తెలంగాణా తీర్పు: రేపటి రాజు ఎవరో తేల్చేది వారే ...?

తెలంగాణా శాసనసభ ఎన్నికలకు పోలింగ్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మరి కొద్ది గంటలలో పోలింగ్ మొదలు కానుంది

Update: 2023-11-29 14:44 GMT

తెలంగాణా శాసనసభ ఎన్నికలకు పోలింగ్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మరి కొద్ది గంటలలో పోలింగ్ మొదలు కానుంది. తెలంగాణాకు రేపటి రాజు ఎవరో తేల్చేది ఆ రెండు వర్గాలే అని అంటున్నారు. ముందుగా చూస్తే యువతరం ఈసారి చాలా ఉత్సాహంగా ఉన్నారని అంటున్నారు. గతం కంటే వారు ఎక్కువగా ఓట్లు నమోదు చేయించుకున్నారు.

అంతే కాదు ఓటేసేందుకు కూడా ఊళ్లకు తరలి వస్తున్నారు. తెలంగాణాలో ఈసారి కొత్త ఓట్లు 17 లక్షల దాకా ఉన్నాయని లెక్కలు చెబుతునాయి. ఇందులో 18 నుంచి 19 ఏళ్ళ మధ్య ఉన్న టీనేజర్లు 8.11 లక్షల మంది ఉన్నారని అంటున్నారు. వీరంతా మొదటిసారి ఓటు వేయడానికి సమాయత్తం అవుతున్నారు.

ఇక 2018లో చూస్తే మొత్తం తెలంగాణా ఓటర్లు 2,56,94,443 గా లెక్క ఉంది. అందులో గత ఎన్నికల్లో ఓటేసిన వారు 2,04,70,749గా ఉన్నారు. అంటే ఓటింగ్ శాతం ఆ ఎన్నికల్లో 79.7 శాతంగా ఉంది. ఈసారి చూస్తే తెలంగాణాలో మొత్తం ఓటర్లు . ఇక తెలంగాణాలో 2023లో ప్రస్తుతం జరుగుతున్న తాజా ఎన్నికలు చూస్తే రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,26,02,799గా ఉంది. అంటే ఏకంగా డెబ్బై లక్షల మంది దాకా కొత్త ఓటర్లు ఈసారి చేరారు అని భావించాలి.

ఇక మొత్తం ఓటర్లలో పురుషులు 1,62,98,418 మంది ఉంటే మహిళలు 1,63,01,705 మంది ఉన్నారు. ఇక ట్రాన్స్ జెండర్లు ఓటరు జాబితాలో 2,676 మంది ఉన్నారు. సర్వీసు ఓటర్ల సంఖ్య 15,406. ప్రవాస ఓటర్లు 2,944 మంది ఉన్నారు. అంటే మహిళలు యువత ఈసారి ఎన్నికల్లో కీలకమైన పాత్ర పోషిస్తారు అని తేలుతోంది అంటున్నారు.

అదే విధంగా చూసుకుంటే యువత ఈసారి కసిగా ఉన్నారు. వారు ఎవరికి ఓటేస్తారో తెలియదు కానీ వరంగల్ లోని కాకతీయ వర్శిటీని తీసుకుంటే మొత్తం 14 హాస్టళ్ళ నుంచి విద్యార్ధినీ విధ్యార్ధులు అంతా తన సొంత ఊళ్ళకు తరలిపోయారు. కనీసమైన నంబర్ లేకపోవడం వల్ల హాస్టల్ ని మూసివేస్తున్నట్లుగా అధికారులు ప్రకటించారు.

దీన్ని బట్టి చూస్తే యువత పట్టుదలగానే ఉంది అని అంటున్నారు. ఇక తెలంగాణలో పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువ. మహిళలు తలచుకుంటే మార్పు తధ్యమని అంటున్నారు. ఈ రెండు సెక్షన్లు తీవ్రంగా ప్రభావితం చేస్తాయని అంటున్నారు. గత సారి 79. 7 శాతం పోలింగ్ జరిగితే ఈసారి అయిదు నుంచి పది శాతం పెరుగుతుందని అంచనాలు ఉన్నాయని అంటున్నారు.

అదే జరిగితే ఇంత పెద్ద ఎత్తున పోలింగ్ ఎవరికి లాభం అన్న చర్చ కూడా ఉంది. ఇదిలా ఉంటే తెలంగాణలో 35,655 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో కనీస సదుపాయాలు ఏర్పాటు చేశారు. దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వారికి 21686 వీల్ ఛైర్స్ సిద్ధం చేశారు.

80 ఏళ్లు పైబడిన వారికి ఉచిత రవాణా సదుపాయం ఉంటుంది. బ్రెయిలీ లిపిలోనూ ఓటరు స్లిప్పులు, నమూనా బ్యాలెట్లు ముద్రించారు. 644 మోడల్ పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. 1,85,000 మంది పోలింగ్ సిబ్బంది, 22,000 మంది మైక్రో అబ్జర్వర్లు, స్క్వాడ్స్ మొత్తం కలిపి రెండు లక్షలకు పైగా పోలింగ్ విధుల్లో ఉంటారు. మొత్తంగా చూస్తే తెలంగాణాలో ప్రశాంతమైన ఎన్నికల కోసం రంగం సిద్ధం అయింది. ప్రజా తీర్పు ఎలా ఉంటుంది అన్నది మాత్రం ఆసక్తికరంగానే ఉంది.

Tags:    

Similar News