పథకాలు-గ్యారెంటీలు-సెంటిమెంట్లు.. వీటితోనే మార్పా?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తలపడుతున్న ప్రధాన పార్టీలను గమనిస్తే.. ఇతమిత్థంగా ఒక విషయం స్పష్టంగా తెలుస్తోంది
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తలపడుతున్న ప్రధాన పార్టీలను గమనిస్తే.. ఇతమిత్థంగా ఒక విషయం స్పష్టంగా తెలుస్తోంది. ఏ పార్టీని గమనించినా.. పథకాలు-గ్యారెంటీలు-సెంటిమెంట్లతోనే ప్రజలను ఊరిస్తున్నాయి. మేం అధికారంలోకి వస్తే.. ఇదిస్తాం.. అదిస్తాం.. అంటూ ప్రజలపై హామీల వర్షం కురిపిస్తు న్నాయి. ప్రస్తుత ఎన్నికల్లో బీఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రజలకు ఇచ్చిన హామీలను గమనిస్తే.. వాటిని నెరవేర్చేందుకు కనీసం ఏటా 5 లక్షల కోట్ల బడ్జెట్ అవసరం అవుతుందనే అంచనాలు వస్తున్నాయి.
అంతేకాదు.. నిరంతరం ఆయా ఉచిత పథకాలను అమలు చేసేందుకు బడ్జెట్‌లో కేటాయింపులే సింహ భాగం వాటికి ఇవ్వాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వాస్తవ పరిస్థితిని గమనిస్తే.. రాష్ట్ర పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్ ఇప్పటి వరకు 2 లక్షల కోట్ల రూపాయలకు మించలేదు. ఇక, జీడీపీ రాష్ట్రంలో 14 లక్షల కోట్లుగా ఉంది. అయితే.. ఇది వివిధ వర్గాలకు చెందిన ఆదాయం. దీని నుంచి బడ్జెట్ లోకి తీసుకునే వెసులు బాటు ఉండదు. కేవలం పన్నుల ద్వారానే ప్రభుత్వాలకు ఆదాయం వస్తుంది.
జీడీపీ గ్రోత్ విషయంలోనూ రాష్ట్రం దేశంలో 9వ స్థానంలో ఉంది. తెలంగాణ కన్నా చిన్నరాష్ట్రమైన మిజోరాం జీడీపీ ఎక్కువగా ఉండడంతోపాటు 7వ స్థానంలో ఉండడం గమనార్హం. ఇప్పటి వరకు ఉన్న అంచనాల మేరకు జీడీపీ గ్రోత్ 11.2 శాతం ఉంది. ఇక, ఇప్పుడు పార్టీలు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే.. జీడీపీ పెరగాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా గ్రోత్‌లో మార్పు రావాల్సి ఉంది. ఇది సాధ్యం కావాలంటే.. నిరుద్యోగం తగ్గడంతోపాటు.. ఆదాయ వనరులు పెరగాల్సిన అవసరం ఉంది.
ఈ దిశగా వచ్చే ప్రభుత్వాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ, ఈ విషయాన్ని ఏ ఒక్క పార్టీ కూడా ప్రస్తావిం చకపోవడం.. కనీసం.. రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతామనే మాట కూడా చెప్పక పోవడం గమనార్హం. కేవ లం ఉచిత పథకాలు.. నగదు పంపిణీ.. ఉచిత సేవలకు మాత్రమే ఎన్నికల్లో పరిమితం కావడం గమనా ర్హం. ఇదే సమయంలో ఇటీవల ముగిసిన మిజోరాం ఎన్నికల్లో అక్కడి అధికార పార్టీ ఎంఎన్‌పీ.. జీడీపీని కేంద్రంగా చేసుకుని ప్రజల్లోకి వెళ్లింది.
ఉపాధి అవకాశాలు, విద్యా పెంపు, నిరుద్యోగం అంశాలను ప్రధానంగా చేసుకుని ఎన్నికల ప్రచారం చేయడం గమనార్హం. అంతేకాదు.. ఎన్నికల సమయంలో ఉచితాలకు ప్రాధాన్యమే లేకుండా పోయింది. ఇక, నగదు పంపిణీలోనూ మిజోరాం చాలా చాలా వెనుకబడి ఉండడం గమనార్హం. మొత్తంగా చూస్తే.. చిన్న రాష్ట్రమే అయినా.. చాలా పెద్దచూపుతో వెళ్తున్న తీరు .. తెలంగాణ నాయకులకు పట్టకపోవడం గమనార్హం.