'పుష్ప'ను వెంటాడుతున్న మల్లన్న... తెరపైకి షాకింగ్ డిమాండ్!

ఈ సమయంలో.. జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్ ను పరామర్శిస్తున్నారు కానీ.. అసలు బాధితుడిని మాత్రం ఎవరూ పరామర్శించడం లేదనే చర్చ తెరపైకి వచ్చిందని అంటున్నారు.

Update: 2024-12-18 03:52 GMT

‘పుష్ప-2’ సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు 9 ఏళ్ల శ్రీతేజ్ సుమారు రెండు వారాలుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సమయంలో.. జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్ ను పరామర్శిస్తున్నారు కానీ.. అసలు బాధితుడిని మాత్రం ఎవరూ పరామర్శించడం లేదనే చర్చ తెరపైకి వచ్చిందని అంటున్నారు.

మరోపక్క ఆస్పత్రిలో చికిత్స పోందుతున్న శ్రీతేజ్ ను మంగళవారం నాడు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, వైద్యారోగ్యశాఖ హెల్త్ సెక్రటరీ క్రిస్టినా.. కిమ్స్ ఆస్పత్రికి చేరుకుని బాలుడి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా బాలుడి బ్రెయిన్ డ్యామేజ్ అయ్యిందని.. కోలుకోవడానికి మరింత సమయం పట్టేలా ఉందని సీవీ ఆనంద్ తెలిపారు.

ఈ క్రమంలో పలువురు రాజకీయ నేతలు కూడా కిమ్స్ లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను చూసి వస్తున్నారు. అతడి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తాజాగా కిమ్స్ కు వచ్చి, బాలుడి పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా షాకింగ్ డిమాండ్ తెరపైకి తెచ్చారు.

అవును... ‘పుష్ప-2’ సినిమా బెనిఫిట్ షో ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై కిమ్స్ ఆస్పత్రిలో వైద్యులను అడిగి తెలుసుకున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. ఈ సందర్భంగా స్పందించిన ఆయన... శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి ఇంకా క్రిటికల్ గానే ఉందని.. బాలుడు ఇంకా సృహలోకి రాలేదని అన్నారు.

ఇదే సమయంలో... చికిత్స గురించి వైద్యుల్ని అడిగితే ఎప్పుడు కోలుకుంటాడో చెప్పలేమని అంటున్నారని మల్లన్న వెల్లడించారు. అసలు.. అందరూ అల్లు అర్జున్ ని కలుస్తున్నారు కానీ.. అసలు కలవాల్సింది, పరామర్శించాల్సింది శ్రీ తేజ్ ను కదా అని అన్నారు. అర్జున్ అరెస్ట్ లో రేవంత్ స్ పై చేస్తున్న అవాస్తవ ప్రచారాన్ని ఆపాలని కోరారు.

ఇక బుధవారం శాసన మండలిలో ఈ విషయంపై మాట్లాడతానని చెప్పిన తీన్మార్ మల్లన్న... అందువల్లే శ్రీతేజ్ కుటుంబ సభ్యులను కలిసి, అతడి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే.. పుష్ప-2 కు భారీ కలెక్షన్స్ వచ్చాయని విన్నానని.. అందులో 10 శాతమైనా శ్రీతేజ్ కుటుంబానికి ఇవ్వాలని మల్లన్న డిమాండ్ చేశారు.

కాగా... ఇటీవల ఓ సినిమా కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన మల్లన్న మాట్లాడుతూ... ‘పుష్ప’ సినిమాకు జాతీయ అవార్డు రావడంపై కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. తనకు ఓ ఫ్రెండ్ చెబితే 'జై భీమ్' సినిమా చూశానని.. ఆ మూవీ తనకు బాగా నచ్చిందని.. దానికే జాతీయ అవార్డు వస్తుందని అనుకున్నట్లు తెలిపారు.

అయితే... ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే సినిమా ‘పుష్ప’కి వచ్చిందట అని చెబుతూ... అసలు ఆ నిర్ణయం ఎలా తీసుకున్నారో.. జాతీయ అవార్డును ఏ ప్రాతిపదికన ఇస్తారో తనకు తెలియదని అన్నారు. ఆ నిర్ణయం తర్వాత తాను సినిమాలు చూడటమే మానేశానని మల్లన్న వెల్లడించారు. ఈ క్రమంలో తాజాగా "పుష్ప-2" కలెక్షన్స్ లో 10 శాతం శ్రీతేజ్ కుటుంబానికి ఇవ్వాలని డిమాండ్ చేశారు!

Tags:    

Similar News