రేవంత్ సర్కారుకు అర్జెంట్ గా రూ.40వేల కోట్లు కావాలట!
ప్రభుత్వానికి వస్తున్న ఆదాయంతో పోలిస్తే.. ఈ భారీ మొత్తాన్ని తీర్చటం ఇప్పటికిప్పుడు సాధ్యం కాదని తేలింది
కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. చూస్తుండగానే ప్రభుత్వంఅధికారంలోకి వచ్చి మూడు వారాలు గడిచి.. మొదటి నెలను పూర్తి చేసుకునే దిశగా అడుగులు పడుతున్నాయి. అయితే.. రేవంత్ సర్కారు ఎదుట ఉన్న అతి క్లిష్టమైన సమస్య తెర మీదకు వచ్చింది. ఇప్పటికిప్పుడు రేవంత్ సర్కారుకు రూ.40వేల కోట్ల భారీ మొత్తం అవసరమని చెబుతున్నారు. ఇంత భారీ మొత్తం ఎందుకు? అన్నంతనే భారీచిట్టాను విప్పి చూపిస్తూ.. నాన్ స్టాప్ గా చెప్పేస్తున్నారు. వివిధ పథకాలకు చెల్లించాల్సిన నిధులతో పాటు.. ఉద్యోగులు.. కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన పద్దు లెక్క ఏకంగా రూ.40,154 కోట్లుగా తేల్చారు.
ప్రభుత్వానికి వస్తున్న ఆదాయంతో పోలిస్తే.. ఈ భారీ మొత్తాన్ని తీర్చటం ఇప్పటికిప్పుడు సాధ్యం కాదని తేలింది. అన్నిప్రభుత్వ శాఖలకు కలిపి 4.78 లక్షల బిల్లులు చెల్లింపుల కోసం క్యూ కట్టి ఉన్నాయని.. తమ బిల్లుల క్లియరెన్సుకోసం వారు పడుతున్నఇబ్బంది అంతా ఇంతా కాదంటున్నారు. ఇలాంటి వేళ.. 4.78 లక్షల బిల్లులు ఇంతకాలం ఎందుకు పెండింగ్ ఉన్నాయి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
ఇంతకు ఇంత భారీగా నిధుల పెండింగ్ ఎందుకు? అదెలా జరిగింది? అన్న అంశంపై రేవంత్ సర్కారు ఫోకస్ చేసింది. ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ప్రతి మూడు నెలలకు అన్ని శాఖలకుబడ్జెట్ కేటాయింపులకు తగ్గట్లు నిధులు విడుదల చేయటం ఆనవాయితీ. అయితే.. ఆర్థిక సంవత్సరంలో మూడో విడతగా చెప్పే అక్టోబరు - డిసెంబరు వరకు ఉండే త్రైమాసికానికి ఎన్నికల కారణంగా నిధులు కేటాయింపులు జరగలేదు.
అంతేకాదు.. అంతకు ముందు ముగిసిన రెండు త్రైమాసికాల్లోనూ ఎంపిక చేసిన కొన్ని శాఖలకు మాత్రమే బిల్లుల చెల్లింపులు జరిగాయే తప్పించి.. అందరికి చెల్లింపులు క్లియర్ చేయలేదు. ప్రభుత్వ ఉద్యోగుల వ్యక్తిగత బిల్లులే ఏకంగా రూ.వెయ్యి కోట్ల వరకు పెండింగ్ లో ఉన్నట్లుగా తేల్చారు. పలు సంక్షేమ కార్యక్రమాలకు ప్రభుత్వ వాటాను చెల్లించాల్సిన నిధులు కూడా పెండింగ్ లో ఉన్నాయి. కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులే రూ.10వేల కోట్లకు పైనే ఉండటం గమనార్హం.
ఇప్పుడున్న పరిస్థితుల్లో బిల్లుల చెల్లింపులు జరపకున్నా.. పెండింగ్ ను యుద్ద ప్రాతిపదికన క్లియర్ చేయున్నా సమస్యే అని చెబుతున్నారు. రేవంత్ ప్రభుత్వం కొలువు తీరిన నేపథ్యంలో అన్ని శాఖల్ని రివ్యూ చేస్తున్నారు ముఖ్యమంత్రి. ఈ నేపథ్యంలో చెల్లింపులు మరింత ఆలస్యమవుతాయని చెబుతున్నారు. అదే జరిగితే వివిధ వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావటం ఖాయమంటున్నారు. దీనికి తోడు నిధుల కొరత కూడా వేధిస్తున్న నేపథ్యంలో.. రుణాల్ని తీసుకురావటం.. ఇప్పటికే చెల్లింపులు జరపాల్సిన వాటిని క్లియర్ చేస్తూ.. వాటి తీరుపై విచారణ చేపడితే ఉభయ తారకంగా ఉంటుందని చెబుతున్నారు.