నిర్మాత అశ్వినీ దత్‌కు కీలక పదవి.. టీడీపీ వర్గాల్లో హాట్ టాపిక్!
దీంతో తెలుగు దేశం కూటమి విజయంపై టాలీవుడ్ హ్యాపీగా ఉన్నదనే విషయం కన్ఫర్మ్ అయింది
తెలుగు దేశం పార్టీకి.. సినీ రంగానికి మధ్య అవినాభావ సంబంధం ఉన్న విషయం తెలిసిందే. మంగళవారం ఏపీలో వెలువడిన ఎన్నికల ఫలితాల అనంతరం.. టీడీపీ నేతృత్వంలోని బీజేపీ, జనసేన కూటమి విజయం దక్కించుకుంది. కనీ వినీ ఎరుగని రీతి లో పెద్ద ఎత్తున విజయం దక్కించుకుంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌లోనూ సంబరాలు చేసుకున్నారు. పలువురు అగ్రదర్శకులు కూడా ఉండవల్లికి వచ్చి.. చంద్రబాబును కలిసి శుభాకాంక్షలు తెలిపారు. దీంతో తెలుగు దేశం కూటమి విజయంపై టాలీవుడ్ హ్యాపీగా ఉన్నదనే విషయం కన్ఫర్మ్ అయింది.
మరీ ముఖ్యంగా టీడీపీ తరఫున 2009లో విజయవాడ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన చలసాని అశ్వినీ దత్ అయితే.. మరింత ఆనందంతో ఉన్నారు. ఎందుకంటే. ఆది నుంచి కూడా అశ్వినీదత్ టీడీపీకి అనుకూలం. 2014 తర్వాత.. ఆ పార్టీకి ఆయన దూరంగా ఉన్నా.. సైద్ధాంతికంగా మాత్రం టీడీపీకి మద్దతు ఇస్తూనే ఉన్నారు. ముఖ్యంగా వైసీపీ హయాంలో చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అరెస్టును ఖండిస్తూ.. సోషల్ మీడియాలోనూ పోస్టులు పెట్టారు. ఇక, రాజమండ్రి జైలుకు వెళ్లి రహస్యంగా పరామర్శించి వచ్చారని అప్పట్లో కథనాలు కూడా వచ్చాయి.
ఇక, అప్పట్లోనే ఆయన టీడీపీ విజయాన్ని అంచనా వేశారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా టీడీపీ గెలుస్తుందని, 160 స్థానాల్లో విజయం కూడా దక్కించుకుంటుందని అశ్వనీదత్ వ్యాఖ్యానించారు. ఆయన చెప్పినట్టుగానే టీడీపీ అధిక సంఖ్యలో విజయం దక్కించుకుంది. ఇలా.. అశ్వినీ దత్ చెప్పినట్టు పార్టీ విజయం దక్కించుకోవడంతో టీడీపీ శ్రేణులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇదిలా వుంటే.. ఈ సారి అశ్వనీదత్‌కు చంద్రబాబు కానుక ఇవ్వనున్నారని అంటున్నారు. దత్ కి టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం టీటీడీ చైర్మన్‌గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఈ పదవికి డిమాండ్ ఏర్పడింది. ఎంతో మంది నాయకులు, ప్రముఖులు కూడా.. ఈ పదవిని కోరుకుంటున్నారు. ఇక, సినీ రంగం నుంచి మురళీ మోహన్ కూడా ఈ పదవిని కోరుకుంటున్నట్టు సమాచారం. అయితే.. ఇప్పుడు అశ్వినీ దత్ కి టీటీడీ చైర్మన్ పదవి దక్కే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మరి చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి.