హాట్ టాపిక్: కేసీఆర్ వాహనంలో కేంద్ర బలగాల తనిఖీలు!
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు నవంబర్ 30న పోలింగ్ జరుగనున్న సంగతి తెలిసిందే. దీంతో త్వరలో ప్రచార కార్యక్రమాలను ముగించాల్సి ఉంది
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు నవంబర్ 30న పోలింగ్ జరుగనున్న సంగతి తెలిసిందే. దీంతో త్వరలో ప్రచార కార్యక్రమాలను ముగించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పార్టీలన్నీ ప్రచారంలో స్పీడ్ పెంచాయి. ఇందులో భాగంగా అధికార బీఆరెస్స్, అధినేత, సీఎం కేసీఆర్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల ప్రచారానికి ఆయన వినియోగిస్తున్న బస్సులో కేంద్ర ఎన్నికల బలగాలు తనిఖీలు నిర్వహించాయి.
అవును... తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారాలు ఒకపక్క జోరుగా సాగుతుంటే.. మరోవైపు ఎన్నికల సంఘం తనిఖీలు అదేస్థాయిలో ముమ్మరంగా జరుగుతున్నాయి! నవంబర్ 30వ తేదీన పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. నేతలు, ఓటర్లను ప్రలోభాలు పెట్టే ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఈ చర్యలకు సీఎం సైతం మినహాయింపు కాదని నిరూపించే ఘటన చోటుచేసుకుంది.
ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్... కరీంనగర్ జిల్లా మానకొండూరుకు సోమవారం వెళ్ళనున్నారు. ఈ క్రమంలోనే ఆయన వినియోగిస్తున్న బస్సును కేంద్ర ఎన్నికల బలగాలు తనిఖీలు చేశాయి. మానకొండూరులో జరగనున్న ప్రజా ఆశీర్వాద సభా ప్రాంగణానికి ప్రగతి రథం బస్సు వెళ్తున్న సమయంలో కరీంనగర్ జిల్లా గుండ్లపల్లి టోల్ గేట్ దగ్గర కేంద్ర బలగాలు ఈ బస్సును క్షుణ్ణంగా తనిఖీ చేశాయి!
ఇలా ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న కేసీఆర్ ప్రచార వాహనాన్ని కేంద్ర ఎన్నికల బలగాలు తనిఖీ చేయడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. అయితే ఈ సమయంలో ఎన్నికల నిబంధనలను అనుసరించి ఈసీ బలగాలకు సిబ్బంది పూర్తిగా సహకరించారని సమాచారం.
ఇదిలా ఉండగా.. బీఆరెస్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ ఇవాళ నాలుగు బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. ఇందులో భాగంగా... మానకొండూరు, స్టేషన్ ఘన్ పూర్, నకిరేకల్, నల్గొండ నియోజకవర్గాల్లో జరుగనున్న ప్రజా ఆశీర్వాద సభలకు హాజరై ప్రసంగించనున్నారు. ఈ సమయంలోనే మానకొండూరు సభా స్థలికి వెళ్తున్న వాహనాన్ని కేంద్ర ఎన్నికల బలగాలు తనిఖీ చేశాయి!