ట్రంప్ కు భార్య పేరు గుర్తు లేదు!

లేట్ నైట్ విత్ సేథ్ మేయర్స్ పేరుతో నిర్వహించే షోలో పాల్గొన్న ఆయన.. ట్రంప్ పై సంచలన ఆరోపణ చేశారు.

Update: 2024-02-28 05:00 GMT

వయసు రీత్యా మతిమరుపు సమస్యను ఎదుర్కోవటంతో పాటు.. ఆయన చాలా విషయాల్ని మర్చిపోయారంటూ అమెరికా అధ్యక్షుడు బైడెన్ పై ఒక నివేదిక రావటం.. దీనిపై అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్న ట్రంప్ కు అస్త్రంగా మారటం తెలిసిందే. అధ్యక్షుడు బైడెన్ కు ఏమీ గుర్తు ఉండటం లేదన్న ట్రంప్.. ఆయనపై తరచూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇలాంటి వేళ.. అమెరికా అధ్యక్షుడు బైడెన్ సైతం రియాక్టు అయ్యారు.తాజాగా ఆయనో షోలో పాల్గొన్నారు. లేట్ నైట్ విత్ సేథ్ మేయర్స్ పేరుతో నిర్వహించే షోలో పాల్గొన్న ఆయన.. ట్రంప్ పై సంచలన ఆరోపణ చేశారు.

తన (ట్రంప్) వయసు కూడా ఇంచుమించు నా వయసే. ఆయన తన భార్య పేరును గుర్తుంచుకోలేరు.. ఆయన్ను కూడా మీరు పరిశీలించాలంటూ బాంబ్ పేల్చారు. అంతేకాదు.. ట్రంప్ ఆలోచనలు అన్నీ కాలం చెల్లినివిగా తేల్చిన బైడెన్ వ్యాఖ్యలతో ఇంతకూ ట్రంప్ తన భార్యను వేరే పేరుతో పిలిచారా? లేదంటే తన మాజీ సహాయకుల్లో ఒకరిని అలా పిలిచారా? అన్న దానిపై స్పష్టత రావట్లేదు. మొత్తంగా బైడెన్ జ్ఞాపకశక్తిపై ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలను తిప్పి కొట్టే ప్రయత్నం చేశారు బైడెన్.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. బైడెన్ జ్ఞాపకశక్తి మరింతగా మసకబారినట్లుగా ఒక కీలక నివేదిక వెలుగు చూసింది. 81 ఏళ్ల ఆయనకు జ్ఞాపకశక్తి చాలా తగ్గినట్లుగా అందులో పేర్కొన్నారు. జీవితంలోని చాలా కీలక ఘటనల్ని ఆయన గుర్తు తెచ్చుకోలేకపోయారని.. కొడుకు బ్యూబైడెన్ ఎప్పుడు మరణించారన్న విషయం గుర్తు లేదని తేల్చారు. అంతే కాదు అమెరికా ఉపాధ్యక్ష పదవిని ఎప్పుడు చేపట్టారో కూడా ఆయనకు గుర్తు లేదన్న విషయాన్ని సదరు నివేదికలో పేర్కొన్నారు. అయితే.. ఈ రిపోర్టును బైడెన్ తీవ్రంగా తప్పు పట్టారు. అయితే.. బైడెన్ జ్ఞాపకశక్తిని చూసిన అమెరికన్లు చాలాసార్లు అవాక్కు అయ్యే పరిస్థితి.

ఇలాంటి పరిస్థితులు సహజంగానే ట్రంప్ కు ఆయుధాలుగా మారాయి. అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. బైడెన్ జ్ఞాపకశక్తి తగ్గిపోవటాన్ని ఒక కీలక అంశంగా మార్చి.. దాన్నో చర్చగా మార్చే విషయంలో ట్రంప్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఇలాంటి వేళ.. ట్రంప్ జ్ఞాపకశక్తిపై సందేహాలు వ్యక్తమయ్యేలా బైడెన్ చేసిన ఆరోపణలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. మొత్తంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థుల జ్ఞాపకశక్తి కీలక అంశంగా మారనుందని చెప్పకతప్పదు.

Tags:    

Similar News