అట్లుంటుది మనోళ్లతోని.. ఓ రేంజులో తాగేశారు!

ప్రస్తుతం సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఇంకా మే నెల కూడా రాకముందే 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగత్రలు నమోదవుతున్నాయి.

Update: 2024-04-20 11:21 GMT

ప్రస్తుతం సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఇంకా మే నెల కూడా రాకముందే 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగత్రలు నమోదవుతున్నాయి. వడగాడ్పులు విజృంభిస్తున్నాయి. ఉష్ణతాపం, వేడిగాలులతో చిన్నాపెద్దా అంతా అల్లాడుతున్నారు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ విభాగాలు వడదెబ్బల బారినపడకుండా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఎండ వేడిని తట్టుకోలేక అంతా కొబ్బరి బోండాలు, తాటి ముంజలు, కూల్‌ డ్రింక్స్, పుచ్చకాయలు, కర్భూజాలు, ఫ్రూట్‌ జ్యూసులను ఆశ్రయిస్తున్నారు.

మరోవైపు మందు బాబులు ఎక్కడా తగ్గడం లేదు. ఎండ వేడిని తట్టుకోవడానికి బీర్లను ఫుల్లుగా తాగి పడేస్తున్నారు. వేసవి తాపాన్ని తట్టుకోవడానికి చల్లటి బీర్లను తాగి చిల్‌ అవుతున్నారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో బీర్ల అమ్మకాలు ఆల్‌ టైమ్‌ రికార్డు స్థాయిని అందుకుంటున్నాయి.

ఒక్క ఏప్రిల్‌ నెలలోనే మందుబాబులు బీర్లపైన ఎగబడటంతో గత రికార్డులు బద్దలయ్యాయి. ఏప్రిల్‌ 1 నుంచి 18 వరకు కేవలం 18 రోజుల్లోనే ఏకంగా రూ.670 కోట్ల విలువైన బీర్లను తాగేశారు. దీన్ని బట్టి బీర్ల అమ్మకాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. మద్యం అమ్మకాలతో పోలిస్తే బీర్ల అమ్మకాలు పెరిగాయని చెబుతున్నారు. అమ్మకాల్లో రంగారెడ్డి తొలిస్థానంలో, వరంగల్‌ రెండో స్థానంలో ఉన్నాయి.

ఏప్రిల్‌ నెలలో 18 రోజుల్లోనే 23,58,827 కేసుల బీర్లు అమ్ముడు పోయినట్లు ఎక్సైజ్‌ అధికారులు వెల్లడించారు. కాగా గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే ఈ ఏడాది 28.7 శాతం ఎక్కువగా బీర్లు అమ్ముడు పోయినట్లు చెబుతున్నారు.

వేసవి ఇంకా రెండు నెలలు కొనసాగే అవకాశం ఉండటంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా బీర్ల కొరత లేకుండా ఎక్సైజ్‌ అధికారులు చర్యలు చేపడుతున్నారు. మరోవైపు వేసవిలో సెలవులతోపాటు శుభకార్యాలు వంటివాటితో బీర్ల అమ్మకాలు మరింత పెరుగుతాయని అంటున్నారు.

కాగా తెలంగాణలో 2,620 మద్యం దుకాణాలు ఉన్నాయి. ఇవి కాకుండా 1000 కి పైగా బార్లు, క్లబ్బులు, టూరిజం హోటల్స్‌ కూడా ఉన్నాయి. వీటిలో మద్యం అందిస్తున్నారు. వీటి ద్వారా రోజుకు 90 నుంచి 100 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు.

Tags:    

Similar News