జూనియర్ భావోద్వేగం... టీడీపీ మాటల దాడి కంటిన్యూ!

ఎక్కడో పరాయి గడ్డ దుబాయ్ లో సైమా అవార్డుల ఫంక్షన్ లో టాలీవుడ్ టాప్ స్టార్ జూనియర్ ఎన్టీయార్ భావోద్వేగానికి గురి అయ్యారు.

Update: 2023-09-16 09:47 GMT

ఎక్కడో పరాయి గడ్డ దుబాయ్ లో సైమా అవార్డుల ఫంక్షన్ లో టాలీవుడ్ టాప్ స్టార్ జూనియర్ ఎన్టీయార్ భావోద్వేగానికి గురి అయ్యారు. ట్రిపుల్ ఆర్ సినిమాకు గాను ఆయనకు సైమా ఉత్తమ నటుడిగా అవార్డు అందించింది. అనంతరం స్టేజ్ మీద జూనియర్ కీలక ప్రసంగం చేశారు.

తన ఎదుగుదలకు కారణం పూర్తి స్థాయిలో అభిమానులే అని ఆయన చెప్పుకొచ్చారు. తాను కింద పడినప్పుడల్లా అండగా వారే నిలబడ్డారు అని గుర్తు చేసుకున్నారు. వారు లేకపోతే నేను ఈ రోజు ఇలా ఉండలేను అని కూడా అన్నారు. తన అభిమానులకు తాను జీవితాంతం రుణపడి ఉంటాను అని ఎన్టీయార్ ఎమోషన్ అయ్యారు.

నా ప్రతి బాధలో వారున్నారు. నా కన్నీటి కష్టాలను కూడా పంచుకున్నారని అని జూనియర్ చెప్పుకొచ్చారు. అందుకే నా అభిమాన సోదరులకు పాదాభివందనం చేస్తున్నాను అన్నారు. నిజంగా ఎన్టీయార్ గుండె లోతుల నుంచి ఈ స్పీచ్ ఇచ్చారు. తన ఫ్యాన్స్ లేకపోతే తాను లేను అని అన్నారు.

అయితే ఈ స్పీచ్ ఇపుడు టీడీపీలో కొంతమంది నేతలను మండిస్తోంది. తన మామ చంద్రబాబు జైలులో వారం రోజులుగా ఉంటే కనీసం ట్వీట్ చేయలేదని, రియాక్ట్ కాలేదని, పైగా తన ఎదుగుదలకు ఫ్యాన్స్ మాత్రమే కారణం అని జూనియర్ చెప్పడమేంటని మండిపడుతున్నారు.

అలా అనుకుంటే ఎన్టీయార్ అన్న పేరుని మార్చుకో అని కూడా సలహా ఇస్తున్నారు. అంటే జూనియర్ టాలెంట్ కంటే ఆయన పేరులో ఎన్టీయార్ ఉండడం వల్లనే సూపర్ స్టార్ అయ్యారన్న భావనతో టీడీపీ నేతలు సోషల్ మీడియా వేదికగా మాటల దాడిని స్టార్ట్ చేశారు.

ఇవన్నీ చూస్తూంటే జూనియర్ రామా అన్నా కూడా బూతు అవుతుందా అని ఆయన ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. అభిమానులే ఎవరికైనా ముఖ్యమని వారి గురించే ఎంతటి పెద్ద హీరో అయినా చెబుతారని, జూనియర్ అదే చెప్పారని ఇందులో తప్పేముందని వారు ప్రశ్నిస్తున్నారు. జూనియర్ చంద్రబాబు అరెస్ట్ మీద రియాక్ట్ కాలేదని ఏదోదో ఊహించేసుకుని తమ అభిమాన నటుడి మీద విమర్శలు చేయడం ఎంతవరకూ కరెక్ట్ అని అని సోషల్ మీడియా వేదికగానే జూనియర్ ఫ్యాన్స్ ఘాటు రిప్లై ఇస్తున్నారు

మొత్తం మీద చూస్తే జూనియర్ చెప్పిన దాంట్లో అర్ధాలు వెతికే వారికి బోలెడు కనిపిస్తాయి. ఆయన సినీ ఫంక్షన్లో అభిమానుల గురించి కాక మరెవరి గురించి చెబుతారు అని అంటున్న వారూ ఉన్నారు. పరాయి గడ్డ మీద ఆయన చంద్రబాబు అరెస్ట్ గురించి స్టేజి మీద ఎందుకు చెబుతారు ఎందుకు రియాక్ట్ అవుతారు ఆ మాత్రం లాజిక్ తో ఆలోచించరా అని కూడా అంటున్నారు.

అయితే జూనియర్ విషయంలో మాత్రం టీడీపీలో ఒక సెక్షన్ రగులుతోంది. అలాగే అనుకూల మీడియా సైతం ఆయనదే తప్పు అన్నట్లుగా చెబుతోంది. మరి ఇండియా తిరిగి వచ్చిన తరువాత అయినా జూనియర్ బాబు అరెస్ట్ మీద ఏమైనా మాట్లాడుతారా లేక మీ ఇష్టం మీ కో దండం అని తన షూటింగులో తాను మునిగిపోతాడా అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News