట్ల కంటే మరో మూడు అధికం. ఇక జనసేన విషయంలో పాతిక నంబర్ ని పెంచుతారా ముప్పయి చేస్తారా అన్న ప్రశ్నలు ఉండనే ఉన్నాయి. ఒకవేళ ముప్పయి జనసేనకు ఇచ్చి బీజేపీకి ఇస్తే నలభై అయిదు అసెంబ్లీ సీట్లు రెండు పార్టీలు ఇవ్వాల్సి వస్తుంది

మొత్తం ఏపీలో ఉన్న 175 అసెంబ్లీ సీట్లలో మిత్రులకు నలభై అయిదు సీట్లు ఇస్తే కనుక టీడీపీ పోటీ చేసే సీట్లు 130కి మాత్రమే ఉంటాయి. ఏపీలో సొంతంగా ప్రభుత్వం ఏ పార్టీ అయినా ఏర్పాటు చేయాలంటే 88 సీట్లు మ్యాజిక్ ఫిగర్ గా ఉంటుంది. మరి 130 సీట్లకే పోటీ చేస్తూ అందులో 88 సీట్లను గెలవడం అంటే చాలా కష్టమైన ప్రక్రియగానే ఉంటుంది.

వెనక్కి వెళ్ళి 2014 అసెంబ్లీ ఎన్నికలను తీసుకుంటే బీజేపీకి 12 సీట్లు ఇచ్చి 163 సీట్లకు టీడీపీ పోటీ చేస్తే ఆ పార్టీకి వచ్చిన సీట్లు 105గా ఉన్నాయి. మరి 130 సీట్లు పోటీ చేస్తే ఎన్ని వస్తాయన్నది ఇపుడు తమ్ముళ్ళలో కలవరంగా ఉంది. ఏపీలో వైసీపీ బలంగా ఉంది అనే పొత్తులు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ తగ్గేది ఉండదు.

మూడు పార్టీలు కలిస్తే ఉమ్మడిగా మెజారిటీ సీట్లు తెచ్చుకోవచ్చు అన్న ఆలోచన ఉందని అంటున్నారు. అంటే రేపటి రోజున బీజేపీ జనసేన టీడీపీ కూటమి నాయకత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు అయ్యేలాగానే ఈ పొత్తులు సీట్ల లెక్కలు ఉన్నాయని అంటున్నారు. మరో వైపు జనసేన టీడీపీలకు ఇచ్చిన నలభై అయిదు సీట్లలో అవి కనుక సగం గెలుచుకున్నా ప్రభుత్వంలో కీలక పాత్రకు పట్టుపడతాయి. మ్యాజిక్ ఫిగర్ ని సోలోగా టీడీపీ టచ్ చేయకపోతే అధికారంలో వాటాను మిత్రులు కోరే పరిస్థితి కూడా ఉండవచ్చు.

మరి రాజకీయ చాణక్యుడిగా పేరున్న చంద్రబాబు ఇవన్నీ ఊహించే పెద్ద ఎత్తున మిత్ర పక్షాలకు సీట్లు ఇస్తున్నారా అన్న చర్చ బయల్దేరింది. మిత్రులకు తక్కువ సీట్లు ఇచ్చి 150 కి ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గకుండా పోటీ చేయాలన్న టీడీపీ నిర్ణయానికి మిత్రుల డిమాండ్ అయితే గండి పెట్టేలా ఉంది అని అంటున్నారు. చూడాలి మరి టీడీపీ ఈ పొత్తులను ఏ విధంగా దాటుకుని ముందుకు వెళ్తుందో. తక్కువ సీట్లకు టీడీపీ పోటీ చేస్తే మాత్రం ఆ పార్టీ పెట్టిన తరువాత మొదటి సారి మ్యాజిక్ ఫిగర్ ని సాధించలేక సంకీర్ణానికి వెళ్లే సీన్ అయితే ఉంది అని విశ్లేషణలు ఉన్నాయి.

Tags:    

Similar News