టీడీపీ కాపులు ఆశలు వదులుకోవాల్సిందేనా ?

ఏపీలో కూటమి ప్రభుత్వం ఉంది. దాంతో మంత్రి పదవుల పంపిణీని చంద్రబాబు తనదైన శైలిలో పూర్తి చేశారు

Update: 2024-07-13 05:30 GMT

ఏపీలో కూటమి ప్రభుత్వం ఉంది. దాంతో మంత్రి పదవుల పంపిణీని చంద్రబాబు తనదైన శైలిలో పూర్తి చేశారు. టీడీపీకి పెట్టని కోటగా ఉంటూ వస్తున్న బీసీలకు ఆయన పెద్ద పీట వేశారు. అదే సమయంలో కాపుల కోటాలో టీడీపీకి తగ్గించి జనసేనకు చాన్స్ ఇచ్చారు. జనసేనకు మూడు మంత్రి పదవులు ఇస్తే అందులో ఇద్దరు కాపు సామాజిక వర్గీయులే కావడం విశేషం. దాని వల్ల టీడీపీ కాపులకు మంత్రి చాన్స్ తప్పిపోయింది అని అంటున్నారు.

టీడీపీ జనసేన ఘట బంధన్ కొనసాగినంత కాలం టీడీపీ కాపులకు మినిస్టర్ బెర్తులు దూరమేనా అన్న చర్చ అయితే సాగుతోంది. ఈసారి చూస్తే టీడీపీ నుంచి అధిక సంఖ్యలో కాపులు ఎమ్మెల్యేలు అయ్యారు. ఉత్తరాంధ్ర నుంచి చూస్తే ఓసీ కాపులు ఉన్నారు. బీసీ కాపులు ఉన్నారు. అయితే విజయనగరం నుంచి కొండపల్లి శ్రీనివాస్ ఒక్కరికే మంత్రి పదవి దక్కింది. అది కూడా బీసీ కోటాలో.

దాంతో కాపులుగా ఉన్న సీనియర్లకు రిక్త హస్తమే మిగిలింది అని అంటున్నారు. అంతే కాదు గోదావరి జిల్లాలో చూసుకున్నా అదే పరిస్థితి ఉంది అంటున్నారు. గతసారి ఏకంగా ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు హోం శాఖను నిర్వహించిన నిమ్మకాయల చిన రాజప్పకు ఈసారి మంత్రి పదవి దక్కలేదు. అలాగే మంత్రి పదవి తన చిరకాల కోరికగా చెప్పుకున్న జ్యోతుల నెహ్రూకి కూడా ఆ పదవి ఊరిస్తూనే ఉంది.

అయితే చంద్రబాబు వ్యూహాత్మకంగానే ఈ విధంగా వ్యవహరించారు అని అంటున్నారు కాపులు టీడీపీలోనూ ఉన్నారు. జనసేనలోనూ ఉన్నారు. జనసేనతో పొత్తు ఉండడం వల్ల వాళ్ళకు ఆ కోటాలో మంత్రి పదవులు ఇచ్చి బీసీలను అదే సమయంలో అక్కున చేర్చుకున్న చంద్రబాబు ఏపీలో కమ్మ ప్లస్ బీసీ ప్లస్ కాపు అన్న కొత్త తరహా సోషల్ ఇంజనీరింగ్ ని ముందుకు తెచ్చారు. అది ఈ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించింది.ఫలితంగానే మొత్తం101 అసెంబ్లీ సీట్లు ఉన్న ఏడు కోస్తా జిల్లాలలో వైసీపీకి కేవలం రెండంటే రెండు సీట్లు మాత్రమే దక్కాయని అంటున్నారు.

దాని వెనక ఈ సోషల్ ఇంజనీరింగ్ సక్సెస్ మంత్ర ఉందని అంటున్నారు. ఈ కాంబో కనుక పటిష్టంగా ఎంత కాలం సాగితే అంతకాలం దాకా కోస్తా జిల్లాలలో వైసీపీ అడుగు పెట్టలేదని అంటున్నారు. ఏ పార్టీ అయినా అధికారంలోకి రావాలీ అంటే గోదావరి ఉత్తరాంధ్ర జిల్లాలలోనే అత్యధిక సీట్లు గెలవాల్సి ఉంటుంది. ఇపుడు అక్కడ జనసేన టీడీపీ కలసి గట్టి రాజకీయ పునాదిని వేసుకున్నాయి.

దాంతో ఇదే ఊపుతో మరింత పకడ్బందీగా ముందుకు సాగితే వైసీపీ రాజకీయ ఆనవాళ్ళు కోస్తాలో లేకుందా చేయవచ్చు అన్నదే బాబు రాజకీయ వూహంగా ఉంది. అందుకే ఆయన అంటున్నారు వైసీపీ భూతాన్ని భూస్థాపితం చేస్తాము అని. ఆ పార్టీని శాశ్వతంగా రాజకీయాలకు దూరం చేస్తాము అని. మొత్తం మీద బలంగా అల్లుకున్న ఈ సామాజిక సమీకరణలలో ఏమైనా తేడా వస్తే తప్ప కోస్తా గేటు కూడా వైసీపీ తాకలేని పరిస్థితి ఉందని అంటున్నారు.

Tags:    

Similar News