నోరు పారేసుకున్న ముగ్గురు మల్దీవుల మంత్రులపై వేటు

అయితే.. ఈ చర్య భారతదేశానికి చేసిన డ్యామేజ్ కు ఏ మాత్రం సరిపోదన్న మాట పలువురి నోటి నుంచి వస్తోంది.

Update: 2024-01-08 05:14 GMT

నోటికి వచ్చినట్లుగా మాట్లాడటం రాజకీయ ప్రత్యర్థుల విషయంలో కామన్ అయ్యింది. పొరుగున ఉన్న దేశం మీదా అవాకులు చవాకులు పేలటం.. ఆ దేశ ప్రతిష్ఠను దెబ్బ తీసేలా నోరు పారేసుకున్న ముగ్గురు మాల్దీవ్ మంత్రులకు తగిన శాస్తి జరిగింది. అయితే.. ఈ చర్య భారతదేశానికి చేసిన డ్యామేజ్ కు ఏ మాత్రం సరిపోదన్న మాట పలువురి నోటి నుంచి వస్తోంది. మన పర్యాటకుల మీద బతికే ఒక దేశం.. మనపైనే నోటికి వచ్చినట్లుగా మాట్లాడటం.. మన దేశాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసే బలుపు పైన భారతీయులు తమదైన ధోరణిలో గాంధీగిరి చేయాల్సిన అవసరం ఉంది.

భారతదేశం పైనా.. భారత ప్రధానిని చులకన చేసేలా మాట్లాడిన ఆ దేశ మంత్రుల బరితెగింపునకు ఆ దేశం బాధ్యత వహించాల్సిందే. మాల్దీవుల మంత్రుల అనుచిత వ్యాఖ్యలపై యావత్ దేశం ఒకతాటి మీదకు వచ్చింది. ప్రముఖులు.. సెలబ్రిటీలు.. వివిధ రంగాలకు చెందిన వారంతా మాల్దీవుల మంత్రుల నోటి దురుసుతనంపై మండిపడుతున్నారు. అయితే.. ఈ చర్య సరిపోదన్నది మర్చిపోకూడదు.

అదే సమయంలో మాల్దీవుల మంత్రుల దారుణ వ్యాఖ్యలపై కేంద్రం తన తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. ఆ దేశ మంత్రుల వ్యాఖ్యలకు నిరసనగా వేలాది మంది భారత పర్యాటకులు తమ మాల్దీవులకు ప్లాన్ చేసుకున్న హాలీడే ట్రిప్పులను రద్దు చేసుకుంటున్న వైనంతో ఆ దేశం దిద్దుబాటు చర్యలకు దిగింది. నోరు పారేసుకున్న ముగ్గురు మంత్రులపై వేటు వేస్తూ అక్కడి సర్కారు నిర్ణయం తీసుకుంది.

ఇటీవల దేశ ప్రధాని నరేంద్ర మోడీ లక్షద్వీప్ లో పర్యటించిన సందర్భంగా.. వాటి ఫోటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేయటం.. అవి కాస్తా వైరల్ గా మారటం తెలిసిందే. లక్షద్వీప్ ను పర్యాటక ధామంగా మార్చాలంటూ ఆయన వీడియోను.. ఫోటోలను షేర్ చేయగా.. వీటికి భారీ ఎత్తున ఆదరణ లభించింది. ప్రధాని మోడీ ఫోటోల్ని షేర్ చేసిన తర్వాత.. లక్షద్వీప్ గురించి గూగుల్ లో పెద్ద ఎత్తున సెర్చ్ చేశారు. అదెంత భారీగా అంటే.. టాప్ 5 సెర్చ్ లో ఒకటిగా లక్షద్వీప్ నిలిచింది.

ఇదిలా ఉంటే.. లక్షద్వీప్ కు ఆనుకొని ఉండి.. భారత పర్యాటకుల్ని విపరీతంగా ఆకర్షించే మాల్దీవులకు చెందిన ముగ్గురు మంత్రులు.. లక్షద్వీప్ ను.. అక్కడి వసతుల్ని గేలి చేయటంతో పాటు.. భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీపై వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. మాల్దీవుల మంత్రి షియునా వ్యంగ్యంగా స్పందిస్తూ.. మోడీని జోకర్ గా.. తోలుబొమ్మగా పేర్కొంటూ ట్వీట్లు చేశారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. దీంతో.. మాల్దీవు దేశ ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు చేపట్టింది. భారత దేశ పర్యాటకులే ఆ దేశానికి ఆయువు పట్టు. తాజా పరిణామాల నేపథ్యంలో తమ దేశానికి జరిగే నష్టాన్ని గుర్తించిన ఆ దేశ సర్కారు.. వెంటనే స్పందిస్తూ.. అనుచిత వ్యాఖ్యలు చేసిన ముగ్గురు మంత్రుల్ని తొలగిస్తున్నట్లుగా పేర్కొంది.

భారత ప్రభుత్వ అభ్యంతరాల్ని పరిగణలోకి తీసుకొని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ముగ్గురు మంత్రులపై చర్యలు తీసుకున్నామని.. ఆ వ్యాఖ్యలు వారి వ్యక్తిగతమే తప్పించి.. తమ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చింది. అంతేకాదు.. భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలకు వెనుకాడమని స్పష్టం చేసింది.

ప్రధాని మోడీపైనా.. భారతదేశం మీదా నోటికి వచ్చినట్లుగా నోరు పారేసుకున్న ఆ దేశ మంత్రులు ఎవరంటే.. షియునా.. మజీద్.. మల్షాలు. వీరిలో ఇద్దరు మహిళా మంత్రులు కావటం గమనార్హం. టూరిజంలో మాల్దీవులతో లక్షద్వీప్ లను ఏ మాత్రం పోల్చలేమంటూ.. ‘భారత్ లో హోటల్ గదులు అసహ్యంగా ఉంటాయి. మా దేశంతో లక్షద్వీప్ కు పోలిక ఏంటి?’ అంటూ ఆ దేశ ఎంపీ జాహీద్ రమీజ్ కూడా నోరు పారేసుకున్నారు. భారత హైకమిషన్ కార్యాలయం అధికారులు నిరసన తెలిపిన నేపథ్యంలో.. అతడి వ్యాఖ్యల్ని సోషల్ మీడియా నుంచి తొలగించారు.

తమ మంత్రివర్గానికి చెందిన ముగ్గురు మంత్రులు చేసి వ్యాఖ్యలపై మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మహ్మద్ నషీద్ తీవ్రంగా ఖండించారు. భారత్ కీలక మిత్రదేశమని.. మాల్దీవుల భద్రత.. డెవలప్ మెంట్లో భారతదేశం చాలా కీలకమని ఆయన వ్యాఖ్యానించారు. అలాంటి దేశాధినేతను ఉద్దేశించి నీచమైన భాషను వాడతారా? అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇదిలాఉంటే.. మాల్దీవు మంత్రుల తీరుపై భారత నెటిజన్లు మాత్రం బాయ్ కాట్ మల్దీవ్స్ అంటూ పిలుపునిస్తూ.. తమ ప్రచారానికి తీవ్రతరం చేస్తున్నారు. మొత్తంగా మాల్దీవ్ మంత్రుల తీరుపై బాలీవుడ్ కు చెందిన పలువురు నటులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. నిరసనను తెలిపారు. తాము ఇకపైఆ దేశానికి వెళ్లమని కొందరు పేర్కొనటం గమనార్హం.

Tags:    

Similar News