పిథాపురంలో ఓటుకు పదివేలు...ఫ్యామిలీకి లక్ష....!?

పిఠాపురం నుంచి తనను గెలిపిస్తే ఒక ఎమ్మెల్యే ఎంత అభివృద్ధి చేయగలడో చేసి చూపిస్తాను అని అంటున్నారు.

Update: 2024-03-19 17:47 GMT

పిఠాపురం ఈసారి ఏపీలో హాట్ సీట్ గా మారుతోంది. దానికి కారణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడ నుంచి పోటీ చేయడమే. పవన్ పిఠాపురం సీటును ప్రత్యేకమైనదిగా అభివర్ణించారు. పిఠాపురం నుంచి తనను గెలిపిస్తే ఒక ఎమ్మెల్యే ఎంత అభివృద్ధి చేయగలడో చేసి చూపిస్తాను అని అంటున్నారు.

దానికి తన సొంత నియోజకవర్గం చేసుకుంటానని కూడా అంటున్నారు. అదే విధంగా పిఠాపురంలోనే నివాసం ఉంటాను అని చెబుతున్నారు. ఈసారి పిఠాపురంలో తన మెజారిటీ లక్షకు పై దాటుతుంది అని పవన్ ధీమా వ్యక్తం చేశారు. పిఠాపురంలో పవన్ పర్యటిస్తున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ మీద కూడా విమర్శలు చేశారు. తన లాంటి వారు ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యేగా గెలిచి చట్ట సభలలో ఉండడం ప్రజలకు కూడా అవసరం అన్నారు అయితే తనను ఓడించాలని వైసీపీ చూస్తోందని ఒక ఓటు ఉంటే పదివేలు, ఏకంగా కుటుంబానికి లక్ష రూపాయలు ఇచ్చి గెలవాలని చూస్తోందని పవన్ సంచలన కామెంట్స్ చేశారు.

అన్ని రకాలుగా సామ దాన భేద దండోపాయాలకు తెర తీశారు అని ఆయన మండిపడ్డారు. ఇక పిఠాపురంలో తన మీద పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్ధి వంగా గీతను 2009లో ప్రజారాజ్యం తరఫున పిఠాపురం నుంచి గెలిపించామని గుర్తు చేశారు. ఆమె కూడా జనసేనలో చేరాలని పవన్ ఓపెన్ గా పిలుపు ఇచ్చేశారు.

పిఠాపురంలో గెలవడం కాదు రీ సౌండ్ చేయాలని పవన్ అంటున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే పిఠాపురంలో ఓటు పది వేలకు వెళ్ళిందా ఒక ఫ్యామిలీకి లక్ష రూపాయలు వంతున ఖర్చు చేస్తున్నారా నిజమేనా ఇదంతా అన్న చర్చ మొదలైంది.

ఇప్పటికి ఏడేళ్ల క్రితం నంద్యాలలో ఉప ఎన్నికలు జరిగితే ఓటుకు అయిదు వేలు అపుడు పంచారు అన్నది సంచలన వార్తగా ఉంది. ఒక ఫ్యామిలీకి ఇరవై వేలు ఇచ్చారని ప్రచారం జరిగింది. అందులో నిజానిజాలు ఎంతో తెలియవు. కానీ నంద్యాలలో ఉప ఎన్నిక అన్నది కాస్ట్లీ యెస్ట్ ఎన్నికగా ఆ రోజుకీ ఈ రోజుకీ నిలిచిపోయింది. ఇపుడు ఏపీలో మొత్తం 175 సీట్లలో పిఠాపురం సీటు అలా మారబోతుందా అన్నది చర్చగా ఉంది. మొత్తం మీద చూస్తే వైసీపీ పవన్ విషయంలో అసలు తగ్గదు అనే అంటున్నారు.

అదే సమయంలో పవన్ కాపు అయితే తాను కూడా కాపుల ఆడపడుచునే అని వంగా గీత అంటున్నారు. తనకు జనాలతో డైరెక్ట్ గా పరిచయం ఉందని తాను ఈ ప్రాంత వాసిని అని చెబుతున్నారు. తననే ప్రజలు ఎన్నుకుంటారు అని అంటున్నారు. తన గెలుపు ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి చూస్తే పిఠాపురం వైపు ఏపీ అంతా చూడాల్సిన అవసరం అయితే ఉంది అంటున్నారు.

Tags:    

Similar News