ఎన్నాళ్లకు? ఎన్నికల వేళ ట్రంప్ తో కలిసి కనిపించిన మెలానియా
ఇదంతా ఒక ఎత్తు అయితే.. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓడిన తర్వాత మెలానియా ముచ్చట్లను మీడియా పట్టించుకోవటం మానేసింది.
ఎన్నాళ్లకు మళ్లీ కనిపించారో.. అన్నట్లుగా మారింది ట్రంప్ సతీమణి మెలానియా ట్రంప్. అమెరికా అధ్యక్ష హోదాలో ట్రంప్ సాగినన్ని రోజుల్లో మెలానియా చుట్టూ బోలెడన్ని కబుర్లు.. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య బంధం సరిగా లేదన్న ఆరోపణలు.. అందుకు సాక్ష్యంగా చిన్న వీడియోలెన్నో వైరల్ అయ్యాయి. అధ్యక్ష పదవి నుంచి ట్రంప్ దిగిన కొద్దిరోజులకే మెలానియా తన దారి తాను చూసుకుంటారని.. తన చిన్న కొడుకును తీసుకొని వెళ్లిపోతారంటూ సాగిన ప్రచారం అంతా ఇంతా కాదు.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓడిన తర్వాత మెలానియా ముచ్చట్లను మీడియా పట్టించుకోవటం మానేసింది. ఆ తర్వాత ఆమెకు సంబంధించిన వార్తలు పెద్దగా రాలేదు. ఈసారి ఎన్నికల ప్రచారంలోనూ ఆమె ఊసే లేదు. ఇటీవల కాలంలో ఎప్పుడూ లేని రీతిలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు పోటాపోటీగా సాగటమే కాదు.. తుది ఫలితం వెల్లడి వేళ హోరాహోరీ పోరు తప్పనిసరి అన్న వాదనలు జోరుగా వినిపిస్తున్నాయి.
యావత్ ప్రపంచం అమెరికా అధ్యక్ష ఎన్నికల విజేత ఎవరన్న అంశంపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అధ్యక్ష ఎన్నికల పోలింగ్ రోజున.. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న ట్రంప్ ఓటేయటానికి వచ్చారు. ఫ్లోరిడాలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి మీడియా మొత్తం ట్రంప్ ఓటేయటానికి వచ్చిన సందర్భంలో ఆయన పక్కనే ఓటేసేందుకు వచ్చిన మెలానియా వైపే ఆసక్తి వ్యక్తమైంది.
తన ఎన్నికల నినాదమైన ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ అన్న నోట్ రాసి ఉన్న టోపీని ధరించి ఓటేసేందుకు వచ్చారు. ఆయన సతీమణి మెలానియాతో కలిసి పామ్ బీచ్ లోని పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. ఈ క్రమంలో మీడియాతో మాట్లడారు. సంప్రదాయవాదులు.. రిపబ్లికన్లు ఓటేసేందుకు పెద్ద ఎత్తున బారులు తీరి ఉండటం గౌరవంగా ఉందన్న ఆయన.. ఒక ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చారు.
ఎన్నికల ఫలితాల క్రమంలో హింసాత్మక ఘటనలు జరగకూడదని మీ మద్దతుదారులకు చెబుతున్నారా? అన్న ప్రశ్నకు బదులిచ్చిన ట్రంప్.. తన మద్దతుదారులు హింసాత్మక వ్యక్తులు కాదన్నారు. ‘వారికి ఈ విషయం చెప్పాల్సిన అవసరం లేదు’ అని పేర్కొన్నారు. మరోవైపు డెమొక్రాట్ల అభ్యర్థిగా ఉన్న కమలా హారిస్ ఇప్పటికే తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఆమె తన సొంత రాష్ట్రమైన కాలిఫోర్నియాలో మొయిల్ ద్వారా ఓటేసేయటం తెలిసిందే. ఇక.. ట్రంప్ కు గట్టి మద్దతుదారుగా నిలిచి.. అందరిని ఆశ్చర్యపరిచిన ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ టెక్సాస్ లోని కామెరూన్ కౌంటీలో ఓటేశారు. మొత్తంగా పోలింగ్ ప్రక్రియ ఆద్యంతం ఉత్సాహంగా కనిపించింది. ట్రంప్ తో వచ్చి ఓటేసిన మెలానియా మళ్లీ వార్తల్లో హైలెట్ అవుతున్నారు.