బాబు పవన్ పక్కన చోటు ఉన్నది ఒక్కరికే..?
నా పక్కన చోటు ఉన్నది ఒక్కరికే అని పాత సినిమాలో ఒక పాట ఉంది. అలాగే ఏపీలో ఎన్నికలకు చాలా ముందుగానే ఒక కూటమి కట్టేసింది.
నా పక్కన చోటు ఉన్నది ఒక్కరికే అని పాత సినిమాలో ఒక పాట ఉంది. అలాగే ఏపీలో ఎన్నికలకు చాలా ముందుగానే ఒక కూటమి కట్టేసింది. చాలా కాలంగా టీడీపీ జనసేన ఒక్కటి కావాలని అనుకుంటున్నాయి. కానీ బీజేపీ కోసం వెయిట్ చేస్తూ వచ్చాయి. అయితే ఇపుడు అనూహ్య పరిణామాల మధ్య పవన్ కళ్యాణ్ చంద్రబాబుని జైలులో ములాఖత్ ద్వారా కలిసి వెనువెంటనే పొత్తులు అనౌన్స్ చేసి పారేశారు.
అలా తమ కూటమిలోకి బీజేపీ రావాల్సిన అనివార్యతను అయితే ఆయన కలిగించారు అనుకోవాలి. నిజానికి బీజేపీ రూట్ మ్యాప్ ఇవ్వాలని ఇస్తుందని దాదాపుగా రెండేళ్ల నుంచి పవన్ వెయిట్ చేస్తూ వస్తున్నారు. ఆ విషయాన్ని ఆయన ఎక్కడా మనసులో దాచుకోలేదు. బహిరంగ వేదికల మీదనే ప్రకటించారు. ఏపీలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా కూటమి కట్టాలని పవన్ ముందు నుంచి పిలుపు ఇస్తున్నారు.
ఆ విధంగా ఆయన బీజేపీని ఒప్పించే ప్రయత్నంలో ఉన్నారు. ఈ మధ్యనే ఢిల్లీలో జరిగిన ఎన్డీయే మీటింగు కి వెళ్ళిన పవన్ జాతీయ మీడియాతో మాట్లాడుతూ మరిన్ని పార్టీలు ఏపీ నుంచి కొత్తగా కూటమిలో చేరుతాయని చెప్పడం విశేషం. మరి బీజేపీ ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలియదు కానీ పవన్ అయితే జోరు చేశారు.
ఏపీలో టీడీపీ జనసేన కూటమి కట్టిన వేళ వారి పక్కన చోటు అయితే ఒకరికి ఉంది. ఆ ఒక్కరు ఎవరు అన్నదే ఇపుడు చర్చకు వస్తున్న విషయం. ఒక వైపు బాబు అరెస్ట్ ని ఖండిస్తూ కామ్రేడ్స్ టీడీపీతో దోస్తీని కోరుకుంటున్నాయి. వైసీపీ బీజేపీల మీద సమాన స్థాయిలో అంతా పోరాడాలని కూడా కామ్రేడ్స్ అంటున్నాయి.
ఇపుడు బీజేపీ కోసం పవన్ ఇంకా చూస్తున్నారు. అదే ఆయన తన పార్టీ మీటింగులో కూడా చెప్పారు. తాను ఇప్పటికీ ఎన్డీయే కూటమిలోనే ఉన్నాను అని చెప్పారు. ఏపీలో ఏ పరిణామల నేపధ్యంలో తాను టీడీపీతో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చిందో కూడా కేంద్ర బీజేపీ పెద్దలకు వివరిస్తాను అని పవన్ చెప్పారు. దీని మీద తొందరలోనే ఢిల్లీకి వెళ్తాను అని అంటున్నారు.
ఇక బీజేపీ విషయం చూస్తే పవన్ కి అపాయింట్మెంట్ ఇచ్చి ఆయన కోరిన విధంగానే టీడీపీతో కూడా జట్టు కడితే కచ్చితంగా కూటమిలో పక్క సీటు కమలానిదే అవుతుంది. అలా కాకుండా బీజేపీ న్యూట్రల్ గా ఉందామనుకుంటే మాత్రం బాబు పవన్ కలసి ప్లాన్ బీ అమలు చేసే అవకాశాలు సైతం ఉన్నాయని అంటున్నారు.
ప్లాన్ బీ అంటే బీజేపీ కూటమిలో లేని చోట కామ్రేడ్స్ ని ఆహ్వానించడం. కామ్రేడ్స్ కనుక వస్తే కూటమికి లోటు అయితే ఉండదు, ఏపీలో వారు కూడా ఎంతో కొంత కార్మిక సంఘాలతో బలంగానే ఉన్నారు. అయితే కామ్రేడ్స్ వస్తే అది అంతటితో ఆగదు, ఏకంగా కాంగ్రెస్ ని కూడా చేర్చుకోవచ్చు. అలాగే ఆప్, లోక్ సత్తా వంటి ఇతర పార్టీలు కూడా ఈ కూటమిలో చేరవచ్చు. ఆ పరిణామాలు కనుక జరిగితే ఏపీలో ఎన్డీయే కూటమి అనుకున్నది కాస్తా ఇండియా కూటమిగా మారిపోవచ్చు.
ఇదంతా జరగాలీ అంటే బీజేపీ చేతులలోనే ఉంది. ఇక తాము చేయాల్సింది చేసిన పవన్ కళ్యాణ్, చంద్రబాబు బీజేపీ మీదనే భారం పెట్టేశారు. కమలం పార్టీ కలసి వస్తే కళ్లకు అద్దుకుని చేర్చుకుంటామని అంటున్నారు. అలా జరగకపోతే కామ్రేడ్స్ ఆ ప్లేస్ లోకి వచ్చేస్తారు. మొత్తానికి ఏపీ రాజకీయం ఇపుడు ఎన్డీయే వర్సెస్ ఇండియా కూటమిగా మారిపేయేందుకు ఆస్కారం ఏర్పడింది అంటున్నారు.