ఎంఎల్సీల ఫైలుకు రెడ్ సిగ్నల్ ?
కేసీఆర్, గవర్నర్ మధ్య వార్ ఇంకా నడుస్తూనే ఉంది. ప్రస్తుతం గవర్నర్ దగ్గరున్న ఇద్దరు ఎంఎల్సీల ఫైల్ పై సంతకం చేయడానికి గవర్నర్ తమిళిసై ఇష్టపడటం లేదని అర్ధమవుతోంది.
కేసీఆర్, గవర్నర్ మధ్య వార్ ఇంకా నడుస్తూనే ఉంది. ప్రస్తుతం గవర్నర్ దగ్గరున్న ఇద్దరు ఎంఎల్సీల ఫైల్ పై సంతకం చేయడానికి గవర్నర్ తమిళిసై ఇష్టపడటం లేదని అర్ధమవుతోంది. గవర్నర్ కోటాలో దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణను నామినేట్ చేస్తు మంత్రివర్గం గవర్నర్ కు ఫైలు పంపింది. దాదాపు నెల రోజుల క్రితం వెళ్లిన ఫైలుపై గవర్నర్ ఇంతవరకు సంతకం పెట్టకుండా అలాగే పెండింగులో ఉంచారు.
గతంలో పాడి కౌశిక్ రెడ్డి విషయంలో ఏమి జరిగిందో ఇపుడు కూడా అదే జరుగుతోంది. పైగా ఇద్దరి పేర్లు సిఫారసులపై సంతకం పెట్టే విషయం పరిశీలనలో ఉందని స్వయంగా గవర్నరే చెప్పారు. గవర్నర్ కోటాలో భర్తీచేయాల్సిన ఇద్దరి నేపధ్యం అందుకు సరిగ్గా ఫిట్టవుతుందో లేదో పరిశీలించకుండా తాను సంతకం పెట్టనని గవర్నర్ స్పష్టంగా చెప్పేశారు. దాంతో వీళ్ళ నియామకానికి గవర్నర్ ఆమోదముద్ర వేయరనే విషయం అర్ధమైపోతోంది.
గవర్నర్ కోటా అంటే రాజకీయంగా ఎవరికిపడితే వారిని ఎలాపడితే అలా నామినేట్ చేయటానికి ఇతరత్రా కోటా కాదన్నారు. ఎందుకంటే గతంలో కౌశిక్ రెడ్డి నియామకానికి కూడా గవర్నర్ ఆమోదం చెప్పలేదు. వేరేదారిలేక కేసీయార్ గవర్నర్ కు పంపిన సిఫారసులను ఉపసంహరించుకున్నారు. ఎందుకంటే కౌశిక్ పై అనేక కేసులున్నాయి. కాబట్టి కేసుల్లో ఇరుక్కున్న వారికి తాను ఆమోదం తెలిపే ప్రసక్తే లేదని చెప్పేశారు. అందుకనే కేసీయార్ ఆ ఫైలును ఉపసంహరించుకుని తర్వాత ఎంఎల్ఏల కోటాలో ఎంఎల్సీని చేశారు.
కేసీయార్ నుండి వచ్చిన ప్రతిఫైలుపైన గవర్నర్ గుడ్డిగా ఎలాపడితే అలా సంతకాలు చేసేసి పంపే పద్దతికి స్వస్ధిపలికారు. ప్రతిఫైలును గవర్నర్ క్షుణ్ణంగా చదువుతున్నారు. మంచి చెడ్డు పరిశీలించి, అవసరమైన సమాచారాన్ని తెప్పించుకుంటున్నారు. ఇంటెలిజెన్స్ వర్గాల నుండి రిపోర్టును కూడా తెప్పించుకుంటున్నారు. ఇదంతా చూస్తుంటే గవర్నర్ కోటాలో ఎంఎల్సీలు అయ్యే అర్హత శ్రవణ్, కుర్రాకు లేదని బహుశా గవర్నర్ అభిప్రాయంతో ఉన్నట్లు అర్ధమవుతోంది. మరి తన వద్దే గవర్నర్ ఈ ఫైలును ఎంతకాలం అట్టిపెట్టుకుంటారో తెలీటంలేదు. చూస్తుంటే కేసీయార్ తొందరలోనే ఈ ఫైలును వెనక్కు తెప్పించుకునే అవకాశం లేకపోలేదని సమాచారం.