యూఎస్ లోని యూనివర్శిటీలో తెలుగు భాష!
తెలుగు వాళ్లు ఇంగ్లిష్ మాట్లాడటాన్ని ఫ్యాషన్ అని భావిస్తూ బ్రతుకుతున్న రోజుల్లో... అగ్రరాజ్యం అమెరికాలో తెలుగు అక్షరాలు దర్శనమిచ్చాయి
తెలుగు భాష గొప్పతనం తెలియాలంటే తెలుగులో సంభాషించాలి అని అంటారు. తెలుగు వాళ్లు ఇంగ్లిష్ మాట్లాడటాన్ని ఫ్యాషన్ అని భావిస్తూ బ్రతుకుతున్న రోజుల్లో... అగ్రరాజ్యం అమెరికాలో తెలుగు అక్షరాలు దర్శనమిచ్చాయి! దీంతో తెలుగు భాష ఎంత అందమైనది అనే విషయం ఇంగ్లిష్ లో మాట్లాడే తెలుగువారికి అర్ధమయ్యిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
అవును... తెలుగుని "ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్" అని పాశ్చ్యతులు కొనియాడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా అమెరికాలోని "కెంట్ స్టేట్ యూనివర్శిటీ" లో తెలుగు బోర్డులు దర్శన మిచ్చాయి. ఇందులో భాగంగా... విద్యార్థులకు స్వాగతం పలికే డిజిటల్ బోర్డులో "విద్యార్థులకు స్వాగతం" అని తెలుగు భాష దర్శనమిచ్చింది.
దీంతో ఈ ఫోటోను అక్కడి విద్యార్థులు నెట్టింట పోస్ట్ చేయడంతో.. ఇప్పుడు ఆ బోర్డు ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తోంది.
కాగా... అమెరికాలో తెలుగు భాష మాట్లాడే వారి సంఖ్య వేగంగా పెరుగుతోన్న సంగతి తెలిసిందే. అమెరికా థింక్ టాంక్, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్, సెంటర్ ఆఫ్ ఇమిగ్రేషన్ సంయుక్తంగా జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఇందులో భాగంగా... అమెరికాలో ఇంగ్లీష్ కాకుండా ఎక్కువగా మాట్లాడే టాప్ 20 భాషల్లో తెలుగు ముందు వరుసలో ఉంది.
2011 జనాభా లెక్కల ప్రకారం ఇండియాలో అత్యధికులు మాట్లాడే నాలుగో భాష తెలుగు కాగా... ఇదే విధంగా అమెరికాలోనూ ఇంగ్లీష్ కాకుండా ఇతర భాషలు మాట్లాడేవారిలో తెలుగు మాట్లాడేవారు 4 లక్షలకు పైగా ఉన్నారని అంటున్నారు.