పదేళ్లు గొప్పగా.. 50 ఏళ్లు విధ్వంసమే.. పాత పాటతో రేవంత్ అండ్ కోను ఆడేసుకున్న కేటీఆర్!

రాష్ట్రం ఏదైనా.. అధికారపార్టీ మాట్లాతుంది. వారికి కౌంటర్ ఇచ్చేందుకు విపక్షం ప్రయత్నిస్తుంది

Update: 2023-12-17 05:24 GMT

రాష్ట్రం ఏదైనా.. అధికారపార్టీ మాట్లాతుంది. వారికి కౌంటర్ ఇచ్చేందుకు విపక్షం ప్రయత్నిస్తుంది. వారి నోటి నుంచి మాటలు రాకుండా చేసి.. వారి గొంతును పవర్ తో నొక్కేయటం.. అందుకు ప్రతిగా ప్రతిఘటిస్తే.. బుల్ డోజ్ చేసే వైనం చూస్తున్నదే. అందుకు భిన్నంగా.. విపక్షం మాట్లాడే మాటలను సావధానంగా వినటం.. మధ్యలో రన్నింగ్ కామెంట్రీలు.. ఎప్పటికప్పుడు పంచ్ లతో విరుచుకుపడటం లాంటివి చేయకుండా ఉండటం మంత్రి కేటీఆర్ కు కలిసి వచ్చింది. తాను చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పేసే టైం లభించటంతో తన పాత పాటనే.. మరింత ఘాటుగా మార్చి ముఖ్యమంత్రి రేవంత్ ను ఒక ఆట ఆడుకున్నారు కేటీఆర్.

శనివారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో తమ ప్రభుత్వంపై చేసిన విమర్శల్ని తిప్పి కొట్టారు కేటీఆర్. ఈ సందర్భంగా ఆయన ప్రసంగంలోని హైలెట్ లాంటి పాయింట్లు చూస్తే.. కేటీఆర్ దూకుడు ఎంతన్నది ఇట్టే అర్థమవుతుంది. 39 మంది ఎమ్మెల్యేలే ఉన్నామన్న జంకు లేకుండా.. ఎదురుదాడే లక్ష్యంగా.. డిఫెన్సు గేమ్ ఆడకుండా.. అటాకింగ్ గేమ్ ఆడేయటం ఆసక్తికరంగా మారింది. కేటీఆర్ వ్యాఖ్యల్లోకీలక అంశాల్ని చూస్తే..

- మూడు నెలల సమయంలోనే కాంగ్రెస్ పాలన అంతా అట్టర్ ప్లాప్ అవుతుంది. యాభై ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వాల పాలనలో అంతా విధ్వంసమే జరిగింది.కరువు.. ఆకలిచావులు.. వలసలే కనిపించాయి. గవర్నర్ ప్రసంగం అంతా అసత్యాలతో.. తప్పుల తడకగా ఉంది. ఇలాంటి ప్రసంగం వినటానికి సభలో ఉన్నందుకు ఒక సభ్యుడిగా సిగ్గు పడుతున్నాని.. ఇంతటి దారుణమైన.. అపసవ్యపు ప్రసంగం అసెంబ్లీ చరిత్రలో ఎప్పుడూ లేదు.

- చేయాల్సిన దారుణాలు.. ఘాతుకాలన్నీకాంగ్రెస్ చేసి.. నెపాన్నిపదేళ్లు నడిపిన మా పార్టీపై నెట్టే ప్రయత్నం చేశారు. గవర్నర్ దారుణమైన ప్రసంగం చూసిన తర్వాత రాబోయే ఐదేళ్లలో ప్రభుత్వ పాలన ఎలా ఉండబోతుందో మాకు.. ప్రజలకు అర్థమైంది. విద్యుత్ సంస్థల అప్పుల లెక్కలు చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం క్రియేట్ చేసిన ఆస్తుల విలువ చెప్పలేదు.

