ఇద్దరు సీనియర్ నేతల మధ్య గొడవకు కారణమేంటి?

ఢీ అంటే ఢీ అనే స్థాయికి వారి మాటలు వచ్చాయంటే పరిస్థితి ఎలా మారిందో అర్థం చేసుకోవచ్చు.

Update: 2024-05-08 08:10 GMT

వరంగల్ లో నేతల మధ్య సయోధ్య కుదరడం లేదు. విభేదాలు పెరుగుతున్నాయి. మాటల యుద్ధం వారిలో కొత్త వైరానికి కారణంగా నిలుస్తోంది. వారి మధ్య వివాదం చెలరేగడానికి మూడో వ్యక్తి కారణంగా నిలుస్తున్నాడు. అతడి కోసం ఇద్దరు నేతలు పరస్పరం దూషణలకు దిగుతున్నారు. ఢీ అంటే ఢీ అనే స్థాయికి వారి మాటలు వచ్చాయంటే పరిస్థితి ఎలా మారిందో అర్థం చేసుకోవచ్చు.

వారిద్దరు సమ ఉజ్జీలే. రెండుపార్టీలకు ప్రాతినిధ్యం వహించారు. సమర్థులైన నేతలే. కీలకంగా పార్టీలను గెలిపించేవారే. ఒకరు మహిళలకు ఆశాదీపం కాగా మరొకరు పలు పార్టీల్లో తిరిగిన అనుభవం గడించిన నేత. ఒకరు కొండా సురేఖ కాగా మరొకరు రేవూరి ప్రకాశ్ రెడ్డి. ఇద్దరు పేరున్ననేతలేకావడం గమనార్హం. వీరి మధ్య గొడవకు కారణాలేంటని అనుకుంటున్నారా?

తెలంగాణ మంత్రి కొండా సురేఖ, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మధ్య ఆడియో టేప్ ఒకటి వైరల్ అవుతోంది. పార్టీ నాయకుడు భరత్ విషయంలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం పెరిగింది. భరత్ ను అవమానిస్తే తనను అవమానించినట్లే ని సురేఖ అనడంతో వివాదం ముదిరింది. అతడి ప్రవర్తన నచ్చకనే పక్కన పెడుతున్నామని ప్రకాష్ రెడ్డి పేర్కొనడంతో ఇద్దరి మధ్య మాటల పట్టింపులు పెరిగాయి.

ఈ నేపథ్యంలో మీ మీటింగులకు మా వాళ్లు రారని సురేఖ తేల్చి చెప్పడంతో మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండని ప్రకాశ్ రెడ్డి ఫోన్ కట్ చేయడం జరిగింది. ఇలా ఒక వ్యక్తి కోసం ఇద్దరు గొడవకు దిగడం చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి జిల్లాకు చెందిన ఇద్దరు సీనియర్ నేతలు ఓ వ్యక్తి కోసం గొడవల వరకు వెళ్లడం అందరిలో సందేహాలకు తావిచ్చింది.

ఇద్దరు ఉద్దండులే. జిల్లాకు దిశానిర్దేశం చేసే నేతలే. వారే గొడవకు దిగడం అనేక ప్రశ్నలకు కారణంగా నిలుస్తోంది. పార్టీని ముందుండి నడిపించాల్సిన నేతలే ఇలా రాద్ధాంతాలకు పోతే పార్టీ పరువు ఏం కాను అనే వాదనలు వస్తున్నాయి. ఇద్దరు కలిసి పార్టీని ముందుకు నడిపించాల్సిందిపోయి ఇలా లొల్లిలు చేసుకోవడంతో పార్టీ నేతల్లో కొత్త ఆలోచనలకు ఆజ్యం పోస్తోంది.

Tags:    

Similar News