కారు పార్టీ బేజారు : బీయారెస్ కి కొత్త చిక్కులు
మరి బీయారెస్ కోరిన విధంగా కనుక తీర్పు వస్తే మాత్రం గులాబీ పార్టీకి గుండెలలో దాగున్న బోలెడంత గుబులు పోతుంది.
తెలంగాణాలో హ్యాట్రిక్ విజయం సాధిస్తామని బీయారెస్ నేతలు బల్లగుద్దుతున్నారు కానీ ఈసారి గతమంత ఈజీ కాదని వారు కూడా అర్ధం చేసుకున్నారు. అందుకే కేసీయార్ మేనల్లుడు హరీష్ రావు అయినా కుమారుడు కేటీయార్ అయినా కాంగ్రెస్ బీజేపీల మీద ఘాటైన విమర్శలు చేస్తూ రాజకీయంగా దూకుడు చేస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో ప్రతీ ఓటూ కీలకంగా మారుతుందని బీయారెస్ కి కచ్చితంగా తెలుసు. దాంతో తమ ఓట్లకు చిల్లు పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకునే పనిలో ఫుల్ బిజీ అయిపోయారు.
తెలంగాణాలో కారు పార్టీకి అతి పెద్ద ఇబ్బంది ఏంటి అంటే గుర్తే అంటున్నారు. కారు గుర్తుని పోలినవి ప్రతీ సారీ రంగంలోకి వస్తున్నాయి. వాటిని ఇండిపెండెంట్లకు కేటాయిస్తున్నారు. వారు పోటీ చేస్తూ వేలల్లోనే ఓట్లను కొల్లగొడుతున్నారు. ఇక చూస్తే తెలంగాణా ఎన్నికల్లో కారు గుర్తుని పోలిన ఇతర సింబల్స్ అన్నీ ఫ్రీ సింబల్స్ కావడం గమనార్హం.
అవి ఏంటి అన్నది చూస్తే కనుక రోడ్డు రోలర్, టెలివిజన్, చపాతీ రోలర్, కెమెరా, చ సోప్‌డిప్, కుట్టుమిషన్, షిప్, ఆటోరిక్షా, ట్రక్ వంటివి చాలానే ఉన్నాయి. ఇవన్నీ కూడా తమ గుర్తులుగా తీసుకుని స్వతంత్రులు రెచ్చిపోతున్నారు. మామూలుగా అయితే ఇండిపెండెంట్లకు కొద్దో గొప్పో ఓట్లు పడతాయి. కానీ భారీగా వేలలలోనే ఓట్లు పడుతున్నాయంటే అది కారు గుర్తు మహిమే అని బీయారెస్ అంటోంది. ఉప ఎన్నికల్లో కూడా అదే జరిగి దుబ్బాక లాంటి చోట్ల బీయారెస్ ఓడిన సంగతిని గుర్తు చేసుకుంటున్నారు.
ఇక నవంబర్ 30న జరుగుతున్న తెలంగాణా ఎన్నికల్లో ప్రతీ ఓటూ అన్ని పార్టీలకూ కీలకం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ బీయారెస్ ల మధ్య భీకరమైన పోరు సాగుతుంది అని ఇప్పటికే సర్వేలు చెబుతున్నాయి. అంటే ఎవరు ఓడినా లేక గెలిచినా వందల ఓట్లలోనే తేడా అని అంటున్నారు. కొన్ని చోట్ల అది కాస్తా పదుల ఓట్లకు వచ్చినా ఆశ్చర్యం లేదు అన్నది మరో లెక్క.
మరి ఇంత తక్కువగా నారోగా ఓట్ల తేడా వచ్చి గెలుపోటములను ప్రభావితం చేసే నేపధ్యంలో కారు గుర్తుని పోలిన ఇతర గుర్తులు ప్రత్యేకించి ఫ్రీ సింబల్స్ బీయారెస్ ని హడలెత్తిస్తున్నాయి. కారు గుర్తు అనుకుని చాలా మంది వాటికి ఓటేస్తూ కొంప ముంచుతున్నారని ఆ పార్టీ నేతలు గగ్గోలు పెడుతున్నారు. ఈసారి ఎన్నికలలో అలా జరగకుండా ముందుగానే బీయారెస్ జాగ్రత్త పడుతోంది.
దీని మీద బీయారెస్ ఏకంగా న్యాయస్థానాలను ఆశ్రయించింది. తాము పేర్కొన్న గుర్తులు ఏవీ ఫ్రీ సింబల్స్ గా ఉంచి ఇండిపెండెంట్లకు ఇవ్వకుండా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతోంది. మరి బీయారెస్ కోరిన విధంగా కనుక తీర్పు వస్తే మాత్రం గులాబీ పార్టీకి గుండెలలో దాగున్న బోలెడంత గుబులు పోతుంది. లేకపోతే మాత్రం అసలైన చిక్కులు తప్పవని అంటున్నారు.