- అప్పుల గురించి చెప్పిన కాంగ్రెస్.. ఎన్నికల్లో ప్రకటించిన గ్రహజ్యోతి గ్యారెంటీని ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అనాడు కరెంటు లోటు.. అప్పులతో మాకు విద్యుత్ సంస్థల్ని అప్ప జెప్పారు. ఎంతో కష్టపడి ట్రాన్స్ కో.. జెన్ కో ఆస్తుల్ని పెంచాం. రూ.81వేల కోట్లు అప్పులు ఉన్నాయన్నారు. కానీ.. రూ.1.37 లక్షల కోట్లకు పైగా మేం కూడబెట్టిన విద్యుత్ ఆస్తుల గురించి చెప్పటం లేదు.

- పడావుబడిన భూములు, పాడుబడిన ఇళ్లు, ఆకలి కేకలు, ఆత్మహత్యలు, వలసలు, కరువులు, కర్ఫ్యూలు, ఎన్‌కౌంటర్లు, కరెంటు కోతలు, కటిక చీకట్లు, నెర్రెలు బారిన నేలలు, నెత్తురుగారిన నేలలు... ఇదే కదా ఆనాటి మీ ఘనత వహించిన ప్రభుత్వంలో చూపెట్టిన అద్భుతాలు.

- రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో ప్రతి రోజూ రెండు బస్సులు ముంబయికి పోతుండేవి. పరిశ్రమలకు వారానికి రెండు రోజులు పవర్ హాలీడేలు.. సబ్ స్టేషన్ల ముందు ధర్నాలు.. ఇదే నాటి పరిస్థితి. అప్పట్లో విద్యుత్ .. ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న రోశయ్య ఏడాదిన్నరలో కరెంటు సమస్యను పరిష్కరించకపోతే ఉరేసుకుంటానని.. సభకు బ్యాగులో ఉరితాడు తెచ్చుకున్నారు. ఈ మాటలకు స్పీకర్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. దివంగత రోశయ్య గురించి ఇప్పుడు ప్రస్తావించటం సబబు కాదని పేర్కొన్నారు.

- గవర్నర్‌ ప్రసంగంలో పౌరహక్కులు, నియంతృత్వం, నిర్భంధం గురించి మాట్లాడటం జోక్‌ ఆఫ్‌ ది మిలీనియం. చర్చల కోసం నక్సలైట్లను పిలిచి కాల్చి చంపింది మీరు కాదా? వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరినట్లు ఇప్పుడు నీతి మాటలు మాట్లాడితే సరిపోదు.

- వంద కోట్ల జనాభాను కాదని బయటి దేశం నుంచి వచ్చిన వారిని పార్టీ జాతీయ అధ్యక్షులుగా పెట్టుకున్న కాంగ్రెస్‌ పార్టీ ఎన్నారైల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది. ఎన్నారై అంటే నాన్‌ రిలయబుల్‌ ఇండియన్స్‌ అన్నారు. దీన్నిబట్టి కాంగ్రెస్‌ పార్టీకి ఎన్నారైలపై ఉన్న ప్రేమ ఏమిటో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎన్నారైలు గుర్తించాలి. ఎన్నారైలకు టికెట్లు అమ్ముకున్నదెవరో అందరికీ తెలుసు.

- సీఎం అయిన తర్వాతైనా మర్యాదగా మాట్లాడతారనుకున్నా. కొంత మందికి అది సాధ్యం కాదు. తెలంగాణ తెచ్చిన నాయకుడ్ని పట్టుకుని కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు అని ఏక వచనంతో మాట్లాడారు. తెలంగాణను వ్యతిరేకించిన వారిని గారు... అని సంబోధించినప్పుడే సంస్కారం అర్థమైంది. అచ్చోసిన ఆంబోతు అని కూడా అన్నారు. మా భట్టి అన్న, మా శ్రీధరన్న, మా దామోదరన్న, మా ప్రభాకరన్న, మా ఉత్తమన్న, మా కోమటిరెడ్డి వెంట్‌రెడ్డి అన్న.. వీరందరు కలిసి పెట్టిన కాంగ్రెస్‌ పార్టీలో దూరి ముఖ్యమంత్రి పదవి తీసుకున్న వ్యక్తి చీమలు పెట్టిన పుట్టలో పాముల గురించి మాట్లాడితే చాలా చెండాలంగా ఉంటుంది.

Tags:    

Similar News