కేసీఆర్ సారుకు తనకు తేడాను భలేగా చెప్పేసిన సీఎం రేవంత్

శనివారం సాయంత్రం ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేసిన చిన్న కవిత అందరిని ఆకట్టుకునేలా మారింది

Update: 2024-03-24 04:33 GMT

తనదైన మార్కు కోసం తెగ ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్న ఆయన.. ఏదైనా నెగిటివిటీ చోటు చేసుకుంటే వెంటనే నష్ట నివారణ చర్యల్ని షురూ చేస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో మైలేజీకి చేతులు కట్టేసిన నేపథ్యంలో ఆయన మరో తరహా ప్రచారానికి తెర తీశారు. శనివారం సాయంత్రం ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేసిన చిన్న కవిత అందరిని ఆకట్టుకునేలా మారింది.

వారానికి రెండుసార్లు సామాన్యుల సమస్యల్ని తీర్చేందుకు వీలుగా ప్రజాదర్బార్ ను ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి.. అందుకు వేదికగా ప్రజాభవన్ ను వాడుతున్న సంగతి తెలిసిందే. అక్కడో ఐఏఎస్ అధికారిణిని ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజల సమస్యల పరిష్కారం కోసం వివిధ శాఖల్ని సమన్వయపరిచేలా ఒక సిస్టంను ఏర్పాటు చేయటం తెలిసిందే.

అయినప్పటికీ శనివారం సాయంత్రం జూబ్లిహిల్స్ లోని తన నివాసానికి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి వచ్చిన వారి బాధల్ని నేరుగా విన్నారు. సంబంధిత శాఖలకు సూచనలు చేశారు. ఈ క్రమంలో కొందరి సమస్యల్ని ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత తీరుస్తానన్న హామీని ఇచ్చిన ఆయన.. అందరిని ఊరడించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో దయాకర్ అనే రెవెన్యూ ఉద్యోగి ఒకరు సీఎం రేవంత్ ను కలిశారు.

జీవో 317 కారణంగా తనకు ఎదురవుతున్న ఇబ్బందుల గురించి ఏకరువు పెట్టారు. దీనికి సానుకూలంగా స్పందించిన సీఎం.. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే తాను చర్యలు తీసుకుంటానని.. అతడి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. తన నివాసం వద్ద సామాన్యుల్ని కలుసుకున్న విషయాన్ని అందరికి తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఒక చిన్న కవితను ఆయన పోస్టు చేశారు. ‘‘నేను’’ పేరుతో ఉన్న ఆ కవితలో తనకు.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారుకు మధ్యనున్న వైరుధ్యాన్ని చిన్ని మాటల్లో చెప్పేశారు.

‘నేను..

చేరలేని దూరం కాదు..

దొరకనంత దుర్గం కాదు..

సామాన్యుడి మనిషిని నేను..

సకల జన హితుడను నేను..’’ అంటూ పోస్టు చేసిన వైనం అందరిని ఆకట్టుకుంటోంది. తాజా పోస్టుతో జూబ్లీహిల్స్ లోని పెద్దమ్మ గుడికి దగ్గరగా ఉన్న తన ఇంటికి వచ్చే వారికి సైతం తనను కలిసే అవకాశం ఉందన్న సంకేతాన్ని భలేగా ఇచ్చేశారని చెప్పకతప్పదు.

Tags:    

Similar News