కేసీఆర్ ఒంటరయ్యారా? ఒంటరి చేసుకున్నారా? : పొలిటికల్ డిబేట్
నిన్న మొన్నటి వరకు దేశాన్ని ఏలుతానని.. మార్పు తెస్తానని, మోడీని గద్దె దించుతానని.. ఆసేతు హిమా చలం వరకు గర్జించిన గొంతు ఇప్పుడు మూగనోము పట్టింది.
నిన్న మొన్నటి వరకు దేశాన్ని ఏలుతానని.. మార్పు తెస్తానని, మోడీని గద్దె దించుతానని.. ఆసేతు హిమా చలం వరకు గర్జించిన గొంతు ఇప్పుడు మూగనోము పట్టింది. ఎక్కడా ఉలుకూ పలుకూ లేకుండా.. మౌనం పాటిస్తోంది. ఇంకేముంది.. అన్ని పార్టీలనూ ఏకం చేస్తానని చెప్పిన మనిషి.. తానే ఒంటరైన పరిస్థితి కనిపిస్తోంది. ఆయనే.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. జాతీయస్థాయిలో చక్రం తిప్పుతానని బయలు దేరిన కేసీఆర్.. రాత్రికి రాత్రి టీఆర్ ఎస్‌ను బీఆర్ ఎస్‌గా మార్చేశారు.
కర్ణాటక, తమిళనాడు, బిహార్, యూపీ వంటి రాష్ట్రాలకు వెళ్లి.. అక్కడి ప్రాంతీయ పార్టీలతో చర్చలు జరిపి.. వారితో చేతులు కలిపి.. ప్రెస్‌మీట్లు కూడా పెట్టారు. దీంతో దేశంలో ఏదో మార్పు ఖాయమని.. దీనికి కేసీఆర్‌తోనే శ్రీకారం చుడుతున్నారనే సంకేతాలు కూడా పంపించారు. అంతేకాదు.. ప్రధాని మోడీపై ఒంటికాలిపై లేచారు. దేశ జీడీపీ నుంచి చైనా ఆగడాల వరకు.. అభివృద్ధి నుంచి అప్పుల వరకు ఆయన అనేక సందర్భాల్లో మోడీ సర్కారును దెప్పి పొడిచారు.
కానీ, ఇది జరిగి నాలుగు మాసాలు అయిపోయింది. ఇప్పుడు దేశంలో ఎక్కడా కేసీఆర్ మాట వినిపించడం లేదు. పైగా.. కేవలం ఒకే వైపు చూస్తున్నట్టు ఆయన చూపంతా మహారాష్ట్రవైపు ఉందని బీఆర్ ఎస్ వర్గాలు చెబుతున్నాయి. మణిపూర్ వంటి చిన్న రాష్ట్రం తగలబడిపోయిందని, గిరిజనులపై దారుణ మారణాలు జరుగుతున్నాయని దేశం మొత్తం గగ్గోలు పెడుతున్నా.. కేసీఆర్ ఎక్కడా ఒక్క మాట అనలేదు. కనీసం పెదవి విప్పలేదు.
ఇక, మరోవైపు రెండు కూటములు స్పష్టంగా తెరమీదికి వచ్చాయి. 26 పార్టీల సత్తువతో కాంగ్రెస్ తన బలాన్ని చూపించగా 38 పార్టీలతో బీజేపీ ఎన్డీయే కూటమి బలాన్ని మోడీ ప్రదర్శించారు. ఇక, మిగిలిన పార్టీలు 7. ఈ ఏడులో ఒకటి బీఆర్ ఎస్. దీనిని బట్టి.. ఆయన ప్రయత్నం ఇప్పటికి ఆగిపోయినట్టేనా? ఆయనతో కలిసి వచ్చే పార్టీలు లేవా? లేక ఆయనే కలవడం లేదా? అనే సందేహాలు తెరమీదికి వచ్చాయి. మొత్తంగా చూస్తే.. ఇప్పటికిప్పుడు కేసీఆర్ అయితే.. ఒంటరే. ఆయనతో కొన్నాళ్లు చేతులు కలిపిన కర్ణాటక జేడీఎస్ కూడా ఇప్పుడు బీజేపీ పంచన చేరిపోయింది. సో.. ఆయనే ఒంటరయ్యారా? ఆయనను ఒంటరి చేశారా? అనేది మాత్రం సస్పెన్స్‌గానే ఉంది.