జడ్జిలపై ట్రోలింగ్.. 26 మందికి నోటీసులు!
హైకోర్టులో క్రిమినల్ కంటెంప్ట్ పిటిషన్ పై వాదనల సందర్భంగా.. క్యాంపెయిన్ గా జడ్జిలపై ట్రోలింగ్ చేశారని అడ్వొకేట్ జనరల్ ఎస్. శ్రీరామ్ కోర్టుకు నివేదించారు.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును ఏపీ ప్రభుత్వం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. విజయవాడలోని ఏసీబీ కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది. హైకోర్టులోనూ ఆయనకు ఉపశమనం దక్కలేదు. దీంతో ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో జడ్జిలకు కులాలను ఆపాదిస్తూ, అలాగే వారిని దూషిస్తూ కొందరు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. వీటిని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది.
చంద్రబాబు అరెస్ట్ తర్వాత.. ఆయన పిటిషన్ లను విచారించిన జడ్జిలపై రాజకీయపరంగా.. ఉద్దేశపూర్వకంగానే దూషణల పర్వం కొనసాగిందని ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టు క్రిమినల్ కంటెప్ట్ పిటిషన్ పై విచారణ జరిపింది. టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సహా 26 మందికి నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. అలాగే ప్రతివాదులుగా ఉన్న గూగుల్, ఎక్స్(ట్విటర్), ఫేస్ బుక్ కు కూడా నోటీసులు ఇవ్వాలని హైకోర్టు స్పష్టం చేసింది. వీరికి నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని ఆదేశించింది.
హైకోర్టులో క్రిమినల్ కంటెంప్ట్ పిటిషన్ పై వాదనల సందర్భంగా.. క్యాంపెయిన్ గా జడ్జిలపై ట్రోలింగ్ చేశారని అడ్వొకేట్ జనరల్ ఎస్. శ్రీరామ్ కోర్టుకు నివేదించారు. ఇద్దరు హైకోర్టు జడ్జీలు, ఏసీబీ జడ్జి ఫ్యామిలీని టార్గెట్ గా చేసుకుని ట్రోలింగ్ చేశారని కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో ట్రోల్ చేసిన సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించాలని ఏపీ డీజీపీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఆ 26 మందికి నోటీసులు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. తదుపరి చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రీని ఆదేశిస్తూ.. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
చంద్రబాబు అరెస్ట్ తర్వాత హైకోర్టు, దిగువ కోర్టు జడ్జిలపై దూషణల పర్వం టీడీపీ నేతలు, ఆ పార్టీ సానుభూతిపరులు జడ్జిలపై వ్యాఖ్యలు చేశారు. వారికి కులాలను ఆపాదించారు. అలాగే కొంతమంది జడ్జిలు వైసీపీ నేతలకు బంధువులని ఆరోపణలు చేశారని అంటున్నారు. టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న మీడియా సైతం జడ్జిల తీర్పులను తప్పుబడుతూ వ్యాఖ్యలు చేసిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బుధ్దా వెంకన్న సహా 26 మందిని రాష్ట్ర ప్రభుత్వం ప్రతివాదులుగా పేర్కొంటూ వీరిపై చర్యలు తీసుకోవాలని పిటిషన్ వేసింది.
దీంతో బుద్దా వెంకన్నతో పాటు ఎస్. రామకృష్ణ, మరికొంతమంది సోషల్ మీడియా పేజీల నిర్వాహకులకు పరిశీలన తర్వాత పోలీసులు నోటీసులు జారీ చేయనున్నారు.
మరోవైపు జడ్జీలపై అభ్యంతరకర పోస్టులపై ఇప్పటికే రాష్ట్రపతి భవన్ సైతం స్పందించింది. పోస్ట్ లు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాష్ట్రపతి కార్యాలయం లేఖ రాసిన సంగతి తెలిసిందే.