కనిష్ఠంగా 7.. గరిష్ఠంగా 17.. గులాబీ సారు లెక్క ఇదేనట
ఎన్నికల్లో పార్టీ గెలుపు మీద తనకు ఎలాంటి అనుమానం లేదని అదే పనిగాచెబుతున్న ఆయన.. కనిష్ఠంగా 95 సీట్లలో.. గరిష్ఠంగా 105 సీట్లలో గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఆత్మవిశ్వాసమా లేదంటే వ్యూహాత్మకమా? అన్నదిప్పుడు ఆసక్తికర చర్చగా మారింది గులాబీ బాస్ మాటలు వింటున్నప్పుడు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే నాటికి తిరుగులేని అధిక్యత గులాబీ పార్టీదే అన్న సీన్ లో నుంచి.. ఇప్పుడు కాంగ్రెస్ ఊపు కనిపిస్తోందన్న మాట తరచూ వినిపిస్తున్న వేళ.. సీఎం కేసీఆర్ నోటి నుంచి వచ్చిన మాటలు ఆసక్తికరంగా మారాయి.
ఎన్నికల్లో పార్టీ గెలుపు మీద తనకు ఎలాంటి అనుమానం లేదని అదే పనిగాచెబుతున్న ఆయన.. కనిష్ఠంగా 95 సీట్లలో.. గరిష్ఠంగా 105 సీట్లలో గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాజాగా శామీర్ పేట మండలంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా తమ పదేళ్ల పాలన గురించి సుదీర్ఘంగా వివరించారు. ఉమ్మడి పాలనలో మంజీరా నది ఎండిపోయి 800 అడుగులు లోతు బోరు వేసినా నీళ్లు పడేవి కాదని.. ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోతే ఒక్కో బావికి రూ.2 వేలనుంచి రూ.3వేలు వేసుకొని బాగు చేయించుకునే పరిస్థితి ఉండేదన్న ఆయన.. నాడు చంద్రబాబు కరెంటు బిల్లులు పెంచమని మోసం చేయటంతో తాను ఉద్యమాన్ని షురూ చేసిన వైనాన్ని గుర్తు చేశారు.
దేశంలోని అన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాలు తగ్గిపోతే.. తెలంగాణలో మాత్రం పెరిగాయని చెప్పారు. కాళేశ్వరం.. కొండపోచమ్మ.. మల్లన్నసాగర్ ప్రాజెక్టులతోనే ఇది సాధ్యమైందన్న ఆయన.. ఈ ప్రాజెక్టుల మొదటి దశను కాంగ్రెస్ నేతలు అడ్డుకునే ప్రయత్నాలు చేసిందని ఆరోపించారు. మొదటి దశ పూర్తై.. రెండో దశలోకి వెళుతున్న వేళ.. రాష్ట్రాన్ని మరింత డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రిజర్వాయర్ల కోసం భూములు కోల్పోయిన వారి బాధ చాలా పెద్దదని.. తమతో పాటు.. తమ అత్తగారి ఊర్లో భూములు కోల్పోయారని గుర్తు చేశారు.
పదేళ్ల కాలంలో తమ ప్రభుత్వం చేసిన పనుల గురించి అదే పనిగా చెబుతున్న కేసీఆర్.. వేరే వారి చేతికి అధికారం వస్తే.. ఇప్పుడున్న దాన్ని చెడగొడతారని ఆయన హెచ్చరిస్తున్నారు. అందుకే.. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని.. విపక్షాల చేతికి పగ్గాలు చిక్కితే తెలంగాణకు నష్టం వాటిల్లుతుందన్న ఆందోళను వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు విపక్షాల బలాన్ని తెలిపేలా కేసీఆర్ మాటలు ఉంటున్నాయి. అదే సమయంలో ఆయన తమ గెలుపు మీద అపరిమితమైన ధీమాను వ్యక్తం చేయటం ఆసక్తికరంగా మారింది.
కేసీఆర్ తాజాగా చెప్పిన లెక్కనే తీసుకుంటే తమ పార్టీ కనిష్ఠంగా 95 సీట్లు గెలుస్తుందన్న అంచనానే నిజమని అనుకుందాం. దీనికి ఏడుగురు మజ్లిస్ ఎమ్మెల్యేల్ని కలుపుకుంటే మొత్తం 102 మంది ఎమ్మెల్యేలు అవుతారు. అదే కేసీఆర్ర చెప్పిన గరిష్ఠ లెక్కను పరిగణలోకి తీసుకుంటే.. 105 సీట్లకు మరో ఏడు స్థానాల్ని కలిపితే 112 సీట్లు. తెలంగాణలో ఉన్న మొత్తం అసెంబ్లీ స్థానాలు 119 కాగా.. విపక్షాలు కనిష్ఠంగా ఏడు.. గరిష్ఠంగా 17 సీట్లలో మాత్రమే గెలిచే వీలుందని చెబుతున్నారు. అయితే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటి పరిస్థితి ఏమాత్రం లేదన్నఅభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉన్న ఈ వేళలో కేసీఆర్ నోటి నుంచి వస్తున్న లెక్కలు ఏ మాత్రం సరికావంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.