మాటల కత్తులు నూరితేనే కారు స్పీడ్ కు బ్రేకులా?

అంచనాలకు మించి జోరును ప్రదర్శించటం ద్వారా గులాబీ కారు నేతల తీరు ఇప్పుడు చర్చగా మారింది

Update: 2023-12-17 16:30 GMT

అంచనాలకు మించి జోరును ప్రదర్శించటం ద్వారా గులాబీ కారు నేతల తీరు ఇప్పుడు చర్చగా మారింది. సభలో కారు స్పీడ్ ను అంచనా వేసే విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ మాత్రమే కాదు.. ఆ పార్టీ నేతలు సరైన హోంవర్కు చేయలేదన్న రీతిలో శనివారం సభ జరిగిందన్నమాట వినిపిస్తోంది. ఇలాంటి వేళ.. మరికొద్ది రోజుల్లో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఎలాంటి తీరును ప్రదర్శించాలన్నది ఇప్పడు ప్రశ్నగా మారింది.

ఇంతకాలం అధికారంలో ఉండి.. తమ పాలనతో ప్రజలు విసిగిపోయి అధికారాన్ని అప్పగించిన వేళ.. గులాబీ పార్టీ మాదిరే సభలో వ్యవహరిస్తే ప్రజలకు మార్పు అర్థం కాదని.. ఇప్పటి రోజుల్లో అధికార పక్షాలు వ్యవహరిస్తున్న తీరుకు భిన్నంగా.. హుందాతనంతో వ్యవహరించాలన్న కాంగ్రెస్ ఆలోచన కొంప ముంచేలా మారుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మనం పెద్దరికంగా ఉంటే సరిపోతుందా? ప్రత్యర్థులు సైతం అదే తీరుతో ఉంటే సరి. అలా కాకుండా వారు అడ్డ బ్యాటింగ్ చేస్తున్నట్లుగా అడ్డదడ్డంగా షాట్ల మీద షాట్లు కొడుతుంటే.. సాఫ్ట్ బాల్స్ వేయటం అధికారపార్టీకి ఆత్మహత్యగా మారుతుందంటున్నారు.

ఫీల్డ్ లో చెలరేగే బ్యాట్స్ మెన్లను కట్టడి చేసేలా బౌలర్లు వేసే బౌలింగ్ స్టైల్ మార్చాల్సిన అవసరం ఉందంటున్నారు. లేనిపక్షంలో మొదటికే మోసం వస్తుందన్న వాదన వినిపిస్తోంది. అయితే.. అందరు అంటున్నట్లుగా ప్రత్యర్థులకు మాట్లాడే అవకాశాన్ని అధికార పక్షం ఇచ్చిందని.. గులాబీ పాలకుల మాదిరి కాకుండా.. సభను నిర్వహించే తీరులో మార్పును ప్రజలకు చూపించాలన్నదే తమ ఉద్దేశంగా కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. మాటల తూటాలతో విరుచుకుపడే గులాబీ నేతల మాటలకు చెక్ పెట్టేందుకు.. అంతే ధీటుగా కాంగ్రెస్ నేతలు కత్తులు నూరాల్సిన అవసరం ఉందని.. కామ్ గా ఉంటే మొదటికే మోసం వస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మాటల కత్తులతోనే కారు స్పీడ్ ను కంట్రోల్ చేయొచ్చని లేదంటే.. అధికార పార్టీ నేతల్లో మోరల్ దెబ్బ తింటుందన్న వాదన వినిపిస్తోంది.

ఇప్పుడు పెరిగిన మీడియా.. సోషల్ మీడియా పరిధి నేపథ్యంలో హుందాగా బంతులు వేస్తానని చెప్పుకుంటే ఎవరూ హర్షించరని చెబుతున్నారు. ప్రత్యర్థి పట్ల కనికరం ఏమిటన్న మాట వినిపిస్తోంది. అధికారంలోకి వచ్చారని విపక్షాలు ఏమైనా ఆగాయా? అలాంటప్పుడు అధికారపక్షం మాత్రం వేచి చూసే ధోరణిని ఎందుకు అనుసరించాలని ప్రశ్నిస్తున్నారు. ఏమైనా నిప్పులు చెరిగేలా పంచ్ లు వేస్తున్న గులాబీ నేతలకు.. మాటల కత్తులు నూరి.. ధీటుగా బదులివ్వాల్సిందేనని లేదంటే.. మరిన్ని ఇబ్బందులు తప్పవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News