వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తాజాగా విడుదల చేసిన టీడీపీ తొలి జాబితా .. ఆ పార్టీ నేతల్లో తీవ్ర అసంతృప్తి రగులుస్తోం ది. చాలా చోట్ల పార్టీ కార్యాలయాలపై దాడులు పెరుగుతున్నాయి. ఇక, కొందరునాయకులు బహిరంగంగా విమర్శలు చేస్తుంటే.. మరికొందరు టికెట్ దక్కని వారు.. నర్మగర్భ వ్యాఖ్యలతో తమ అసహనం ప్రదర్శిస్తున్నారు. తాజాగా ఉమ్మడి కృష్నాజిల్లాలోని అవనిగడ్డ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించిన మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్.. సంయమనం పాటించలేకపో యారు. పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన బహిరంగ వ్యాఖ్యలు చేశారు.
తాజాగా జాబితాలో.. ``నా పేరు ప్రకటించనందుకు నేను మహదానందంగా ఉన్నాను. పంజరం లోంచి బయటకు వచ్చిన పక్షి లాగా స్వేచ్చా స్వాతంత్య్రాలు పొందినట్లు ఉంది. దయచేసి కార్యకర్తలు, నాయకులు గమనించి వ్యవహరించండి. నా ఆలోచనలు, నేను నమ్మిన సిద్దాంతాలు మీకు తెలుసు. పదవులకోసం పుట్టలేదు. పదవులు లభించినప్పుడు ప్రజలకు మేలు చేయడానికి, మన ప్రాంతాన్ని అభివృద్ది చేయడానికి ప్రయత్నించాను తప్ప ఆ పదవులను అడ్డుపెట్టుకుని దోచుకోలేదు, దాచుకోలేదు`` అని వ్యాఖ్యానించారు.
అంతేకాదు.. పార్టీ వ్యవహార శైలిపై ఆయన పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ``రాజకీయాలు మన కళ్లముందే మారిపోయాయి. డబ్బు రాజకీయాలకు ప్రధానమై పోయింది. ఓటరుని కొనుగోలు వస్తువుగా రాజకీయపక్షాలు భావిస్తున్న తరుణంలో ధనవంతులకోసం అన్వేషిస్తున్న తరుణంలో నాబోటి వాడు ఎన్నికల్లో నిలబడాలని భావించడం కూడా సమంజసం కాదు. పరిస్దితులను కార్యకర్తలు, ప్రజలు అర్దం చేసుకోండి. దయచేసి వేరేవిదంగా ఆలోచించవద్దు.`` అని మండలి వ్యాఖ్యానించారు. కాగా, అవనిగడ్డ టికెట్‌పై చంద్రబాబు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అయితే.. దీనిని జనసేన ఆశిస్తున్న విషయం మాత్రం స్థానికంగా చర్చల్లో ఉంది.