వైకుంఠ ఏకాదశి... కూటమి వర్సెస్ వైసీపీ.. !
టోకెన్ల పంపిణీ వ్యవహారంలో తలెత్తిన నిర్లక్ష్యం కావొచ్చు.. ప్రణాళిక లేకపోవడం కావొచ్చు.. ఏదేమైనా.. ఇప్పుడు కూటమి సర్కారుకు తిరుపతిలో జరిగిన ఘటన ఇబ్బంది పెట్టిందనే చెప్పాలి.
ఏడాదికి ఒక్కసారి వచ్చే వైకుంఠ ఏకాదశి పర్వదినం.. ప్రతి ప్రభుత్వానికీ సవాలుగానే మారుతోంది. అయితే.. ఇప్పుడు అది రాజకీయంగా యూటర్న్ తీసుకుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా తిరుపతిలో చోటు చేసుకున్న ఘటన కూటమి సర్కారుకు సెగ పెంచింది. టోకెన్ల పంపిణీ వ్యవహారంలో తలెత్తిన నిర్లక్ష్యం కావొచ్చు.. ప్రణాళిక లేకపోవడం కావొచ్చు.. ఏదేమైనా.. ఇప్పుడు కూటమి సర్కారుకు తిరుపతిలో జరిగిన ఘటన ఇబ్బంది పెట్టిందనే చెప్పాలి.
అయితే.. ఈ సమయంలో వైసీపీ ప్రవేశ పెట్టిన టోకెన్ వ్యవహారంపై టీడీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. అసలు టోకెన్ సిస్టమ్ ప్రవేశ పెట్టడాన్నికూడా వారు తప్పుబడుతున్నారు. మరోవైపు ఈ విషయం లో ప్రభుత్వం ఆచి తూచి వ్యవహరిస్తోంది. దీనిని విమర్శించే విషయంలో సీఎం, డిప్యూటీ సీఎంలు ఇద్దరూ కూడా ఒకింత డిఫెన్సులో పడ్డారు. టోకెన్ వ్యవహారం మంచిదేనని అధికారులు చెబుతున్నారు. దీనివల్ల.. తిరుపతి , తిరుమలకు వచ్చే భక్తులను నిలువరించేందుకు అవకాశం ఉంటుందని వారు అంటున్నారు.
ఇదే విషయాన్ని తాజాగా టీటీడీ ఈవో శ్యామలరావు కూడా సీఎం వద్ద ప్రస్తావించారు. ఇదే ఆయనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణమైంది. ఎవరో ఏదో చేశారని.. ఇప్పుడు చేస్తారా? అని ప్రశ్నించేలా చేసింది. ఇక, వైసీపీ విషయానికి వస్తే.. పొరుగున ఉన్న తమిళనాడులోని శ్రీరంగం ఆలయం లో పాటిస్తున్న టోకెన్ సిస్టమ్‌నే ఇక్కడ కూడా అప్పట్లో వైసీపీ అమలు చేసింది. తద్వారా.. ఎక్కువ మంది కి శ్రీవారి దర్శనం లభించేలా చేశారు. ఇదే సమయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకున్నారు.
దీంతో అధికారులు ఈ విధానాన్నే కొనసాగించారు. కానీ, ప్రణాళిక లోపించడంతోనే తొక్కిసలాట చోటు చేసుకుంది. అదే విధంగా ఏటికేడు పెరుగుతున్న భక్తుల రద్దీని కూడా అధికారులు అంచనా వేయడంలో ఒకింత విఫలమయ్యారనే చెప్పాలి. ఇంతకు మించి తిరుపతి విషయంలో అధికారులు చేసింది కూడా ఏమీ లేదు. కానీ, ముందస్తు ప్రణాళికలు వేసుకుని దానికి తగిన విధంగా ముందుకు సాగి ఉంటే ఈ విషాదం జరిగి ఉండేది కాదు. పైగా ఈ విషయంలో పూర్తిగా టీటీడీకే అప్పగించడం కూడా ఒక పొరపాటేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏదేమైనా జరగాల్సి జరిగిపోయింది.