వారిద్ద‌రూ మా ప‌రువు తీశారు: ప‌వ‌న్‌

''శ్యామలరావు, వెంకయ్య చౌదరి విఫలమయ్యారు.. మీరు చేసిన తప్పులకు ప్రభుత్వం నిందలు మోస్తోంది.. పోలీసులు క్రౌడ్‌ మేనేజింగ్‌ చేయడంలో విఫలమవుతున్నారు..

Update: 2025-01-10 03:40 GMT

తిరుప‌తిలో చోటు చేసుకున్న తొక్కిస‌లాట ఘ‌ట‌న‌పై డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇదేస‌మ‌యంలో ఆయ‌న టీటీడీ కార్య‌నిర్వ‌హ‌ణాధికారి.. ఉప కార్యనిర్వ‌హ‌ణాధికారుల‌పై నిప్పులు చెరిగారు. ఈవో జె. శ్యామ‌ల‌రావు, డిప్యూటీ ఈవో వెంక‌య్య చౌద‌రిలు నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించార‌ని వ్యాఖ్యానించారు. వారి కార‌ణంగా త‌మ ప్ర‌భుత్వ ప‌రువు పోయింద‌న్నారు. ''ఇద్ద‌రు సీనియ‌ర్ అధికారులు వ్య‌వ‌హ‌రించిన తీరుతో ప్ర‌భుత్వం నింద‌లు మోయాల్సి వ‌స్తోంది. వారి వ‌ల్ల ప‌రువు పోయింది'' అని వ్యాఖ్యానించారు.

''శ్యామలరావు, వెంకయ్య చౌదరి విఫలమయ్యారు.. మీరు చేసిన తప్పులకు ప్రభుత్వం నిందలు మోస్తోంది.. పోలీసులు క్రౌడ్‌ మేనేజింగ్‌ చేయడంలో విఫలమవుతున్నారు.. తప్పు జరిగింది, పూర్తి బాధ్యత తీసుకుం టున్నాం.. తొక్కిసలాట జరిగినప్పుడు హెల్ప్ చేసిన పోలీసులు ఉన్నారు. అలాగే చోద్యం చూసిన పోలీసులు ఉన్నారు. పోలీసుల్లో కొందరు కావాలనే వ్యవహరించినట్టు బాధితులు చెప్పారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరగాలి'' అని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ అన్నారు.

ఆసాంతం ఆయ‌న ఘ‌ట‌న జ‌రిగిన ప్ర‌దేశాన్ని ప‌రిశీలించారు. అనంత‌రం.. స్విమ్స్ కు వెళ్లి బాధితుల‌ను ఓదార్చారు. ఆ త‌ర్వాత మీడియాతో మాట్లాడిన ఆయ‌న‌.. ఈ ఘ‌ట‌న త‌న‌ను తీవ్రంగా క‌ల‌చి వేసింద‌ని చెప్పారు. త‌మ కుటుంబ స‌భ్యుల్ని, బంధువుల్ని, గ్రామ‌స్థుల్ని పోగొట్టుకున్న‌వారు ఉన్నారని.. వారితోనూ మాట్లాడిన‌ట్లు తెలిపారు. అన్ని కోణాల్లోనూ స‌మాచారం తెప్పించుకుని ఇలాంటి సంఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా ఉండేందుకు స‌రైన నిర్ణ‌యాలు తీసుకోవాల‌నేది త‌న ఉద్దేశ‌మ‌ని తెలిపారు.

ఈ ప‌విత్ర క్షేత్రంలో అస‌మ‌ర్థ‌త‌తోగానీ, అనాలోచిత చ‌ర్య‌ల వ‌ల్ల‌గానీ చేసిన ప‌నుల వ‌ల్ల ప‌విత్ర‌త దెబ్బ‌తినే ప‌రిస్థితి రాకూడ‌ద‌ని స్ప‌ష్టం చేశారు. తెలిసిచేసినా, తెలియ‌క చేసినా త‌ప్పు త‌ప్పే. అంద‌రం క‌లిసి ఇక్క‌డ దేవునికి సేవ చేస్తున్నామ‌నే భావ‌న ఉండాలని వ్యాఖ్యానించారు. రాజ‌కీయాలు చేయ‌డానికి వీల్లేదన్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. రాజ‌కీయాల‌కు అతీతంగా శ్రీ వేంక‌టేశ్వ‌రునికి సేవ‌చేస్తున్నామ‌నే భావ‌న‌తో అంద‌రం ముందుకెళ్లాల్సిన అవ‌స‌ర‌ముందన్నారు.

Tags:    

Similar News