కాపులపై తోట త్రిమూర్తులు సంచలన వ్యాఖ్యలు!

ఈ సందర్భంగా... "రెడ్డి గారి దగ్గర ఎవరైనా పని చేస్తుంటే.. ఆయన ఓ కారు కొనుక్కుని వెళ్తుంటే.. అబ్బో మా రెడ్డి గారు బ్రహ్మాండమైన కారు కొన్నారని చెబుతారు..

Update: 2024-12-02 11:00 GMT

కార్తీక మాసంలో బంధువులు, స్నేహితులతో కలిసి చెట్ల నీడలో.. ప్రత్యేకించి ఉసిరి చెట్టు నీడన కలిసి భోజనం చేయటాన్ని వన భోజనం అంటారు. ఇది ప్రకృతితో మనిషికున్న బంధాన్ని గుర్తు చేసుకునే రోజుగా చెబుతుంటారు. అయితే.. భారతదేశంలో పూర్వీకులు ఏ మంచి సంప్రదాయాన్ని మొదలుపెట్టినా.. అది కాలక్రమేణా పూర్తిగా అర్ధం, రూపం మార్చుకుంటుందని అంటుంటారు.

ఇందులో భాగంగానే ఓ మంచి ఉద్దేశ్యంతో ఏర్పాటు చేసిన వన భోజనాలు కాస్త ఇప్పుడు పూర్తిగా రూపు మార్చుకున్నాయని చెబుతుంటారు. ఇందులో భాగంగా... అవి పూర్తిగా కుల భోజనాలుగా మారిపోయిన పరిస్థితి! ఈ కుల భోజనాలకు, ఆయా కులాల్లో రాజకీయాల్లో ఎదిగినవారు ముఖ్య అతిథులుగా హాజరయ్యి ప్రసంగిస్తుంటారు! తాజాగా ఇలాంటి కార్యక్రమంలో తోట త్రిమూర్తులు సంచలన వ్యాఖ్యలు చేశారు.

అవును... కుల భోజనాలుగా మారిన వన భోజనాల కార్యక్రమాలకు ఆయా సామాజికవర్గాల్లోని రాజకీయ నాయకులు ప్రధానంగా ముఖ్య అతిథులుగా హాజరవుతుంటారని అంటుంటారు! ఈ సందర్భంగా వారు చేసే వ్యాఖ్యలు కొన్ని సందర్భాల్లో సంచలనంగా మారుతుంటాయి. ఈ కార్యక్రమాలకు వెళ్తే అలానే మాట్లాడాలని భావిస్తారో ఏమో కానీ.. వారూ వీరూ అని కాదు.. దాదాపు అంతా ఇలానే అని చెబుతుంటారు!

ఈ క్రమంలో తాజాగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రామచంద్రపురంలో జరిగిన కాపు సంఘం వన భోజన కార్యక్రమంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... సమాజంలో కాపుల్లో ఇలాంటి అభిప్రాయం ఉందంటూ తనకు తెలిసిన ఓ ఉదాహరణ చెప్పుకొచ్చారు.

ఈ సందర్భంగా... "రెడ్డి గారి దగ్గర ఎవరైనా పని చేస్తుంటే.. ఆయన ఓ కారు కొనుక్కుని వెళ్తుంటే.. అబ్బో మా రెడ్డి గారు బ్రహ్మాండమైన కారు కొన్నారని చెబుతారు.. ఇదే సమయంలో ఒక చౌదరి గారు ఓ బిల్డింగ్ కట్టారంటే.. అబ్బో మా చౌదరి గారు గొప్ప బిల్డింగ్ కట్టారని చెబుతుంటారు" అని మొదలుపెట్టారు తోట త్రిమూర్తులు.

అనంతరం... "అదే... ఎవరైనా కాపు స్కూటర్ వేసుకుని వెళ్తుంటే... వీడు ఎక్కడ దొబ్బుకొచ్చాడ్రా అని చెబుతారంట" అంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ సమాంలో ఆ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో కొంతమంది ఈలలు వేస్తూ, చప్పట్లు కొడుతూ, జై కాపు అని నినాదాలు చేశారు. దీనిపైనా తోట త్రిమూర్తులు ఘాటుగా స్పందించారు.

ఇందులో భాగంగా.. "చప్పట్లు కొట్టేందుకు సిగ్గు పడాలి.. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఎవరూ మనల్ని బాగు చేయరు.. మన ప్రవర్తన, మన కష్టం మీద మనం బయటపడాలి.. ప్రభుత్వం నుంచి వచ్చే సహకారాన్ని అందిపుచ్చుకోవాల్సిందే తప్పితే.. ప్రభుత్వమే మనల్ని బాగు చేస్తుందని మాత్రం అనుకోవద్దు" అని సూచించారు.

"వ్యాపారంలో అయినా, ఉద్యోగాల్లో అయినా మన ప్రణాళిక మనకు ఉండాలి" అని తెలిపారు. దీంతో... తోట త్రిమూర్తులు చెప్పిన విషయాలు బాగానే ఉన్నాయి కానీ.. అవి చెప్పడానికి ఎంచుకున్న ఉదాహరణ మాత్రం జుగుప్సగా ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి! ఇప్పుడు ఈ వ్యాఖ్యలు తీవ్ర సంచలనంగా మారాయి!

Tags:    

Similar News