''పద్దన్నా..'' నువ్వే సికింద్రాబాద్ లో పెద్దన్న
అలాంటి పార్టీ పద్దన్నా.. నువ్వే పెద్దన్న అంటూ ఓ నాయకుడికి టికెట్ ఇచ్చింది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి.. లోక్ సభ ఎన్నికల ముంగిట నాయకులను కోల్పోతున్న ఆ పార్టీ దిక్కుతోచని స్థితిలో ఉంది. కీలక నేత అరెస్టు.. అధినేత గాయంతో సతమతం అవుతోంది. సిటింగ్ ఎంపీలను చేజార్చుకుంటూ అభ్యర్థులను వెదుక్కుటోంది. అలాంటి పార్టీ పద్దన్నా.. నువ్వే పెద్దన్న అంటూ ఓ నాయకుడికి టికెట్ ఇచ్చింది.
కేంద్ర మంత్రి సీటు
తెలంగాణలోనే కాదు ఏపీ నుంచి కూడా ప్రస్తుతం ఏకైక కేంద్ర మంతి జి.కిషన్ రెడ్డి. అలాంటి నాయకుడి నియోజకవర్గం సికింద్రాబాద్. వచ్చే ఎన్నికలకు ఆయనకే బీజేపీ టికెట్ ఇచ్చింది. ఇక కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నుంచి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ను చేర్చుకుని మరీ సీటిచ్చింది. మరి.. మొన్నటివరకు తెలంగాణలో అధికారం చెలాయించిన బీఆర్ఎస్ పరిస్థితి ఏమిటి..? జీహెచ్ఎంసీలో అత్యధిక సీట్లు గెలుచుకున్న ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి
ఎవరు? దీనికి సమాధానం సికింద్రాబాద్ లోక్‌సభ స్థానానికి సికింద్రాబా ఎమ్మెల్యే, మాజీ మంత్రి పద్మారావు గౌడ్‌ను అభ్యర్థిగా ప్రకటించారు.
కార్పొరేటర్ నుంచి..
ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే, దివంగత పీజేఆర్ కు అత్యంత సన్నిహితుడైన పద్మారావు గౌడ్.. 1991 వరకు కార్పొరేటర్ గా ఉన్నారు. కాంగ్రెస్ నుంచి 2001లో టీఆర్ఎస్ లో చేరారు. పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా పనిచేశారు. 2002లో కారు గుర్తుపై కార్పొరేటర్ అయ్యారు. 2004లో సికింద్రాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009 సనత్ నగర్ లో పోటీచేసి.. ఓటమిపాలయ్యారు. తెలంగాణ ఏర్పడ్డాక 2014 లో సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా గెలుపొంది.. ఎక్సైజ్ శాఖ, క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2018 ఎన్నికల్లో గెలిచాక డిప్యూటీ స్పీకర్ పదవి వరించింది. మొన్నటి ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
అన్ని కాలాల్లోనూ అంటిపెట్టుకుని..
అప్పుడు ఇప్పుడు అని కాదు.. బీఆర్ఎస్ ను అన్ని కాలాల్లోనూ అంటిపెట్టుకుని ఉన్నారు పద్మారావుగౌడ్. పార్టీ నుంచి ఎందరు బయటకి పోయినా ఆయన మాత్రం కొంచెం కూడా పక్క చూపు చూడలేదు. మరోవైపు పదవులు ఇచ్చినా ఇవ్వకున్నా బీఆర్ఎస్ లోనే కొనసాగారు. ఇక ఇప్పుడు కీలకమైన సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీకి దిగుతున్నారు. కార్పొరేటర్ గా హైదరాబాద్ కౌన్సిల్ లో, ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్లిన పద్మారావు గౌడ్ మరి ఎంపీగా పార్లమెంటు మెట్లు ఎక్కుతారా చూడాలి?