టీజీ వెంకటేష్ గవర్నర్ కాబోతున్నారా ?
ఏపీ బీజేపీ సీనియర్ నేత, మాజీ టీడీపీ మాజీ కాంగ్రెస్ నాయకుడు అయిన టీజీ వెంకటేష్ అందరికీ సుపరిచితులే.
రాజకీయాల్లో ఎవరికి ఎపుడు పదవులు వస్తాయో ఆ దేవుడికి తప్ప ఎవరికీ తెలియదు. అందులోనూ అధినాయకత్వం తో బాగా ఉన్న వారికి పదవులు వడ్డించిన విస్తరి మాదిరిగానే ఉంటాయి. ఏపీ బీజేపీ సీనియర్ నేత, మాజీ టీడీపీ మాజీ కాంగ్రెస్ నాయకుడు అయిన టీజీ వెంకటేష్ అందరికీ సుపరిచితులే. ఆయనది సుదీర్ఘమైన రాజకీయ జీవితం.
ఆయన కాంగ్రెస్ నుంచి టీడీపీ లోకి వచ్చారు. టీడీపీ నుంచి రాజ్యసభకు ఎంపిక అయి 2019లో టీడీపీ ఓటమి తరువాత బీజేపీలో చేరారు. అలా ఆయన ఇపుడు కాషాయం పార్టీలో కీలక నేతగా ఉన్నారు. చిత్రమేంటి అంటే ఆయన కుమారుడు టీజీ భరత్ టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉండడం.
తండ్రి ఒక పార్టీ తల్లి ఒక పార్టీ కుమారుడు ఒక పార్టీ అన్నది షరా మామూలు వ్యవహారమే. రాజకీయాల్లో ఇవన్నీ మామూలే కాబట్టి ఎవరూ పట్టించుకోరు. పైగా అంగబలం అర్ధబలం దండీగా ఉన్న నాయకుడు కావడం వల్ల ఏడు పదుల వయసులోనూ టీజీని పదవులు వరించి వస్తున్నాయని అంటున్నారు. టీజీ సేవలను గుర్తిస్తూ కేంద్ర బీజేపీ అధినాయకత్వం ఆయనను తొందరలో రాజ్ భవన్ కి పంపుతుందుందని ప్రచారం అయితే జోరుగా సాగుతోంది.
టీజీ వెంకటేష్ గవర్నర్ కాబోతున్నారు అన్న వార్తలు అయితే చక్కర్లు కొడుతున్నాయి. ఆయన పార్టీకి అతి పెద్ద ఆర్థిక వనరుగా ఉన్నారని పైగా రాయలసీమ జిల్లాలకు చెందిన వారు కావడంతో ఆయనను గవర్నర్ చేయాలని కాషాయం పార్టీ పెద్దలు గట్టిగానే డిసైడ్ అయ్యారని అంటున్నారు.
ఈ మేరకు ఒక నిర్ణయం అయితే కేంద్ర స్థాయిలో జరిగిపోయిందని ఇక ప్రకటన వెలువడడమే తరువాయని అంటున్నారు. అంతే కాదు టీజీ వెంకటేష్ తన సన్నిహితుల వద్ద కూడా ఈ విషయాన్ని పంచుకుంటున్నట్లుగా చెబుతున్నారు. దేశంలోనే కీలకమైన ఒక రాష్ట్రానికి గవర్నర్ గా టీజీ వెంకటేష్ ని పంపిస్తారు అని అంటున్నారు.
టీజీకి గవర్నర్ పదవిని ఇవ్వడం ద్వారా రాయలసీమలో పార్టీని అభివృద్ధి చేసుకోవాలన్న ఎత్తుగడలో బీజేపీ ఉందని అంటున్నారు. టీజీ వెంకటేష్ కేంద్ర పెద్దలతో బాగా సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు అని అంటున్నారు. తనకు కీలకమైన పదవి ఏదైనా ఇస్తే పార్టీ అభివృద్ధికి ఇతోధికంగా కృషి చెస్తాను అని టీజీ చెప్పినట్లుగా ప్రచారం ఉంది.
దానికి అంగీకరించిన కేంద్ర పెద్దలు ఆయనను గవర్నర్ గా పంపుతారు అని తెలుస్తోంది. అనుకున్నవన్నీ జరిగితే కనుక టీజీని తొందరలోనే గవర్నర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అవుతాయని అంటున్నారు. మొత్తం మీద చూస్తే టీజీకి ఈ పదవి దక్కితే మాత్రం రాజకీయంగా ఆయన అంత లక్కీ ఎవరికీ ఉండదనే అంటున్నారు. ఎందుకంటే ఆయన కుమారుడు రాజకీయంగా అందుకు వచ్చారు. కీలకమైన పదవిలో ఉన్నారు. ఇపుడు టీజీ కూడా పదవిని దక్కించుకుంటే డబుల్ ధమాకా అన్న మాట. సో టీజీ ఫ్యాన్స్ ఆ శుభ వార్త కోసం వెయిట్ చేస్తున్నారుట.