జైలుకెళ్ళిన ప్రతీ వారూ సీఎం అయిపోరా ?

భారత దేశం అంటేనే సెంటిమెంట్ కి నిలయం. ఇక్కడ చెడ్డ పనిచేసిన వాడిని అయినా శిక్ష వేస్తూంటే జనాలు ఎమోషన్ అవుతారు.

Update: 2025-02-08 09:46 GMT

భారత దేశం అంటేనే సెంటిమెంట్ కి నిలయం. ఇక్కడ చెడ్డ పనిచేసిన వాడిని అయినా శిక్ష వేస్తూంటే జనాలు ఎమోషన్ అవుతారు. అయ్యో అనుకుంటారు. ఎన్ని తప్పులు చేయనీ జైలుకు వెళ్ళాడంటే చాలు సముద్రమంత జాలి చూపిస్తారు. ఇదంతా గత ఏడున్నర దశాబ్దాల రాజకీయ తెరపైన సాగిన చిత్ర విచిత్రం.

దానికి తగినట్లుగానే ఆనాడు ఇందిరాగాంధీని జైలులో పెట్టారని ఆమెను మళ్ళీ బంపర్ మెజారిటీతో జనాలు గెలిపించారు. కేవలం రెండేళ్ళ కాలంలో ఇందిరాగాంధీ హయాంలో జరిగినన్ని తప్పులు కొట్టుకుపోయాయి. ఎమర్జెన్సీ చీకటి బాధాలూ వెనక్కి వెళ్ళాయి.

అదే వరసలో చాలా మందిని రాజకీయంగా వేధించినా ఇబ్బంది పెట్టినా జనాలు మాత్రం వారిని అక్కున చేర్చుకుని అందలం ఎక్కించడం పరిపాటిగా మారింది. లాలూ ప్రసాద్ ని జైలు పాలు చేస్తే ఆర్జేడీ మరింత బలపడింది తప్ప ఎక్కడా ఇబ్బంది పడలేదు.

జయలలితను జైలుపాలు చేస్తే జనాలు జేజేలు పలికి ఆమెకు వరసగా రెండు సార్లు అధికారం అప్పగించారు. తెలుగునాట చూస్తే వైఎస్ జగన్ జైలుకి వెళ్ళారన్న కారణంతో ఆయన పట్ల సానుభూతి పెరిగింది. అదే 151 సీట్లతో సీఎం గా చేయడానికి దోహదపడింది అని అంటారు. తెలంగాణాలో రేవంత్ రెడ్డి కూడా జైలుకు వెళ్ళి వచ్చిన తరువాతనే సీఎం అయ్యారు. రీసెంట్ టైం లో చంద్రబాబు కూడా జైలుకు వెళ్ళి వచ్చారు, సీఎం అయ్యారు. ఈ మధ్యనే జరిగిన జార్ఖండ్ ఎన్నికల్లోనూ అక్కడ జైలుకు వెళ్ళి వచ్చిన హేమంత్ సోరేన్ ని జనాలు ఎన్నికల్లో మరోసారి గెలిపించి సీఎం గా చేశారు.

ఇవన్నీ చూసిన వారు ఢిల్లీ ఎన్నికల్లో కూడా కచ్చితంగా అరవింద్ కేజ్రీవాల్ గెలుస్తారని అనుకున్నారు. దానికి కారణం ఆయన జైలుకు వెళ్ళి వచ్చారు. లిక్కర్ స్కాం లో కొన్నాళ్ళ పాటు ఆయన జైలు జీవితం గడిపారు. దాంతో జైలు సెంటిమెంట్ ఆయనకూ వర్తిస్తుందని అనుకున్నారు.

కట్ చేస్తే ఢిల్లీ ఎన్నికల్లో ఆయన పార్టీ ఓడిపోవడమే కాకుండా కేజ్రీవాల్ కూడా తాను పోటీ చేసిన ఢిల్లీ శాసనసభ నియోజకవర్గంలో ఓటమి పాలు అయ్యారు. దీంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. పైగా చాలా మంది పోస్టింగులు కూడా దీని మీద పెడుతూంటే నెటిజన్లు అదే స్థాయిలో కామెంట్స్ పెడుతున్నారు.

అరెస్ట్ అయిన ప్రతి వాడు సీఎం అయిపోడు....ఉన్న ఎమ్మెల్యే సీట్ కూడా ఓడించారు ఢిల్లీ ప్రజలు అంటూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టింగ్ తెగ వైరల్ అవుతోంది. దాని అడుగున లెసన్ టూ తెలంగాణా అని కూడా ఉంచారు. అంటే తెలంగాణాలో ఇపుడు కేసులు అరెస్టులు అని కొంత రచ్చ సాగుతోంది. అధికార కాంగ్రెస్ పార్టీ బీఆర్ ఎస్ నాయకులను అరెస్ట్ చేయాలని చూస్తోందని జైలికి వెళ్తే తమకే మంచిదని ఆ పార్టీలో భావిస్తున్నారు అని చర్చ సాగింది. కానీ ఇపుడు ఢిల్లీ ఫలితాలు చూసిన తరువాత అరెస్టులు చేసినా జైలు పాలు అయినా జనాల తీ కచ్చితంగా ఉంటుందని తెలుస్తోంది అంటున్నారు.

తీర్పు ఈ విధంగా రావడానికి కారణం న్యూ జనరేషన్ ఓటర్లు ఎమోషన్స్ ని పక్కన పెట్టి అసలు విషయాన్ని చూస్తున్నారు అని అంటున్నారు. అంటే సానుభూతి పాలిటిక్స్ కి కాలం చెల్లినట్లేనా అన్న చర్చ కూడా సాగుతోంది. మొత్తానికి అది కేజ్రీవాల్ తోనే మొదలు కావడం అంటే ఆప్ కి మా చెడ్డ రోజులు వచ్చినట్లే అంటున్నారు.

Tags:    

Similar News