టాలీవుడ్ లో డైనోసార్, డ్రాగన్, లయన్, గాడ్జిల్లా..!
అయితే మనం గమనిస్తే ఇటీవల కాలంలో స్టార్స్ ని కొన్ని వైల్డ్ యానిమల్స్ తో కంపర్ చేస్తున్నారు.
టాలీవుడ్ హీరోలందరికీ 'స్టార్' ట్యాగ్స్ ఉన్నాయి. అగ్ర హీరోల దగ్గర నుంచి యంగ్ హీరోల వరకూ.. ప్రతీ ఒక్కరికీ పేర్ల ముందు ప్రీఫిక్స్ గా ఏదొక ట్యాగ్ పెట్టడం కామన్ గా జరిగే విషయమే. అభిమానులు తమ ఫేవరేట్ హీరోలను అసలు పేర్లతో కంటే ఈ స్టార్ ట్యాగ్స్ తోనే ఎక్కువగా పిలుచుకోడాన్ని మనం చూస్తుంటాం. ఎలాంటి ట్యాగ్స్ తో పిలవద్దని కోరుకునే అజిత్ కుమార్ లాంటి హీరోలు కూడా కొందరు ఉన్నారు.. అది వేరే విషయం అనుకోండి. అయితే మనం గమనిస్తే ఇటీవల కాలంలో స్టార్స్ ని కొన్ని వైల్డ్ యానిమల్స్ తో కంపర్ చేస్తున్నారు.
సినిమాలు, క్యారక్టరైజేషన్స్, బాక్సాఫీస్ పర్ఫార్మెన్స్, స్టార్ పవర్ ను బట్టి అగ్ర హీరోలను రకరకాల పేర్లతో పిలుస్తున్నారు. ఇప్పటికే నటసింహంగా నందమూరి బాలకృష్ణ, యంగ్ టైగర్ గా జూనియర్ ఎన్టీఆర్ పాపులర్ అయ్యారు. ఇప్పుడు కొత్తగా మన హీరోలకు డైనోసార్, డ్రాగన్, లయన్, గాడ్జిల్లా.. అంటూ టైటిల్స్ ఇస్తున్నారు. ఫ్యాన్స్ పిలుచుకోవడమే కాదు, ఫిలిం మేకర్స్ సైతం సోషల్ మీడియాలో ఆ నేమ్స్ తోనే ట్యాగ్ చేస్తుండటం గమనార్హం.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన "పుష్ప 2: ది రూల్" సినిమా వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ ను రూల్ చేస్తోంది. 9 రోజుల్లోనే ₹1135 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఒక్క హిందీలోనే ₹460 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు బన్నీని 'బాక్సాఫీస్ గాడ్జిల్లా' గా అభివర్ణిస్తున్నారు. చిత్ర బృందం ప్రత్యేకంగా సోషల్ మీడియాలో ఫిక్షనల్ మాన్ స్టర్ తో పోలుస్తూ పోస్టులు పెడుతున్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఓ గ్లోబ్ ట్రాటింగ్ మూవీ చేయడానికి సన్నద్ధం అవుతున్నారు. 'SSMB 29' అని పిలుచుకుంటున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. లొకేషన్ల వేటలో భాగంగా ఆ మధ్య కెన్యా వెళ్లిన జక్కన్న.. అంబోసెలి నేషనల్ పార్క్‌లో తీసుకున్న సింహం ఫోటోని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసారు. దానికి మహేష్ ను ట్యాగ్ చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో అడవికి రారాజుగా పిలిచే సింహంతో మహేష్ ను పోల్చారంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేయడం స్టార్ట్ చేశారు.
రాజమౌళి షేర్ చేసిన ఫోటోలో ఉన్నది BOB జూనియర్ అని పిలుచుకునే టాంజానియాలోని సెరెంగేటి లయన్ కింగ్. అందుకే అప్పటి నుంచీ మహేష్ బాబు 'లయన్' అంటూ అభిమానులు ఫిక్స్ అయిపోయారు. BOB అంటే 'బాక్సాఫీస్ బాద్షా' అంటూ పోస్టులు పెడుతున్నారు. అందులోనూ జక్కన్నతో చేస్తున్న ఫారెస్ట్ యాక్షన్ అడ్వెంచర్ లో ఎక్కువ యానిమల్స్ ఉంటాయని చెప్పడంతో, తప్పకుండా లయన్ తో మహేష్ సీన్స్ ఉంటాయని భావిస్తున్నారు. దీనికి తోడు మహేష్ ఇప్పుడు 'ముఫాసా: ది లయన్ కింగ్' లో సింహానికి డబ్బింగ్ చెప్పిన సంగతి తెలిసిందే.
రెబల్ స్టార్ ప్రభాస్ "సలార్" సినిమా సక్సెస్ అయినప్పటి నుంచీ 'బాక్సాఫీస్ డైనోసార్' గా పిలవబడుతున్నారు. మారుతి దర్శకత్వంలో డార్లింగ్ నటిస్తున్న 'ది రాజాసాబ్' ఫస్ట్ లుక్ అనౌన్స్ మెంట్ అప్పుడు "డైనోసార్.. డార్లింగ్‌గా ఎలా మారాడో తెలుసుకునేందుకు సిద్ధంగా ఉండండి" అంటూ మేకర్స్ పోస్ట్ పెట్టారు. ఇక మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కనున్న చిత్రానికి 'డ్రాగన్' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. దీంతో ఫ్యాన్స్ అంతా తారక్ ను డ్రాగన్ గా పిలుస్తున్నారు. 'చిరుత'గా పాపులర్ అయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు, 'గేమ్ చేంజర్' తర్వాత మరేదైనా వైల్డ్ యానిమల్ ట్యాగ్ ను ఇస్తారేమో చూడాలి.