మూడు పార్టీల్లోను ఒకటే గోలా ?

షెడ్యూల్ ఎన్నికల తేదీ దగ్గరకు వస్తున్న కొద్దీ పార్టీల్లో గోల పెరిగిపోతోంది. ఇంతకీ గోల దేనికంటే టికెట్ల కోసమే

Update: 2023-08-18 16:30 GMT

షెడ్యూల్ ఎన్నికల తేదీ దగ్గరకు వస్తున్న కొద్దీ పార్టీల్లో గోల పెరిగిపోతోంది. ఇంతకీ గోల దేనికంటే టికెట్ల కోసమే. అధికార బీఆర్ఎస్ లో ఏమో సిట్టింగ్ ఎంఎల్ఏల గోల పెరిగిపోతోంది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ లో ఏమో సీనియర్ల గోల. చివరగా బీజేపీలో ఏమో సీనియర్లు-జూనియర్లనే గోల పెరిగిపోతోంది. మొత్తంమీద ఏ పార్టీ చూసినా టికెట్ల కోసం గోల చేసేవాళ్ళ సంఖ్య పెరిగిపోతోంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించి నామినేషన్లు వేసేనాటికి ఈ గోల భరించలేని స్థాయికి చేరుకున్నా ఆశ్చర్యపోవక్కర్లేదు.

బీఆర్ఎస్ లో తమకు టికెట్లు వస్తాయో రావో అని సిట్టింగుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. సిట్టింగులందరికీ టికెట్లని కేసీయార్ ఒకసారి ప్రకటిస్తారు. ఆ తర్వాత ఏదో మీటింగ్ లో సర్వేలో మంచి ఫీడ్ బ్యాక్ వచ్చిన వాళ్ళకే టికెట్లని మళ్ళీ కేసీయరే ప్రకటించారు. దాంతో ఎప్పటికిప్పుడు మాటలు మారుస్తున్న కేసీయార్ చివరకు ఎవరికి టికెట్లిస్తారో ? ఎవరికి మొండిచెయ్యి చూపుతారో అర్థం కాక నానా యాతన పడుతున్నారు. పైగా గడచిన పది రోజులుగా ఎవరికీ అందుబాటులో కూడా లేరు.

ఇక కాంగ్రెస్ పార్టీలో గోల మరో రకంగా ఉంది. పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితా ఇక్కడ వడపోస్తారు. అంతిమ నిర్ణయం ఢిల్లీలో తీసుకుంటారు. ఇక్కడ రికమెండ్ చేసే జాబితాలో తమ పేర్లుంటాయో ఉండవో అనే టెన్షన్ సీనియర్లలో పెరిగిపోతోంది. ఇదే సమయంలో తమ వారసులకు కూడా టికెట్లు ఇవ్వాల్సిందే అని సుమారు 15 మంది సినియర్లు గట్టిగా పట్టుబట్టారట. దాంతో గాంధిభవన్లో ప్రతిరోజు టికెట్ల లొల్లి జరుగుతునే ఉంది. ఇక్కడ రికమెండేషన్ అయిపోతే వెంటనే ఢిల్లీకి వెళ్ళి మ్యానేజ్ చేసుకునేందుకు రెడీ అయిపోతున్నారు.

ఫైనల్ గా బీజేపీలో కూడా దాదాపు ఇలాంటి గోలే పెరిగిపోతోంది. పై రెండు పార్టీల్లో లేని విషయం బీజేపీలో ఒకటుంది. అదేమిటంటే 119 నియోజకవర్గాల్లో పోటీ చేయటానికి అన్నీ నియోజకవర్గాల్లోను గట్టి అభ్యర్ధులు లేరు. అయినాకానీ కొన్ని నియోజకవర్గాల్లో సీనియర్లు-జూనియర్ల మధ్య టికెట్ కోసం గొడవలవుతున్నాయట. ఈ పార్టీలో కూడా ఫైనల్ డెసిషన్ ఢిల్లీ పెద్దలదే కానీ ఇక్కడనుండి రికమెండ్ అవ్వటం కూడా చాలా ఇంపార్టెంట్ అనే చెప్పాలి. అందుకనే మూడు పార్టీల్లోను మూడు కారణాలతో గోల పెరిగిపోతోంది.

Tags:    

Similar News