ఢిల్లీ వాయుకాలుష్యానికి పరిష్కారం "కృత్రిమ వర్షం"... ఐఐటీ కాన్పూర్!

రసాయనాలు చల్లేందుకు ఎయిర్ క్రాప్ట్ లో తీసుకున్న మార్పులకు డీజీసీఏ అనుమతి కూడా అవారమని తెలిపారు.

Update: 2023-11-08 03:47 GMT

దేశ రాజధాని ఢిల్లిలో వాయు కాలుష్యం రోజు రోజుకీ పెరిగిపోతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వాయు నాణ్యత రోజు రోజుకూ పడిపోతోంది. ఈ విషయంపై సుప్రీంకోర్టు ఆందొళన వ్యక్తం చేసింది. తప్పు మీదంటే మీదంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయం చేయొద్దని తెలిపింది! అప్పటికే ఢిల్లీలోని పాఠశాలలకు ఆప్‌ సర్కారు సెలవులు ప్రకటించింది. ఈనెల 13 నుంచి వాహనాల రాకపోకలపై మరోసారి సరి-బేసి విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది.

ఇదే సమయంలో నిర్మాణాలను ఆల్ మోస్ట్ ఆపేసింది! ప్రభుత్వం చేపట్టే బ్రిడ్జ్ లు, ఫ్లై ఓవర్ల నిర్మాణాలను సైతం తాత్కాలికంగా నిలిపేసింది. అయితే ఇది ఈ ఏడాదే మొదటిసారి కాదు. ప్రతీ ఏటా ఈ సీజన్ వచ్చిందంటే దేశరాజధానిలో పరిస్థితి ఇలానే ఉంటుంది. అయితే ఈ రెగ్యులర్ సమస్యకు పరిష్కారం చూపిస్తుంది ఐఐటీ-కాన్పూర్‌. ఇందులో భాగంగా... ఢిల్లీ సహా రాజధాని పరిసర ప్రాంతాల్లో కాలుష్యానికి "కృత్రిమ వర్షం"తో చెక్‌ పెట్టొచ్చని చెబుతోంది.

ఏమిటీ కృత్రిమ వర్షం?:

గాలిలోనున్న మేఘాలపై రసాయనాలు చల్లడం ద్వారా వర్షాలను కురిపించడాన్నే కృత్రిమ వర్షం (క్లౌడ్‌ సీడింగ్‌) అంటారు. ఇప్పటికే అమెరికా, చైనా, దుబాయ్ వంటి దేశాల్లో విజయవంతంగా ఈ కృత్రిమ వర్షాలు కురిపిస్తున్నారు. ప్రధానంగా నీటి కొరత అధికంగా ఉండే ప్రాంతాల్లో ఈ విధానం ఒక వరం అనే చెప్పాలి. ఫలితంగా కరువు పరిస్థితులు తలెత్తడం అనే మాట వినిపించకుండా జాగ్రత్తలు పడొచ్చు!

ఈ క్రమంలో ఆ మధ్య కాలంలో దేశంలో విపరీతంగా పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలను అదుపులోకి తీసుకురావడం కోసం దుబాయిలో కృత్రిమ వర్షం కురిపించారు. ఈ క్రమంలో ఇప్పుడు దేశరాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యానికి కూడా ఇదే మందు అని.. దీనితో ఆ సమస్యకు చెక్‌ పెట్టొచ్చని చెబుతున్నారు ఐఐటీ - కాన్పూర్‌ పరిశోధకులు!

ఐఐటీ - కాన్పూర్‌ పరిశోధకులు చెబుతున్నదేమిటి?:

కృత్రిమ వర్షానికి సంబంధించి ఈ ఏడాది జులైలో విజయవంతంగా ప్రయోగాలు చేసామని, దీనికోసం ఏళ్ల తరబడి పలు టీం లు పనిచేశాయని ఈ ప్రాజెక్ట్‌ లో కీలకంగా వ్యవహరించిన ఐఐటీ - కాన్పూర్‌ కంప్యూటర్‌ సైన్స్‌, ఇంజినీరింగ్‌ విభాగం ప్రొఫెసర్‌ మణీంద్ర అగర్వాల్‌ తెలిపారు. ఇది తమ ఐదేళ్ల కష్టం అని వివరిస్తున్నారు.

ఇందులో భాగంగా మేఘాలపై రసాయనాలు చల్లేందుకు ఎయిర్‌ క్రాఫ్ట్‌ ను రూపకల్పన చేసినట్లు చెబుతున్న మణీంద్ర... దీనికి సంబంధించిన కొన్ని విడిభాగాలను అమెరికా నుంచి దిగుమతి చేసుకున్నట్లు తెలిపారు. మధ్యలో కొవిడ్‌ రావడం వల్ల ఈ ప్రాజెక్ట్‌ ఆలస్యమైందని వివరించారు.

ఏమేమి అనుమతులు అవసరం?:

ఈ ప్రాజెక్ట్ కోసం అనేక అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా డైరెక్టరేట్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోం అఫైర్స్‌ తో పాటు అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వలయంలో ఉండే దేశ రాజధాని ఢిల్లీపై విమానాలు ఎగరడానికి ప్రధానికి రక్షణ కల్పించే స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌ (ఎస్పీజీ) అనుమతి కూడా పొందాల్సి ఉంటుందని మనీంద్ర చెప్పారు. రసాయనాలు చల్లేందుకు ఎయిర్ క్రాప్ట్ లో తీసుకున్న మార్పులకు డీజీసీఏ అనుమతి కూడా అవారమని తెలిపారు.

కాగా... ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్‌ రాయ్‌ ఇదే అంశంపై గతంలో మాట్లాడిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... తమ ప్రభుత్వం క్లౌడ్‌ సీడింగ్‌ కు సిద్ధంగా ఉందని ఈ ఏడాది సెప్టెంబర్‌ లో ఆయన వెల్లడించారు.

Tags:    

Similar News