"నో ఇన్ కమ్ ట్యాక్స్"... న భూతో న భవిష్యతి లాంటి హామీ!

ఎన్నికల సమయం వచ్చిందంటే సాధ్యాసాధ్యాల సంగతి ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా.. మరి కొంతమంది ఆ హామీల అమలు సాధ్యం కాదని తెలిసినా కూడా..

Update: 2024-10-27 04:15 GMT

ఎన్నికల సమయం వచ్చిందంటే సాధ్యాసాధ్యాల సంగతి ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా.. మరి కొంతమంది ఆ హామీల అమలు సాధ్యం కాదని తెలిసినా కూడా.. ఆ పూట గడవడం కోసం, అబద్ధలా పునాదులపై అధికారాన్ని దక్కించుకుంటుంటారు! మరి కొంతమంది మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తారు. ఈ సమయంలో ట్రంప్ ఇచ్చిన ఓ సంచలన హామీపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి!

అవును... అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలని, అలాకానిపక్షంలో ఇవే తన చివరి ఎన్నికలు అని ప్రకటించిన రిపబ్లిక అభ్యర్థి, మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఓ సంచలన హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా... అమెరికన్స్ అందరికీ ఫెడరల్ ఆదాయపుపన్ను తొలగిస్తానని, అందుకు తనవద్ద ఓ మార్గం ఉందని తెలిపారు. ఇప్పుడు ఈ హామీ తీవ్ర సంచలనంగా మారింది.

ఈ సందర్భంగా స్పందించిన ట్రంప్... ఆదాయపన్నును రద్దు చేయడం వీలవుతుందని.. అందుకు తన వద్ద ఓ మార్గం ఉందని.. సంపద సృష్టించడానికి ప్రత్యామ్నాయం ఉందని చెప్పుకొచ్చారు. ఇందులో భాగంగా... ఆదాయపన్నును రద్దు చేయడం ద్వారా కోల్పోయిన ఆదాయాన్ని సుంకాల ద్వారా తిరిగి పొందవచ్చని ట్రంప్ వాదిస్తున్నారు. ప్రచార కార్యక్రమాల్లో హోరెత్తించేస్తున్నారు.

అయితే.. ఇలా ప్రభుత్వ ఆదాయం కోల్పోకుండా ఆదాయపన్నును రద్దు చేయడానికి ఒక మార్గం ఉందని ట్రంప్ చేస్తోన్న వాదనను ఆర్థిక రంగ నిపుణులు సమర్ధించడం లేదు. ప్రభుత్వ ఆదాయం కోల్పోకుండా, ఆదాయపన్నును రద్దు చేయడం ఆచరణ సాధ్యం కాదని, అది అవాస్తవిక ఆలోచన అని అంటున్నారు.

దీనిపై స్పందించిన ట్రంప్... 1890లలో మనం తెలివైనవారిగా ఉన్నప్పుడు అన్ని టారిఫ్ లు ఉన్నాయి కానీ.. ఆదాయపు పన్ను మాత్రం లేదు.. ఇప్పుడు 1800ల నాటి పన్ను విధానాలను తిరిగి తీసుకొస్తే అమెరికన్ పౌరుడికి ఫెడరల్ ఆదాయ పన్నులను తొలగించడం సాధ్యమవుతుందని నొక్కి చెబుతున్నారు. దీంతో... ఈ హామీ ఎలాంటి సంచలనాలకు దారి తీస్తుందనేది ఆసక్తిగా మారింది.

కాగా... అమెరికాలోని తొమ్మిది రాష్ట్రాల్లో ఆదాయపు పన్ను లేదు. ఇందులో భాగంగా... అలస్కా, నెవాడా, ఫ్లొరిడా, సౌత్ డకోటా, న్యూ హాంప్ షర్, టేనస్సీ, టెక్సాస్, వ్యోమింగ్, వాషింగ్టన్ రాష్ట్రాలు ఆదాయపు పన్నును విధించవు. అయితే... వీటీలో కొన్ని రాష్ట్రాలు డివిడెండ్లు, వడ్డీలపై 3 శాతం.. మూలధన లాభాలపై 7 శాతం పన్నులు విధిస్తుంటాయి.

Tags:    

Similar News