ఈ రచ్చేంది జగన్? వారిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడండి!
అధికారం చేజారిన తర్వాత రాజకీయ పార్టీల్లో లుకలుకలు కాస్త ఎక్కువ అవుతూ ఉంటాయి. దీనికి వైసీపీ మినహాయింపు కాదు.
అధికారం చేజారిన తర్వాత రాజకీయ పార్టీల్లో లుకలుకలు కాస్త ఎక్కువ అవుతూ ఉంటాయి. దీనికి వైసీపీ మినహాయింపు కాదు. టీడీపీ అధినేత చంద్రబాబు మాదిరే.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం.. పార్టీ విభేదాలు ముదిరే వరకు పట్టనట్లుగా వ్యవహరిస్తారన్న అభిప్రాయం ఉంది. ఏదైనా సమస్యను మొగ్గలో ఉన్నప్పుడే తుంచే విషయంలోజగన్ కాస్త నెమ్మదిగా స్పందిస్తారన్న విమర్శ ఉంది. తన స్థాయి వరకు వచ్చే వరకు ఆగే ధోరణితో పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందన్న ఆవేదనను కిందిస్థాయి కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నారు.
అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో వైసీపీ నేతల మధ్య వర్గపోరు అధిపత్య పోరు స్థాయికి వెళ్లింది. ఈ ఇద్దరి నేతల మధ్య పంచాయితీ అంతకంతకూ ముదురుతోంది. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఒక వర్గం.. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అనుచరుల మధ్య రచ్చ స్థాయి దాటిపోయిందని చెబుతున్నారు. ఇరు వర్గాలకు చెందిన కార్యకర్తలు సోషల్ మీడియాను వేదికగా చేసుకొని పోస్టులు పెడుతున్నారు. పోటాపోటీగా పెట్టుకుంటున్న ఈ లొల్లి పార్టీకి ఇబ్బందికరంగా మారింది.
ఈ మొత్తం ఇష్యూకు ఆరంభం మాజీ ఎంపీ మాధవ్ గా చెప్పాలి. కొత్త సంవత్సర ఆరంభం (జనవరి1)న ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు. ఈ విందు రాజకీయంతో ఇరు వర్గాల మధ్య విమర్శలు.. ప్రతివిమర్శలు మొదలయ్యాయి.ఎన్నికల వేళ కొందరు నేతలు తనకు వ్యతిరేకంగా పని చేయటంతోనే తాను ఓడినట్లుగా ప్రకాశ్ రెడ్డి వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కౌంటర్ గా పార్టీలో బీసీలు అన్యాయానికి గురి అవుతున్నారంటూ గోరంట్ల మాధవ్ అనుచరులు సోషల్ మీడియా వేదికగా కౌంటర్లు వేస్తున్నారు.
ఈ రెండు వర్గాలు ఎక్కడా తగ్గకుండా ఒకరికి మించి మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్న గోరంట్ల మాధవ్.. రాప్తాడు నియోజకవర్గం మీద ప్రత్యేక ఫోకస్ చేయటంతో ప్రకాష్ రెడ్డి వర్గం అలెర్టు అయ్యింది. రాప్తాడు బాధ్యతల్నిమాధవ్ కు అప్పగించేలా అధినాయకత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రచారం జరిగింది.
దీంతో ఆగ్రహానికి గురైన తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి.. మాధవ్ కు బాధ్యతలు అంటూ ప్రచారంచేసిన వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయించారు. దీంతో.. బీసీ వర్గాలకు చెందిన నేతల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉండగా పార్టీకి చెందిన బీసీ వర్గాల నేతలు.. ద్వితీయశ్రేణి క్యాడర్ మాజీ ఎమ్మెల్యే పై గుర్రుగా ఉన్నారు. తమకు ప్రకాశ్ రెడ్డి నాయకత్వం వద్దన్న తీర్మానాన్ని పార్టీ అంతర్గత సమావేశాల్లో డిసైడ్ చేసినట్లుగా చెబుతున్నారు.
దీనికి ప్రతిగా ప్రకాశ్ రెడ్డి వర్గానికి చెందిన కొందరు నేతలు పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధం కావటం.. ఆ వివరాలు సోషల్ మీడియాలో పోస్టులుగా మారటం ఇష్యూగా మారింది. మరోవైపు రాప్తాడు నియోజకవర్గంలో తన సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు అత్యధికంగా ఉండటంతో అక్కడ తన పట్టు పెంచుకోవటానికి గోరంట్ల తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా తన సామాజిక వర్గానికి చెందిన నేతల మద్దతు కూడబెట్టుకునే దిశగా మాధవ్ అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా తన రాజకీయ ప్రత్యర్థి పరిటాల కుటుంబంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.
ఏ చిన్న అవకాశం లభించినా వదలట్లేదు. తాజాగా తగరకుంట వద్ద దాడి ఘటన జరిగింది. ఈ విషయం తెలిసినంతనే మాధవ్ ఆగమేఘాల మీద వచ్చి.. పరామర్శించారు. మొత్తంగా పార్టీకి చెందిన ఇద్దరు ముఖ్యనేతలు ఎవరికి వారుగా ఉండటం.. రెండు వర్గాలకు చెందిన అనుచరులు సోషల్ మీడియాలో విమర్శలు చేసుకోకుండా ఉండటం మంచిది.అదే సమయంలో.. ఇలా బజారున పడి తిట్టుకునేకన్నా.. ఇరువురు నేతల్ని పార్టీ అధినేత కూర్చొబెట్టి సీరియస్ గా చెబితే మొత్తం సెట్ అవుతుందంటున్నారు. మరి.. ఆ దిశగా జగన్ అడుగులు వేస్తారా? అన్నదిప్పుడు ప్రశ్నగామారింది.