పోటీ చేయరు.. దీటుగా నిలవరు.. ఇదేంది కిషనన్న?
సరిగ్గా ఏడాది క్రితం తెలంగాణలో బీజేపీ ఇంకా గట్టిగా పోరాడితే రెండోస్థానమైనా దక్కుతుందనే అభిప్రాయం ఉండేది.. కానీ, ఇప్పుడు మూడో స్థానం (మజ్లిస్ కు ఏడుసీట్లు ఖాయం కాబట్టి) కూడా దక్కదనే విమర్శలు వస్తున్నాయి.
సరిగ్గా రెండేళ్ల కిందటి వరకు తెలంగాణలో ఈసారి బీజేపీకి అద్భుత ఫలితాలు ఖాయం అన్న అంచనా ఉండేది. సరిగ్గా ఏడాది క్రితం తెలంగాణలో బీజేపీ ఇంకా గట్టిగా పోరాడితే రెండోస్థానమైనా దక్కుతుందనే అభిప్రాయం ఉండేది.. కానీ, ఇప్పుడు మూడో స్థానం (మజ్లిస్ కు ఏడుసీట్లు ఖాయం కాబట్టి) కూడా దక్కదనే విమర్శలు వస్తున్నాయి. కనీసం ఐదు సీట్లు గెలిచినా గొప్పనే అనే పరిస్థితి ఎత్తిపొడుపులు వినిపిస్తున్నాయి. దీనంతటికీ ఆ పార్టీ చేజేతులా చేసుకున్న తప్పులే.
ఊపు నుంచి వెనక్కుపోయి
తెలంగాణలో బీజేపీ మాంచి ఊపులో ఉండగా వచ్చింది మునుగోడు ఉప ఎన్నిక. వాస్తవానికి ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన రాజగోపాల్ రెడ్డిని చేర్చుకోవడం వరకు బీజేపీ సరైన విధంగానే వెళ్లింది. కానీ, ఆయనతో రాజీనామా చేయించకుండా ఉండాల్సింది. అంతేగాక, ఉప ఎన్నిక సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిందన్న ఆరోపణలు రావడం బీజేపీకి డ్యామేజ్ చేసింది. ఇక మునుగోడులో ఓడిపోవడంతో అనుకున్నంత మైలేజీ రాలేదు. ఇవన్నీ పక్కనపెడితే, ఎన్నికల ఏడాదిలో, అందులోనూ నాలుగైదు నెలల్లో ఎన్నికలు ఉన్నాయనగా.. రాష్ట్ర అధ్యక్షుడిని మార్చి మరింత వెనక్కు వెళ్లిపోయింది. విమర్శలు ఉన్నప్పటికీ.. అప్పటివరకు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ బీజేపీని ఎంతో కొంత ముందుకు తీసుకెళ్లారు. అనూహ్యంగా ఆయన్ను పక్కనపెట్టి కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డిని రాష్ట్ర అధ్యక్షుడిని చేసింది.
సాఫ్ట్ గా ఉంటే సరిపోదు..
కిషన్ రెడ్డి బీజేపీలోనే పుట్టి పెరిగారు. అందులో ఎలాంటి సందేహమూ లేదు. గతంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగానూ పనిచేశారు. ఓ ఇరవై ఏళ్ల కిందటే చిన్నారుల గుండె ఆపరేషన్ శస్త్రచికిత్సల కోసం మంద క్రిష్ణ మాదిగతో కలిసి అద్భుత ఉద్యమం చేశారు. అందరినీ కదిలించి అభిమానం పొందారు. అయితే, ఆయన దూకుడుగా వెళ్లలేరు. అందులోనూ బీఆర్ఎస్ ప్రభుత్వంపై కిషన్ రెడ్డి తరహా సాఫ్ట్ పోరాటం సరిపోదు. కానీ, ఆయనే రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతలు అప్పగించింది బీజేపీ హైకమాండ్.
మరి పోటీ చేయరా..?
సరే.. బీజేపీ నిర్ణయమే సరనుకుందాం. కిషన్ రెడ్డి పోరాట స్ఫూర్తిని తప్పుబట్టడానికి ఏమీ లేదు. అయితే, అధికారంలోకి వచ్చేస్తామని చెబుతున్న తెలంగాణలో మరి ఆయన పోటీ చేయాలి కదా..? తనకు అడ్డాలాంటి అంబర్ పేటలో బరిలో దిగాలి కదా? బీజేపీ ఎంపీలుగా ఉన్న బండి సంజయ్, ధర్మపురి అర్వింద్ పోటీకి దిగతుండగా, కేంద్ర మంత్రి హొదాలో ఉండి కిషన్ రెడ్డి కూడా అసెంబ్లీ ఎన్నికల్లో నిలవాలి కదా? కానీ, అనూహ్యంగా ఆయన పోటీకి దూరంగా ఉన్నారు.
ఏమని సమాధానం చెబుతారు?
అంబర్ పేటలో కిషన్ రెడ్డి పోటీకి దిగకపోవడం విమర్శలకు తావిచ్చినట్లు అవుతుంది. తెలంగాణలో బీజేపీ వెనుకబడిపోయిందన్న ప్రచారానికి అడ్డుకట్ట వేస్తూ, పార్టీకి ఊపు తెస్తూ.. కిషన్ రెడ్డి ఎన్నికల్లో పోటీ చేస్తే బాగుండేది. అయితే, ఆయన మరోసారి పార్లమెంటుకే పోటీ చేసే ఉద్దేశంలోనే ఉన్నట్లున్నారు. కానీ, అంబర్ పేటలో కిషన్ రెడ్డి తమ అభ్యర్థి కాలేరు వెంకటేష్ కు భయపడే పోటీకి దిగడం లేదని మంత్రి కేటీఆర్ విమర్శిస్తున్నారు. కాగా, తెలంగాణ ఉద్యమం హోరెత్తుతున్న సమయంలో కిషన్ రెడ్డి అంబర్ పేట ఎమ్మెల్యేగా ఉన్నారు. మరో ఎమ్మెల్యేగా ఉన్న నిజామాబాద్ అర్బన్ యెండల లక్ష్మీనారాయణ రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో పోటీ చేశారు. కిషన్ రెడ్డి మాత్రం రాజీనామా చేయకపోవడం గమనార్హం. దీనిపై విమర్శలు కూడా వచ్చాయి. సరిగ్గా అలానే, అత్యంత కీలకమైన సమయంలో కిషన్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటున్నారు.