అర్థరాత్రి దాటిన తరువాత అదే చర్చలు.. ఎవరికి ఏ శాఖ తేల్లేదు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి.. ఉప ముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్క.. మరో పది మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయటం తెలిసిందే

Update: 2023-12-09 04:04 GMT

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి.. ఉప ముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్క.. మరో పది మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయటం తెలిసిందే. సాధారణంగా ప్రమాణస్వీకారం చేసిన గంటల వ్యవధిలోనే ఎవరికి ఏ శాఖను కేటాయించారన్న నిర్ణయాన్ని ప్రకటించటం జరుగుతుంది. అదే రీతిలో.. ప్రమాణస్వీకారం చేసిన పదకొండు మంది మంత్రులకు ఆయా శాఖలు కేటాయించినట్లుగా జాబితా బయటకు వచ్చినా.. అదేదీ అధికారికం కాకపోవటం తెలిసిందే. ఆ మాటకు వస్తే.. మంత్రులకు కేటాయించాల్సిన శాఖలపై ఇంకా క్లారిటీ రాలేదు.

శుక్రవారం ఉదయం ప్రజాదర్బారుతో పాటు.. విద్యుత్ శాఖపై రివ్యూ నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్.. ఢిల్లీకి వెళ్లటం.. అక్కడ తన ఎంపీ పదవికి రాజీనామా చేయటంతో పాటు.. మంత్రివర్గంలోని మంత్రులకు ఏయే శాఖలు కేటాయించాలన్న దానిపై పెద్దఎత్తున చర్చ జరిగినట్లుగా చెబుతున్నారు. ఈ చర్చలు శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత కూడా సాగటం గమనార్హం.

ఇటీవల ఎన్నికలు జరిగిన మధ్యప్రదేశ్.. ఛత్తీస్ గఢ్.. రాజస్థాన్ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. అగ్రనేత రాహుల్ రోజంతా రివ్యూ చేస్తున్నారు.ఈ నేపథ్యంలో పార్టీ సంస్థాగత వ్యవహారాల కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో కలిసి రేవంత్ దాదాపు రెండు గంట లపాటు భేటీ అయ్యారు. కీలక శాఖలైన హోం.. ఆర్థిక.. రెవెన్యూ.. వైద్యం.. మున్సిపల్.. విద్యుత్.. నీటిపారుదల.. ఐటీ శాఖల్ని ఎవరికి అప్పజెప్పాలన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది.

గతంలో మంత్రులుగా పని చేసిన అనుభవం ఉన్న వారికి.. సీనియర్లకే కీలక శాఖలు అప్పజెప్పాలన్న నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. దీంతో.. సీతక్కకు హోం శాఖ ఇచ్చే అవకాశం లేనట్లే. అయితే.. ఎవరికి ఏ శాఖను కేటాయించారన్న దానిపై అధికారికంగా ఎలాంటి జాబితాను విడుదల చేయలేదు. మంత్రివర్గం కూర్పుపై ఒక క్లారిటీ వచ్చిన అనంతరం కేసీ వేణుగోపాల్.. ఠాక్రే.. రేవంత్ కలిసి ఖర్గే నివాసానికి వెళ్లారు. వారితో రాహుల్ కూడా జాయిన్ అయ్యారు. అర్థరాత్రి దాటిన తర్వాత కూడా వారి చర్చలు సాగాయి. మిగిలిన మంత్రిత్వ శాఖలు ఎమ్మెల్యేల్లో ఎవరికి కేటాయించాలి? ఎంత మందిని మంత్రివర్గంలోకి తీసుకోవాలన్న దానిపై ఈ రోజు (శనివారం) నిర్ణయం తీసుకోనున్నారు.

Tags:    

Similar News